జడ్చర్లటౌన్, మార్చి 30 : కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆశ వర్కర్లు కన్నెర్ర చేశారు.. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక పోగా రెండు, మూడు నెలలుగా వేతనాలు పెండింగ్ పెట్టడంపై ఆశ కార్యకర్తలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారులను దిగ్బంధం చేశారు. జీతాలు లేక.. కుటుంబాలు గడవక..పస్తులు ఉండి పనిచేస్తున్నామంటూ వెంటనే ప్రభుత్వం జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆశవర్కర్లు రోడ్డెక్కారు. జీతాలు ఇవ్వలేని కాంగ్రెస్ పాలన మాకు వద్దు.. సీఎం రేవంత్‌రెడ్డి డౌన్‌డౌన్ అంటూ ఆశవర్కర్లు ఆగ్రహించారు. జీతాలు ఇచ్చి ఉద్యోగభద్రత కల్పించాలని కోరుతూ ఉమ్మడి జిల్లాలోని ఆశవర్కర్లు సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని 44వ జాతీయ రహదారిని దిగ్బంధించారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఆశవర్కర్లు జడ్చర్ల వద్ద 44వ జాతీయరహదారిపై బైఠాయించి కాంగ్రెస్ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆకలి మంటల ఈ పోరాటం ఆగదని.. వద్దురా నాయనా ఈ కాంగ్రెస్ పాలన అం టూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. సీఎం రేవంత్‌రెడ్డి డౌన్‌డౌన్ అంటూ నే మరోవైపు సీఎంకు శాపనార్థాలు పెట్టారు. కరోనా సమయంలో కుటుంబాలకు దూరమై ప్రజలకు సేవలు అందించామని, తమకు నెలల తరబడి జీతాలు లేక తమ కుటుంబాలు గడవడమే కష్టంగా మారిందని, పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆశవర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తమ కష్టాన్ని గుర్తించడంలేదని, వెట్టిచాకిరి చేయించుకుంటూ జీతాలు ఆపడం ఏమిటని ప్రశ్నించారు. సమాచారం అందుకున్న మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీటీసీ డీఎస్పీ గిరిబాబు, జడ్చర్ల రూరల్ సీఐ, భూత్పూర్ సీఐలు నాగార్జునగౌడ్, రామకృష్ణ, ఎస్సైలు, పోలీస్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని ఆశవర్కర్లను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఇక్కడి నుంచి కదిలేదిలేదని ఆశవర్కర్లు భీష్మించుకుని రోడ్డుపై బైఠాయించారు. దాదాపు గంటన్నర పాటు జాతీయరహదారిని ఆశవర్కర్లు దిగ్బంధించటంతో హైదరాబాద్-బెంగళూర్ వైపు వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దాదాపు 10 కి.మీ వరకు ట్రాఫిక్ స్థంభించింది.
వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు రంగ ప్రవేశం చేసినా ఆశవర్కర్లు పట్టుదలతో డిమాండ్లను పరిష్కారించాలని భీష్మించుకుని కూర్చోవటంతో మహిళ పోలీసుల చేత రోడ్డుపై నుంచి ఆశవర్కర్లను ఒక్కొక్కరిని ఈడ్చుకుంటూ రోడ్డుపై నుంచి పక్కకు నెట్టేశారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆశవర్కర్లకు మధ్య తోపులాట జరగటంతో ఉద్రిక్తత్త పరిస్థితి ఏర్పడింది. సీఐటీయూ కార్మిక విభాగం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జయలక్ష్మితో పాటు మరికొందరు ఆశవర్కర్లు సొమ్మసిల్లి పడిపోయారు. మహిళలు అని చూడకుం డా పోలీసులు ఆశవర్కర్లను ఈడ్చుకెళ్లి జీపుల్లో ఎక్కించారు. ఆ తర్వాత పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కార్యక్రమంలో సీఐటీ యూ జిల్లా నాయకులు తెలుగు సత్తయ్య, దీప్లానాయక్తోపాటు స్థానిక నాయకులు, ఆశవర్కర్లు తదితరులు పాల్గొన్నారు.