ఊట్కూర్, జూన్ 24: నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా ముంపునకు గురవుతున్న హిందూ స్మశాన వాటికను పరిరక్షించాలని ఊట్కూరు (Utkoor) వాసులు డిమండ్ చేశారు. ఈమేరకు నారాయణపేట జిల్లా ఊట్కూరు మండల కేంద్రంలో అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలోని చౌడేశ్వరి మాత ఆలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసిల్దార్ చింత రవి కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ గరిడి నింగి రెడ్డి, బీఆర్ఎస్ మండల సీనియర్ నాయకుడు వడ్ల మోనప్ప, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విగ్నేశ్వర్ రెడ్డి, మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలో దాదాపు 500 హిందూ మతానికి చెందిన కుటుంబాలు చనిపోయిన వారిని కొన్ని వందల ఏళ్ల నుంచి గంగమ్మ గోర్ల గడ్డలో అంత్యక్రియలు నిర్వహించడం ఆనవాయితీగా ఉందని తహసిల్దార్‌కు విన్నవించారు.
నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేపట్టిన భూ సేకరణలో ఊట్కూర్ పెద్ద చెరువు శిఖం భూమికి ఆనుకుని ఉన్న గంగమ్మ గోర్ల గడ్డ ముంపునకు గురైతే తమ పూర్వీకుల సమాధులు పూర్తిగా ధ్వంసం అవుతాయని, భవిష్యత్తులో చనిపోయిన వారిని అంత్యక్రియలు నిర్వహించేందుకు స్థలం లేక ఇబ్బందులకు గురికావాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం అధికారులు మానవతా దృక్పథంతో ఆలోచించి స్మశాన వాటిక ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో అఖిల పక్ష పార్టీ నేతలు, గ్రామస్తులు మోట్కర్ గోపాల్ రెడ్డి, కొండన్ గోపాల్, టప్ప రమేశ్, జగదీష్ గౌడ్, రాఘవేందర్ గౌడ్, జగన్నాథ్ రావు, ప్రవీణ్, వెంకట్ నారాయణ, కుమ్మరి రఘు, జంగిడి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.