అసెంబ్లీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఉమ్మడి జిల్లాలో భారీగా పోలింగ్ నమోదైంది. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా సజావు గా సాగింది. ఉదయం 7 గంటల నుంచే కేంద్రాల వద్ద ఓటర్లు బారులుదీరారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతవాసులు ఓటేసేందుకు ఆ సక్తి చూపారు. ట్రాన్స్జెండర్లు సైతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించగా.. మరమ్మతుల అనంతరం ఆలస్యంగా ఓటింగ్ ప్రారంభమైంది. మరికొన్ని చోట్ల సాయంత్రం 5 గం టల్లోపు కేంద్రాల వద్దకు వచ్చిన వారిని అనుమతించ డంతో రాత్రి వరకు ప్రక్రియ కొనసాగింది. మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, బాలరాజు, హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, కృష్ణమోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, బీఆర్ ఎస్ అభ్యర్థి విజయుడుతోపాటు ఎంపీ మన్నె, ఎమ్మెల్సీ చల్లా, ముఖ్య నాయకులు, కుటుంబసభ్యులు ఓటు వేశారు. అనంతరం ఈవీఎం మిషన్లను అధికారులు స్ట్రాంగ్‌రూంలకు తరలించారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
మహబూబ్‌నగర్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పలుచోట్ల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రక్తసిక్తమైంది. ఓటమిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నేతలు దాడులకు తెగబడ్డారు. కొల్లాపూర్‌లో పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ నాయకుడు బీఆర్ఎస్ నాయకుడిపై కత్తితో దాడిచేశారు. అచ్చంపేటలో పోలింగ్ వద్ద ఘర్షణకు దిగి బీఆర్ఎస్ కార్యకర్తల తలను పగలగొట్టారు. మన్ననూరులో కాంగ్రెస్ కార్యకర్తలు కావాలని ఘర్షణకు దిగి బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతుండడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. చారకొండ మండలంలో బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. వీపనగండ్ల మండల కేంద్రంలో ఎన్నికల అధికారుల వాహనం ఢీకొని ఒక ఓటరు చేయి విరిగింది. మాగనూరు మండలం వర్కూరులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రామ్మోహన్‌రెడ్డిపై దాడి చేసినంత పనిచేశారు. కోడేరులో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి హైడ్రామాకు తెరలేపారు. ఏకంగా ఒక పోలింగ్ స్టేషన్లో రిగ్గింగ్ జరుగుతుందని అరగంటకు పైగా బైఠాయించారు. మరోవైపు ఈవీఎంలు మొరాయించడంతో ఉమ్మడి జిల్లాలో చాలాచోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.
అలంపూర్, వనపర్తి, నారాయణపేట నియోజకవర్గల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం 7గంటల నుంచి పోలింగ్ కేంద్రాలకు చేరుకొని క్యూలో నిల్చున్నారు. అనేకచోట్ల మోడల్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేయడంతో ఓటర్లు సంతోషంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటల వరకు కొనసాగింది. కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ ఆలస్యంగా జరుగుతుంది. ఐదు గంటల లోపే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వారందరికీ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాటు చేశారు. రాత్రి 8గంటల వరకు ఆయా కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. చెదురుమదురు ఘటనలు మినహా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. సాయంత్రం 5గంటల వరకు మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో 69.32 శాతం, జడ్చర్లలో 73.80, దేవరకద్రలో 78.32, నాగర్‌కర్నూల్‌లో 82.23, అచ్చంపేటలో 78.16, కొల్లాపూర్‌లో 82.75, గద్వాలలో 71.23, అలంపూర్‌లో 76.16, నారాయణపేటలో 66.13, మక్తల్‌లో 69.21, వనపర్తిలో 72.6 శాతం పోలింగ్ నమోదైంది.
