త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసింది. బుధవారం నాటికి 31 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 173 మంది బరిలో నిలిచారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 32 మంది, నాగర్‌కర్నూల్‌లో అత్యధికంగా 77 మంది, నారాయణపేటలో 18 మంది, జోగుళాంబ గద్వాలలో 33 మంది, వనపర్తి జిల్లాలో 13 మంది పోటీలో మిగిలారు. కల్వకుర్తి స్థానం నుంచి అత్యధికంగా 24 మంది పోటీలో ఉండగా.. పేట నుంచి ఏడుగురు మాత్రమే ఉన్నారు. ప్రక్రియ సజావుగా ముగిసిందని ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటించారు. ఐదు చోట్ల త్రిముఖ, ఏడు చోట్ల ముఖాముఖి పోరు కొనసాగనున్నది. మహబూబ్‌నగర్, కల్వకుర్తి, నారాయణపేట, మక్తల్ , కొల్లాపూర్ సెగ్మెంట్లలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ట్రయాలింగ్ పోటీ ఉండనుండగా.. మిగతా ఏడు నియోజకవర్గాల్లో నువ్వా.. నేనా అన్న రీతిలో ఉండనున్నది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కారు స్పీడ్‌ను అందుకోలేక మిగతా పార్టీలు వెనుకబడిపోయాయి.
మహబూబ్‌గర్ నవంబర్ 15 : (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా సాగుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు బుధవారం ఆశించిన స్థాయిలో అభ్యర్థులు ఎవరూ ఉపసంహరించుకోకపోవడంతో ఇక పోటీ అనివార్యమైంది. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 173 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలతోపాటు చిన్నాచితక పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి భారీ సంఖ్యలో పోటీలో ఉన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో అత్యధికంగా 24 మంది బరిలో ఉండగా, నారాయణపేట నియోజకవర్గంలో ఏడుగురు పోటీ చేస్తున్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో ట్రాన్స్‌జెండర్ పోటీలో ఉండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మిగతా చోట్ల నోటాతో కలిపి ఒకే ఈవీఎం అవసరం పడితే కల్వకుర్తిలో, గద్వాల సెగ్మెంట్లో మాత్రం రెండు ఈవీఎంలు అవసరమవుతాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు.

ప్రస్తుతం బరిలో ఉన్న అభ్యర్థుల బలబలాలతో ఐదు చోట్ల త్రిముఖపోరు ఉండగా, ఏడుచోట్ల నువ్వా నేనా అనే రీతిలో ముఖాముఖి పోరు ఉండబోతున్నది. నామినేషన్ల ఘట్టం ముగియడంతో అభ్యర్థులంతా ఇక ప్రచార పర్వంలో మునిగిపోయారు.. ఇంకా 15 రోజులు మాత్రమే సమయం ఉండడంతో గడపగడపకు ప్రచారం చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా, గత ఎన్నికలతో పోలిస్తే చిన్నాచితక పార్టీలకు, ఇండిపెండెంట్లను ఈసారి ప్రధాన పార్టీల అభ్యర్థులు పట్టించుకోకపోవడం గమనార్హం. నామినేషన్ వేస్తే ప్రధాన పార్టీ అభ్యర్థులు బుజ్జగిస్తారని అనుకున్నా ఈసారి అలాంటిదేమీ జరగలేదు. కాంగ్రెస్, బీజేపీలకు మాత్రం చాలా నియోజకవర్గాల్లో టికెట్లు రాని అసంతృప్తులు రెబల్స్‌గా పోటీ చేస్తున్నారు. మరికొందరు ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యారు. ఒక అభ్యర్థి మాత్రం ఇంకో పార్టీ టికెట్ తెచ్చుకొని సొంత పార్టీకి చుక్కలు చూపించారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థులు అందరికంటే ముందు ప్రచారం ప్రారంభించి దూసుకుపోతున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో 32మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు మహబూబ్‌నగర్‌లో 15 మంది, జడ్చర్లలో 15, దేవరకద్ర నియోజకవర్గంలో 12 మంది పోటీలో ఉన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 