మరికల్ : కుల వృత్తే జీవనాధారంగా బతుకుతున్న నాయి బ్రాహ్మణులకు (Nayi Brahmins) ఆర్టికల్ 19తో (Article 19) అన్యాయం జరుగుతుందని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. వెంటనే ఆ ఆర్టికల్‌ను ఎత్తివేయాలని నారాయణపేట జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి మంగలి గోపాల్, మరికల్ మండల అధ్యక్షుడు రఘు, పట్టణ అధ్యక్షులు నర్సింలు ప్రభుత్వాన్ని కోరారు.
ఆదివారం మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ నాయి బ్రాహ్మనేతరులు సెలూన్ షాప్ పెట్టుకోవచ్చన్న నిబంధన ఉన్న ఆర్టికల్ 19 ని రద్దు చేయాలన్నారు. పూట గడవని స్థితిలో నాయి బ్రాహ్మణులు ఉన్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మొదటి నుంచి మంగలి షాపులతోనే జీవనం సాగిస్తున్నామని నాయి బ్రాహ్మనేతరులు సెలూన్ షాపులు పెట్టుకోవచ్చని హైకోర్టు తీర్పు ఇవ్వడం విచారకరమన్నారు.
న్యాయస్థానం పునరాలోచన చేసి కులవృత్తిని నమ్ముకున్న నాయి బ్రాహ్మణులకు న్యాయం చేయాలని కోరారు. నాయి బ్రాహ్మణులను అన్యాయం జరుగుతున్నా రాజకీయ నాయకులు, పాలకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నాయి బ్రాహ్మణ నాయకులు చంద్రశేఖర్, వేణుగోపాల్, రాములు, బాల్‌రాజ్, భాస్కర్, శివ, శ్రీకాంత్, వెంకట్ రాములు, ఈశ్వర్, నరేష్, బిసన్న, రమేష్, నందు, భరత్, అశోక్ కుమార్, నవీన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.