సాయంత్రం 5గంటలకు ఓటింగ్ ప్రక్రియ మునియగానే ఆయా రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను సీజ్ చేసి, వీవీ ప్యాట్లను కూడా సీల్ చేశారు. వాటిని బందోబస్తు మధ్య ఆయా నియోజకవర్గ కేంద్రాల స్ట్రాంగ్ రూంలకు తరలించారు. ఎన్నికల పరిశీలకులు రిటర్నింగ్ ఆఫీసర్ల సమక్షంలో స్ట్రాంగ్ రూంలకు సీల్ వేశారు. ఇక అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఈవీఎంలలో దాగుంది. ఈనెల 3వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ ఆయా జిల్లా కేంద్రాల్లో చేపట్టనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేశారు. చాలామంది ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేసేందుకు బారులు తీరారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో ఎన్నారైలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇతర ప్రాంతాల్లో స్థిర నివాసం ఉన్న ఓటర్లను ఆయా పార్టీలు తీసుకువచ్చి ఓట్లు వేయించారు. గ్రామాల్లో మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో పోలింగ్ జరుగుతున్నందునా ప్రైవేటు సంస్థలు, దుకాణాలు మూసివేశారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో ఆయా నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు, ఓడుతారనే ఉత్కంఠ మొదలైంది. మరోవైపు పోలింగ్ ప్రక్రియ సాగేందుకు ఆయా జిల్లా పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. పోలింగ్ జరిగినంత సేపు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్‌లో గురువారం తెల్లవారుజామున బీఆర్ఎస్ నాయకుడు గుజ్జల రమేశ్‌పై కత్తితో దాడి చేశారు. సాతాపూర్ సర్పంచ్ కొడుకు ఏకంగా బీఆర్ఎస్ నేతపై దాడికి దిగడంతో తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకొని చెదరగొట్టారు. పోలింగ్ సందర్భంగా చిన్నకార్పుములలో బీఆర్ఎస్ నాయకుడు మురళీధర్‌రెడ్డిపై కాంగ్రెస్ నాయకుడు నాయినోనిపల్లి మైసమ్మ చైర్మన్ శ్రీనివాస్‌యాదవ్ దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అచ్చంపేట నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ నాయకులు దాడులకు తెగబడ్డారు. పదర మండలం వంకేశ్వరం గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద గణేశ్ అనే బీఆర్ఎస్ కార్యకర్తపై దాడి చేసి తల పగలగొట్టారు. దీంతో అతడిని వెంటనే అచ్చంపేట దవాఖానకు చికిత్స కోసం తరలించారు. మన్ననూరు పోలింగ్‌స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఇరు వర్గాలను చదరగొట్టారు.
చారకొండ మండలంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన గొడవల్లో బీఆర్ఎస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి, ఎల్లూరు, నార్లాపూర్ పోలీస్‌స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున మహిళా ఓటర్లు బారులుతీరారు. ఓటు హక్కు వినియోగించుకోవడం ఆలస్యం అవుతుండడంతో అసహనంతో తోపులాటకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు వారిని సముదాయించి క్యూలో నిలబెట్టారు. వీపనగండ్ల మండల కేంద్రంలో ఎన్నికల అధికారులు వినియోగించే వాహనం ఢీకొట్టడంతో ఓటరు చేయి విరిగింది. గాయపడిన వ్యక్తిని అంబులెన్స్‌లో వనపర్తి దవాఖానకు తరలించి చికిత్స అందించారు. గద్వాల డిగ్రీ కాలేజీ వద్ద బీజేపీ కార్యకర్త ప్రచారం చేస్తుండడంతో పోలీసులు అతడిని బయటికి గెంటేశారు. మహబూబ్‌నగర్ అర్బన్ మండలం బోయపల్లిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. మక్తల్ నియోజకవర్గంలో చాలా చోట్ల కాంగ్రెస్, బీజేపీ నాయకులు పోలింగ్ బూత్‌ల వద్ద డబ్బులు పంపిణీ చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జడ్చర్ల పట్టణంలోని గాంధీ బొమ్మ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు పోలీసులపై అకారణంగా చేయి చేసుకున్నారు. బీఆర్ఎస్ నేత ఇబ్రహీంపై కాంగ్రెస్ నేతలు దాడి చేసి తీవ్రంగా కొట్టారు.
