అలంపూర్ చౌరస్తా, డిసెంబర్ 2 : విద్యార్థులకు అందించే భోజనంపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే విజయుడు హెచ్చరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు.. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పర్యవేక్షణలో చేపట్టిన గురుకులాల బాట కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో బీసీ గురుకుల బాలుర పాఠశాలను గు లాబీ పార్టీ యువజన నేత కిషోర్‌తో కలిసి ఆయన తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో పేదలకు మెరుగైన విద్యాబోధన, నాణ్యమైన, రుచికరమైన భోజనం, వసతి కల్పించినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యార్థుల చదువును గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. మంచి భోజనం అందించడంలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. గురుకులాల్లో చదువుపై, భోజనంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఉపాధ్యాయుడు క్రమం తప్పకుండా పాఠశాల, గురుకులాలకు వచ్చి విద్యార్థుల చదువు, భోజనం, వారి బాగోగులు చూడాలని ఆదేశించారు. ఏమైనా సమస్యలు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. వారి వెంట సింగిల్ విండో అధ్యక్షుడు గజేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వెంకట్రాములు, శ్రీను, ఉపాధ్యాయులు ఉన్నారు.