పెద్దకొత్తపల్లి, నవంబర్ 11: ఉపాధ్యాయుల బాధ్యతరాహిత్యం కారణంగా పెద్దకొత్తపల్లి మండలంలో రోడ్డు ప్రమాదంలో ఐదు మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మండల కేంద్రం నుంచి సాతాపూర్ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు బొలేరోలో పార్ట్-2కు చెందిన పాఠ్యపుస్తకాలను తీసుకొస్తుండగా బచారం స్టేజీ సమీపంలో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 9వ తరగతికి చెందిన నాని, నందు, చరణ్ తేజ, కార్తీక్ శివ, ఆనంద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో శివ అనే విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో అతడిని హైదరాబాద్ గాంధీ దవాఖానకు తరలించారు.
ఫాఠ్యపుస్తకాల తరలింపు విషయంలో కూలీలను ఏర్పాటు చేసుకోవాలని, విద్యార్థుల చేత పనులు చేయించుకోవద్దని స్పష్టంగా నిబంధనలు ఉన్నప్పటికీ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు అం దుకు భిన్నంగా వ్యవహరించారు. ఐదు గురు విద్యార్థులను వాహనంలో పంపి ప్రమాదానికి కారుకులయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వాహనం బోల్తా పడిన వెంటనే గుర్తించిన స్ధానికులు తీవ్రంగా గాయపడిన విద్యార్థులను హూటాహుటిన నాగర్‌కర్నూల్ ప్ర భుత్వ దవాఖానకు తరలించారు. సమాచారం తెలిసిన వెంటనే అధికారులు ప్రభు త్వ దవాఖానకు వెళ్లి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. రోడ్డు ప్రమాదం ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ సతీశ్‌కుమార్ తెలిపారు.

కలెక్టర్‌తో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే బీరం
పెద్దకొత్తపల్లి మండలంలో జరిగిన ప్రమాదంపై మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఫోన్లో మాట్లాడారు. ఘటన కారణాలపై విచారణ జరిపించి తగు చర్యలను తీసుకోవాలని, గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
హెచ్ఎం సస్పెన్షన్, ఎంఈవోకు షోకాజ్ నోటీసులు జారీ
నాగర్‌కర్నూల్, నవంబర్ 11 : పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీశైలంను సస్పెండ్ చేస్తూ, ఇన్చార్జి ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డికి కలెక్టర్ షోకాజ్ నోటీస్ జారీ చేశారు. పాఠ్యపుస్తకాలు తరలిస్తున్న బొలెరో వాహనం బోల్తాపడగా విద్యార్థులు తీవ్రంగా గాయపడిన ఘటనను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తీవ్రంగా పరిగణించారు. పాఠశాలకు పుస్తకాలను తీసుకువచ్చేందుకు విద్యార్థులను పంపడం, వారు పుస్తకాలు తీసుకువస్తు న్న వాహనానికి ప్రమాదం జరగడం, ఐదుగురు విద్యార్థులు గాయపడడం, అందులో ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంపై హెచ్ఎం, ఎంఈవోల నిర్లక్ష్యమేనని కలెక్టర్ మండిపడ్డారు. కలెక్టర్ ఆదేశాల మేరకు హెచ్.ఎం శ్రీశైలంను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ, పెద్దకొత్తపల్లి మండల విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డికి షోక్జ్ నోటీసు జారీ చేసినట్లు డీఈవో రమేశ్‌కుమార్ తెలిపారు.