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం మాగనూరు మండలం వర్కూరులో పోలింగ్ కేంద్రం పరిశీలనకు వెళ్లిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేసినంత పనిచేశారు. పోలింగ్ కేంద్రం తనిఖీ చేసి బయటికి వస్తుండగా ఉద్దేశం పూర్వకంగా కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామంలో ఓట్లు పడలేదనే నేపంతో పెద్ద ఎత్తున గుమిగూడి ఎమ్మెల్యే వాహనం నీ చుట్టుముట్టారు. గన్మెన్లు అప్రమత్తమై ఎమ్మెల్యేను బయటికి తీసుకొచ్చారు. దీంతో విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దఎత్తున మోహరించారు. కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం మాచుపల్లిలో రిగ్గింగ్ జరుగుతుందని కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు అరగంట పాటు పోలింగ్ స్టేషన్లో బైఠాయించారు. పెద్దకొత్తపల్లిలో జూపల్లి కృష్ణారావు కార్యకర్తలతో పోలింగ్ స్టేషన్లోకి ప్రవేశించడంతో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చాలా చోట్ల ఈవీఎంలు మురాయించడంతో ఓటింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. గద్వాల నియోజకవర్గ గొర్లఖాన్‌దొడ్డిలో ఈవీఎం నిర్వహించడంతో వేరే ఈవీఎంలు తీసుకువచ్చి పోలింగ్ ప్రారంభించారు. మల్దకల్ మండలం పెద్దొడ్డి, నాగర్‌దొడ్డి గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించడంతో అరగంట ఆలస్యంగా ఓటింగ్ ప్రారంభమైంది. అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం పోతిరెడ్డిపల్లిలో ఈవీఎంల సమస్యతో అరగంట ఆలస్యమైంది. కల్వకుర్తి పట్టణంలోని గాంధీనగర్‌లో ఈవీఎం మొరాయించడంతో 15నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. మున్సిపాలిటీ పరిధిలోని దేశిటిక్యాలలో, దేవరకద్ర నియోజకవర్గం రాచాల, కౌకుంట్లలో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ కొంత ఆలస్యమైంది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా, గ్రామాలు, మండల కేంద్రాలు, పట్టణాల్లో ఓటర్లు కేంద్రాలకు చేరుకొని ఓటేసేందుకు ఉత్సాహం కనబర్చారు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు యువత పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చింది. మరోవైపు అధికారులు మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ఓటర్లు వాటి వద్ద సెల్ఫీలు తీసుకున్నారు.
పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనేక చోట్ల కేంద్ర బలగాలతోపాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. ఒకటి, రెండు నియోజకవర్గాల్లో మినహా 10 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఇక అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఈనెల 3న జరిగే కౌంటింగ్‌లో ఉమ్మడి జిల్లాలోని 173 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది. కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఓటింగ్ ప్రక్రియ ముగియడంతో అధికారులు ఈవీఎంలను బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూంలకు తరలించి సీల్ వేశారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 12 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని 119 పోలింగ్ కేంద్రంలో మంత్రి నిరంజన్‌రెడ్డి, సతీమణి వాసంతి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని పద్మాలయ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సతీమణి శారదతోపాటు కుటుంబ సభ్యులు ఓటు వేశారు. జడ్చర్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుటుంబ సమేతంగా ఓటు వేశారు. మక్తల్‌లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, సతీమణి సుచరిత ఓటు వేశారు. కోయిలకొండ మండలం శేరివెంకటాపూర్‌లో నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి సతీసమేతంగా ఓటేశారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి స్వగ్రామం నుంచి అన్నాసాగర్‌లో సతీమణి మంజులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ధరూర్ మండలం భూరెడ్డిపల్లిలో సతీమణి జ్యోతితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అలంపూర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలంపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడు ఉండవల్లి మండలం పుల్లూరులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి కుటుంబ సమేతంగా తిమ్మాజిపేట మండలం నేరేళ్లపల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అచ్చంపేటలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సతీమణి గువ్వల అమలతో కలిసి ఓటేశారు. కల్వకుర్తిలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, కొల్లాపూర్‌లో బీరం హర్షవర్ధన్‌రెడ్డిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఉమ్మడి జిల్లాలో రాత్రి 10:30 గంటల వరకు పోలైన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌లో 2,32,780 కి గానూ 1,82,734 ఓట్లు పోలవగా, 78.58 శాతం పోలింగ్ నమోదైంది. అచ్చంపేట నియోజకవర్గంలో 2,42,129 ఓట్లకు గానూ 1,93,640 ఓట్లు పోలయ్యాయి. 79.97శాతం పోలింగ్ నమోదైంది. అలాగే కొల్లాపూర్‌లో 2,34,167 ఓట్లకు గానూ 1,87,087 ఓట్లు పోలవగా, 79.89 శాతం పోలింగ్ నమోదైంది. కల్వకుర్తిలో 2,41,762 ఓట్లకు గానూ 2,01,218 ఓట్లు పోలవగా, 83.23శాతం పోలింగ్ నమోదైంది. వనపర్తిలో 77.54 శాతం, నారాయణపేట 78.29, దేవరకద్ర 82.33 శాతం, జడ్చర్ల 81.18, మహబూబ్‌నగర్ 70.41 శాతం నమోదైంది.