మహబూబ్‌నగర్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో తొలి విడుత ఎన్నికల కోసం గురువారం ఉదయం 10:30కు ఆయా జిల్లా కలెక్టర్లు అధికారికంగా నోటిఫికేషన్లు జారీ చేస్తారు. వెనువెంటనే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పంచాయతీ సర్పంచులు, వార్డు సభ్యులకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈనెల 29వరకు నామినేషన్లను దాఖలు చేయవచ్చు. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లు పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించారు. ఒకవైపు ఎన్నికల ప్రవర్తన నిబంధనావళి పకడ్బందీగా అమలు చేస్తూనే మరోవైపు గ్రామపంచాయతీల ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తున్నారు. ఎన్నికల కోడ్ గట్టిగా అమలు చేసే విధంగా ఇప్పటికే పోలీస్, రెవెన్యూ యంత్రాంగం ప్రణాళిక రెడీ చేసింది. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఈ మేరకు ఆయా పార్టీల మద్దతు కూడా కట్టేందుకు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతున్నందున ఆయా పార్టీలు తమ మద్దతుదారులను రంగంలో దింపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ అన్ని జిల్లాల్లో పార్టీ కార్యకర్తలతో సమన్వయ సమావేశాలు నిర్వహించింది. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ రూరల్ హన్వాడ మండలాల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి పోటీ చేసే అభ్యర్థుల వివరాలను సేకరించారు. గ్రామాల్లో కార్యకర్తలు నాయకులు పోటీ పడకుండా ఏకతాటిపై నిలిచి కాంగ్రెస్ పార్టీని మట్టికర్పించాలని మాజీ మంత్రి పిలుపునిచ్చారు. మరోవైపు అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు వెనుకంజ వేస్తున్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టకపోవడం.. హామీలు అమలు కావకపోవడంతో ప్రజా వ్యతిరేకత తీవ్రమైన సం దర్భంలో పోటీ చేయాలా వద్దా అని డైలామాలో పడ్డారు.
ఇక బీజేపీ నుంచి నామమాత్రంగా పోటీ చేయాలని.. బలమున్న చోటనే లేకపోతే అధికార పార్టీకి మద్దతు ఇవ్వాలని కార్యకర్తలకు లోలోపల నాయకులు సూచించినట్లు ప్రచారం జరుగుతున్నది. అనుకున్న స్థానాల్లో పార్టీల మద్దతు లేకపోయినా కొంతమంది సొంతంగా పోటీ చేసి సత్తా చాటాలని భావిస్తున్నారు. గత ఆరు నెలల నుంచి స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతాయని ఊరించి ఊరించి వాయిదా వేస్తూ రావడంతో చాలామంది ఆశావాహులు పోటీపడేందుకు వెనుకంజ వేస్తున్నారు. గ్రామాల్లో సైతం రాజకీయ కోలాహలం అంతగా కనిపించడం లేదు. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం ఎన్నికల కోలాహలం ఇప్పుడిప్పుడే మొదలైంది. కాగా రిజర్వేషన్ల ప్రక్రియ చాలామంది ఆశలపై నీళ్లు చల్లాయి. కొన్నిచోట్ల పోటీకి రంగం సిద్ధం చేసుకున్న అభ్యర్థులకు రిజర్వేషన్లు కలిసి రాలేదు. మరికొన్ని చోట్ల మహిళలకు రిజర్వు కావడంతో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మొత్తంపై నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో రాజకీయ వేడి పుంజుకొంటుందని విశ్లేషిస్తున్నారు.