అయిజ, ఫిబ్రవరి 25 : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముఖ్య నేతలు, కార్యకర్తలు కృషి చేయాల్సిన అవసరం ఉందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. మంగళవారం అయిజ పట్టణంలోని మాజీ జెడ్పీటీసీ పుష్పానర్సింహారెడ్డి సృగృహంలో బీఆర్ఎస్ పట్టణ, మండల ముఖ్య నాయకులతో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ముఖ్య నాయకులు కార్యకర్తలను కలుపుకొని పల్లెలు, పట్టణంలో బీఆర్ఎస్ను ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. కలిసికట్టుగా పార్టీని పటిష్టం చేసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎక్కడికక్కడే ఎండగట్టాలని సూచించారు. ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలన్నారు. అనంతరం ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలుపునకు అహర్నిశలు కష్టపడాలన్నారు. గత పదేండ్లలో బీఆర్ఎస్ హ యాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహానికి గురికాకుండా పార్టీ పటిష్టతపై దృష్టి సారించాలన్నారు. కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా అండగా నిలుస్తామన్నారు. కార్యకర్తల మనోభిష్టానికి పెద్దపీట వేస్తూ పార్టీని నలుదిశలా వ్యాపింపజేయాలని కోరారు. త్వరలోనే మండల, పట్టణ నూతన కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందరి ఆమోదయోగ్యంగానే కమిటీల ఎంపిక ఉంటుందన్నారు. కమిటీల ఎంపికకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్సీ వెల్లడించారు. సమావేశంలో మాజీ ఎంపీపీలు సుందర్రాజు, సీతారాంరెడ్డి, మండల ఇన్చార్జి రంగారెడ్డి, బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య, నాయకులు నర్సింహారెడ్డి, సత్యారెడ్డి, హన్మంతురెడ్డి, రవిరెడ్డి, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.