ఊట్కూర్ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని బిజ్వారం గ్రామం అంబత్రయ క్షేత్రం గురువు ఆదిత్య పరాశ్రీ ( Aditya Parashri ) ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు ( Navratri celebrations ) వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్దం చేస్తున్నారు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాల గోడ ప్రతులను ఆదివారం ఆదిత్య పరాశ్రీ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా ఈనెల 21 ఆదివారం అమావాస్య రోజు నుంచి భక్తులు దుర్గ భవాని మాల ధారణ స్వీకరించాలని సూచించారు. దీక్షలు ధరించే భవానీలకు సంబంధించిన మాలలు, వస్త్రాలు, క్షేత్రంలోనే లభిస్తాయని తెలిపారు.
ఉత్సవాల్లో భాగంగా 22న సోమవారం అమ్మవారి విగ్రహ ఊరేగింపు ఉంటుందని, శైల పుత్రి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారని తెలిపారు. క్షేత్రంలో శత చండీ హోమం, లక్ష కమలార్చన ఉంటుందని తెలిపారు. ఉత్సవాల్లో దాదాపు 15 వేల మంది భక్తులు పాల్గొనేందుకు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామని వివరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా విశేష భజనలు, నాట్య ప్రదర్శనలు, నృత్యాలు ఉంటాయని వెల్లడించారు.