గద్వాల, ఫిబ్రవరి 9 : నెట్టెంపాడ్ అభివృద్ధి పనులకు ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించడంతో పను ల్లో వేగం పుంజుకోనున్నది. ప్రాజెక్ట్ పరిధిలో మిగిలిపోయిన మైనర్ పనులకు రూ.119.75 కోట్లు కేటాయించడంతో న డిగడ్డ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాజెక్ట్‌కు అప్పటి సీమాంధ్ర పాలకులు అరకొర నిధులు ఇచ్చి పనులు నత్తనడకన నడిచేలా చేశారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం ఇప్పటివరకు రూ.723 కోట్లు మంజూరు చేసింది. దీతో పనులు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లోని సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు నెట్టెంపాడ్ ఎత్తిపోతలను ఏర్పాటు చేశారు. 2014కు ముందు ఈ లిఫ్ట్ ద్వారా కేవలం 20 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరందేది.
రాష్ట్రం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించి.. ఎనిమిదేండ్లలో నెట్టెంపాడ్కు రూ.603 కోట్లు.. ఈ ఏడాది బడ్జెట్లో రూ.119.75 కోట్లు కేటాయించింది. గతంలో వచ్చిన నిధులతో కాల్వలు అభివృద్ధి చేయడంతో ప్రస్తుతం జిల్లాలో 1.42 లక్షల ఎకరాలకు సాగునీరందుతున్నది. నెట్టెంపాడ్ లిఫ్ట్ ద్వారా రిజర్వాయర్లను నింపడంతో జిల్లాలోని ఎనిమిది మండలాలు సస్యశ్యామలం అవుతున్నాయి. ఎక్కడ చూసినా పచ్చని పంటలతో కళకళలాడుతున్నది. కోతల సమయంలో ఇతర రాష్ర్టాల కూలీలు ఇక్కడికి ఉపాధి కోసం వలసవస్తున్నారు. జూరాల బ్యాక్‌వాటర్ నుంచి వరద సమయంలో నిత్యం మూడు వేల క్యూసెక్కులను 90 రోజులపాటు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నది.
ప్రాజెక్ట్ వివరాలు..
నెట్టెంపాడ్ లిఫ్ట్‌లోని పంపుల ద్వారా ర్యాలంపాడ్ రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోసి.. 104 చెరువులను నింపుతున్నారు. లిఫ్ట్ పూర్తి అంచనా వ్యయం రూ.2,400 కోట్లు.. కాగా, ప్రస్తుతం ఈ లిఫ్ట్ ద్వారా 1.42 లక్షల ఎకరాలకు సాగునీరందుతున్న ది. 99, 100 ప్యాకేజీ పనులు చివరి దశకు చేరుకున్నాయి. వీటి కోసం ప్ర భుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించిం ది. ఈ పనులు పూర్తయితే 2 లక్షల ఎకరాలకు సాగునీరందనున్నది. నెట్టెంపాడ్ ఆయకట్టు రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం రూ.21 కోట్లు విడుదల చేయడంతో పనులు జరుగుతున్నాయి.
రెండు పంటలకు పుష్కలంగా సాగునీరు..
నెట్టెంపాడ్ లిఫ్ట్ ఏర్పాటు చేయకముందు బోరుబావులు, వర్షం మీద ఆధారపడి సాగు చేసేవాళ్లం. ప్రస్తుతం లిఫ్ట్ ద్వారా రిజర్వాయర్లలో నీరు పుష్కలంగా ఉండడంతో రెండు పంటలు సంబురంగా పండిస్తున్నాం. చేతి నిండా పని దొరుకుతున్నది. ప్రస్తుతం సాగుచేస్తున్న పంటలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీరు పారుతున్నది. సీఎం కేసీఆర్ సారుకు ధన్యవాదాలు.
– రోషన్న, మార్లబీడు
వలసలు ఆగిపోయాయి..
నెట్టెంపాడ్ లిఫ్ట్ పూర్తి కాని సమయంలో వర్షాధార పంటలు సాగు చేసుకునేవాళ్లం. వర్షాలు బాగా కురిస్తే పంటలు.. లేదంటే బీళ్లు పెట్టేవాళ్లం. గతంలో ఈ ప్రాంతంలో సాగునీరు లేక వలసలు వెళ్లేవారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెట్టెంపాడ్ ఎత్తిపోతల పనులు పూర్తి చేశారు. ఇపడు సాగునీరు పుష్కలంగా అందుతున్నది. పంటలకు ఎలాంటి ఇబ్బంది లేదు. దీంతో వలసలు ఆగిపోయాయి.
– సత్యన్న, బూరెడ్డిపల్లి