అయిజ, జూలై 26 : తుంగభద్ర నదీ జలాలను ఏపీ అనాదిగా దోచేస్తున్నది. సమైక్య పాలనలో ఆర్డీఎస్ ఆయకట్టును ఎండబెట్టి, ఏపీ వైపున తుంగభద్ర నది పొడవునా ఎగువ నుంచి సుంకేసుల బరాజ్ వరకు 18 ఎత్తిపోతల పథకాలకుపైగా ఏర్పాటు చేసింది. కర్ణాటకలోని టీబీ డ్యాం ద్వారా వచ్చే వరదను ఎత్తిపోతల పథకాల ద్వారా దోచేసి లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించుకున్నది. రోజుకు 5వేల క్యూసెక్కులకుపైగా అనధికారికంగా జల దోపిడీకి పాల్పడుతున్నది. అక్రమంగా లిప్టులు ఏర్పాటు చేసి తుంగభద్ర నదీ జలాలను తరలిస్తున్నది. ఒక వైపు టీబీ డ్యాం నుంచి హెచ్ఎల్సీ (హై లెవల్ కెనాల్), ఎల్ఎల్సీ (లో లెవల్ కెనాల్)తోపాటు మేజర్, మైనర్ ఇరిగేషన్ లిప్టులను ఏర్పాటు చేసి ఏపీ సర్కారు నీటిని తరలిస్తున్నది.
సమైక్య పాలనతోపాటు పదేండ్లుగా ఇదే తంతును కొనసాగిస్తూ ఆర్డీఎస్ రైతాంగానికి నష్టం కలిగిస్తున్నది. ఉమ్మడి మహబూనగర్ జిల్లాలోని అలంపూర్ నియోజవర్గంలోని ఆర్డీఎస్ రైతులు ఎన్ని పోరాటాలు చేసినా.. ఉద్యమాలు చేసినా.. సమైక్య పాలకులు పట్టించుకోకుండా.. ఆర్డీఎస్ ఆనకట్టకు మరమ్మతులు చేపట్టకుండా.. ప్రధాన కాల్వను ఆధునీకరించకుండా.. 87,500 ఎకరాలకు సాగునీరు అందించకుండా.. రైతులను ఆగం చేసింది. 80 ఏండ్లలో ఏనాడు ఆర్డీఎస్ ఆయకట్టుకు కేటాయించిన 15.9 టీఎంసీల నీటిని అందించించిన పాపానపోలేదు.
వరద జలాలు మినహాయిస్తే టీబీ డ్యాం నీటి వాటా కింద 3 టీఎంసీలు మించి ఎన్నడూ అందలేదు. శిథిలమవుతున్న ఆర్డీఎస్ ఆనకట్టను పటి ష్టం, బకెట్ల మరమ్మతు, ఆనకట్ట ఎత్తు పెంపు, సిల్ట్ తొలగింపు, రివర్ స్లూయిస్ మూసివేత, ఆధునీకరణ వంటి మరమ్మతులు చేపట్టాలని ఇంజినీరింగ్ నిపుణులు, సీడబ్ల్యూసీ, కేంద్ర జలసంఘం, కేఆర్ఎంబీలు ఆదేశించినా పట్టించుకోలేదు. ఆర్డీఎస్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిజాం కాలంలో కర్ణాటకలో ఆర్డీఎస్ (రాజోళి బండ డైవర్సన్ స్కీం) ప్రాజెక్టుకు నెలకొల్పారు.
ఈ ప్రాజెక్టు నిర్మించిన నిజాం నవాబులు 87,500 ఎకరాలకు 15.9 టీఎంసీలు, కర్ణాటక పరిధిలోని 10 వేల ఎకరాలకు 1.12 టీఎంసీల నీటిని అందించేందుకు నాటి కేంద్ర సీడబ్ల్యూసీ నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకుని ప్రాజెక్టును నిర్మించారు. ఆర్డీఎస్ ఆనకట్టకు కేటాయించిన నీటి వాటాను సమృద్ధిగా అందిస్తే వానకాలం, యాసంగిలో రెండు పంటలకు సాగునీరు పుష్కలంగా అందించేందుకు అవకాశం ఉంటుంది.
