జోగులాంబ గద్వాల : రెండు పడకల గృహాల ( Double bedrooms ) వద్ద అన్ని సదుపాయాలను వెంటనే పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ (Collector Santosh) అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని దౌదర్ పల్లి సమీపంలో నిర్మించి లబ్ధిదారులకు అందజేసిన రెండు పడకల గృహాలను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లబ్ధిదారులకు కేటాయించిన గృహాలలో నివాసముండే విధంగా మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో వార్డ్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. రెండు పడకల గృహాల్లో విద్యుత్ కనెక్షన్ కోసం అవసరమైన అన్ని చర్యలు పూర్తి చేసి ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పెయింటింగ్ పనులు, డ్రైనేజ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ అధికారులను ఆదేశించారు.
నీటి సౌకర్యం అందించే విధంగా అదనంగా 200 కేఎల్ సామర్థ్యంతో మిషన్ భగీరథ కింద నిర్మాణంలో ఉన్న ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంక్‌ను నెల రోజుల్లో పూర్తిచేయాలని సూచించారు. అంతకుముందు దౌదర్ పల్లి సమీపంలో జిల్లా మహిళా సమాఖ్య భవనం నిర్మాణ పనులను పరిశీలించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ జానకిరామ్, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ ఈఈ ప్రభాకర్, మిషన్ భగీరథ ఏఈ నూర్, తదితరులు పాల్గొన్నారు.