నవాబ్‌పేట, ఏప్రిల్ 25 : మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కొత్తపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల హెచ్ఎం బాలచంద్రుడు ఆరో తరగతి చదువుతున్న పాత్లావత్ వినోద్ అనే విద్యార్థిని కొట్టడంతో చేయి విరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థి తల్లిదండ్రులు జమున, భాస్కర్, ఎస్సై విక్రమ్ తెలిపిన వివరాల ప్రకారం ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న వినోద్ ఈనెల 14వ తేదీన తోటి విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలోని వాటర్ ట్యాంకులో ఈత కొడుతుండగా.. హెచ్ఎం బాలచంద్రుడు కోపంతో వెదురుబొంగు కట్టెతో ఈత కొడుతున్న విద్యార్థులపై దాడి చేశారు.
ఈ దాడిలో వినోద్ అనే విద్యార్థి చేయి విరిగింది. తీవ్ర గాయంలోనూ విద్యార్థి అలాగే పరీక్షలు రా శాడు. 23న పాఠశాలకు సెలవులు ప్రకటించడంతో విదార్థి సొంత ఊరైన గోప్యాతండాకు వెళ్లాడు. 24న అతడి తల్లిదండ్రులు జమున, భాస్కర్.. ఏమైందని విద్యార్థిని ప్రశ్నించగా.. విషయం చెప్పాడు. గురువారం మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లగా స్కానింగ్ చేసిన డాక్టర్లు వినోద్‌కు చెయ్యి విరిగిందని తెలిపారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన తల్లిదండ్రులు శుక్రవారం హెచ్ఎంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ జరుపుతున్నట్లు ఎస్సై విక్రమ్ వెల్లడించారు.