అలంపూర్ నియోజకవర్గంలోని 87,500 ఎకరాలకు సాగునీరు అందని విషయం తెలుసుకొన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం చేపట్టి ఆర్డీఎస్ ఆయకట్టులోని 57 వేల ఎకరాలకు సాగునీరు అందించారు. ఉద్యమకాలంలో ఇక్కడి రైతులు పడుతున్న కష్టాలను 2002లో చేప
ట్టిన తన పాదయాత్ర ద్వారా తెలుసుకున్న గులాబీ బాస్ ఆర్డీఎస్ ఆయకట్టుకు తు మ్మిళ్ల పథకంతోనే పరిష్కారం అవుతుందని, ఆరు నెలల్లోనే చేపట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కింది. తుమ్మిళ్లతో నేడు ఆయకట్టు పరిధిలోని చివరి వరకు సాగునీరు అందుతుందని రైతులు చెబుతున్నారు.
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్ట పటిష్టంగా లేకపోవడం, బకెట్టు దెబ్బతినడం, 80 ఏండ్లుగా కన్స్ట్రక్షన్ స్లూయిస్ మూయకపోవడం, సిల్ట్ తీయకపోవడం, కర్ణాటక నుం చి తెలంగాణ రాష్ట్రంలోని చివరి ఆయకట్టు వరకు ఉన్న ప్రధాన కాల్వకు లైనింగ్ లేకపోవడం, డిస్ట్రిబ్యూటరీల మరమ్మతులు చేపట్టకపోవడంతో ఆర్డీఎస్ ప్రధాన కాల్వ కు నీటి విడుదల తగ్గుతోంది. ప్రతిరోజు ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి 1,100 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండాల్సి ఉ ండగా.. కాల్వ లైనింగ్ పటిష్టంగా లేకపోవడం, కాల్వ దెబ్బతినండతో కేవలం 750 క్యూసెక్కులకుమించి ప్రవాహం ఉండటంలేదు. దీంతోనే ఆయకట్టు సాగునీరు అందడంలేదని రైతులు, రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. ప్రతి ఏటా రివర్ అసిస్మెంట్ నుంచి 10 టీఎంసీలు, టీబీ డ్యాం నుంచి 7 టీఎంసీల నీరు ఆర్డీఎస్ ఆనకట్టకు అందాల్సి ఉన్నది. ప్రస్తుత ఏడాదిలో ఈ వానకాలం వరకే సాగునీరు విడుదల చేస్తామని టీబీ బోర్డు ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆర్డీఎస్ ఆనకట్టను పటిష్టం చేయకపోతే అలంపూర్ నియోజకవర్గంలోని 87,500 ఎకరాలు బీళ్లుగా మారడంతోపాటు ఆర్డీఎస్ ఆనకట్ట ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి కైనా పాలకులు పట్టించుకోవాల్సి ఉన్నది.
ఏపీ తుంగభద్ర జల దోపిడీని అడ్డుకోవాలి. 87,500 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ఆర్డీఎస్ను ఉమ్మడి పాలనలో.. తెలంగాణలో లిప్టులు ఏర్పాటు చేయకుండా నీటిని తరలించుకుపోయి ఇక్కడి రైతుల పొట్టకొట్టారు. టీబీ డ్యాం నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లే దోచేస్తుండటంతో ఆర్డీఎస్ ఆయకట్టుకు నీళ్లందని పరిస్థితి. 17.1 టీఎంసీలు చేరాల్సి ఉండగా, వరద జలాలు మినహాయిస్తే ఏనాడూ 3 టీఎంసీలకు మించి అందడంలేదు. ఆర్డీఎస్ను ఆధునీకరణ చేయక పోవడంతో ఆయకట్టు బీడుగా మారింది. కేసీఆర్ హయాంలో చేపట్టిన తుమ్మిళ్ల పథకంతో చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందాయి. ఆర్డీఎస్ ఆనకట్టను, సుంకేసుల బరాజ్‌గా ఆధునీకరిస్తేనే నీళ్లు పుష్కలమవుతాయి. లేకుంటే భారీ వరదలొస్తే ప్రశ్నార్థకంగా మారుతుంది.
– కుర్వ పల్లయ్య, బీఆర్ఎస్వీ జోగుళాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్