77 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి 24మంది, నాగర్‌కర్నూల్ నుంచి 15, అచ్చంపేట నుంచి 14, కొల్లాపూర్ నుంచి 14మంది బరిలో మిగిలారు. నారాయణపేట జిల్లాలో మక్తల్ నియోజకవర్గం నుంచి 11 మంది, నారాయణపేట నుంచి ఏడుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ జిల్లా నుంచి మొత్తం 18 మంది పోటీ చేస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 33మంది పోటీ చేస్తున్నారు. గద్వాలలో అత్యధికంగా 20 మంది, అలంపూర్ నుంచి 13 మంది పోటీలో మిగిలారు. వనపర్తి నియోజకవర్గంలో 13 మంది పోటీ చేస్తున్నారు. 31 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఘట్టం సజావుగా ముగిసిందని, చిన్న,చిన్న ఫిర్యాదులు ఆయా పార్టీలు చేసినప్పటికీ వాటిని ఎన్నికల కమీషన్‌తో మాట్లాడి సరిదిద్దామని ఎన్నికల అధికారులు తెలిపారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీలకు రెబల్స్ బెడద తప్పడం లేదు. చాలా నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించి భంగపడ్డ వారంతా తమదారి తాము చూసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల ఇంకా అసంతృప్తి రగులుతూనే ఉంది. గద్వాల నియోజకవర్గంలో పార్టీలో ఉన్న వారిని కాదని ఇటీవల పార్టీ మారిన వారికి టికెట్ ఇవ్వడంతో చాలామంది బీఆర్ఎస్లో చేరారు. ఒకరిద్దరు రెబల్స్ పోటీలో ఉన్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో కూడా బీజేపీ నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వడంతో పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. చాలా మంది కారు ఎక్కగా, మరికొందరు బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని మంఇపడుతున్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో టికెట్ ఆశించిన బీసీ నేత బీఆర్ఎస్లో చేరారు. మరో నేత ఏకంగా బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకుని పోటీ చేస్తున్నారు. మక్తల్‌లో కూడా టికెట్ ఆశించిన నేతలు వేరే కుంపటి పెట్టుకున్నారు. జడ్చర్లలో టికెట్ ఇవ్వకపోవడంతో బీసీ నేత కరెక్కగా, మరికొంత మంది సైలెంట్ అయ్యారు. నాగర్‌కర్నూల్‌లో నాగం జనార్దన్‌రెడ్డి పార్టీ మారి బీఆర్ఎస్లో చేరారు. కొల్లాపూర్‌లో కొత్త నేతకు టికెట్ ఇవ్వడంతో అసంతృప్తిలో ఉన్నారు. వనపర్తిలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక బీజేపీ దేవరకద్ర టికెట్ ఆశించిన ఓ నేత రెబల్‌గా నామినేషన్ వేశారు. పార్టీని ఓడిస్తానని శపథం చేస్తున్నారు. మక్తల్ టికెట్ ఆశించిన కొండయ్య అసంతృప్తితో ఉన్నారు. నారాయణపేటలో టికెట్ ఆశించిన సత్యయాదవ్ వర్గం బీజేపీ ఓటు వేసే పరిస్థితుల్లో లేదు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదు చోట్ల త్రిముఖ పోటీ నెలకొన్నది. ఈ నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్దే పైచేయిగా ఉంది. మహబూబ్‌నగర్, కల్వకుర్తి, నారాయణపేట, మక్తల్, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. బీజేపీ నామమాత్రపు పోటీ ఇస్తుండగా, డిపాజిట్లు కూడా గల్లంతయ్యే అవకాశమున్నది. ఇక మిగతా ఏడు నియోజకవర్గాల్లో నువ్వా నేనా అనే రీతిలో పోటీ కొనసాగుతున్నప్పటికీ వార్ వైన్ సైడ్‌గా బీఆర్ఎస్ తన ప్రచారాలతో జోరు పెంచింది. బీజేపీకి డిపాజిట్లు కూడా రావడం కష్టంగా మారింది. మొత్తంపైనా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఈసారి భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేస్తుండడంతో ఓటర్ల తీర్పుపై ఆధారపడి ఉంది.
