మల్దకల్, జనవరి 4 : నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలోని 99,100,106 ప్యాకేజీ కింద చేపట్టాల్సిన పనులు వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఇరిగేషన్ అధికారులకు సూచించారు. నెట్టెంపాడు పరిధిలో చాలా వరకు పనులు అసంపూర్తిగా మిగిలి పోవడంతో అలంపూర్ నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన వ్యవసాయ భూ ములు బీడు మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మండలంలోని తాటికుంట రిజర్వాయర్, అలాగే మల్లెందొడ్డి, విఠలాపురం, ఎల్కూర్ గ్రా మాల మీదుగా ఉన్న నెట్టంపాడు కాల్వలను ఎమ్మెల్యే విజయుడు ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు.
99,100. 106 లిప్టు పనులు పరిశీలించి వచ్చే ఖరీప్ నా టికి సాగు నీరు అందించాలని అధికారులను ఆదేశించా రు. 106 ప్యాకేజీ డిస్ట్రిబ్యూటర్ కాల్వలో పేరుకుపోయిన సిల్ట్ పనులు పూర్తి చేసి తూములకు షేటర్లు అమర్చాలని సూచించారు. తాటికుంట లింక్ కెనాల్ పూర్తి చేసి అలంపూర్ నియోజకవర్గలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆయన మల్దకల్లో విలేకరులతో మాట్లాడుతూ గట్టు మండలంలోని చిన్నోనిపల్లిలో నిర్మించిన రిజర్వాయర్ వల్ల అలంపూర్ నియోజకవర్గానికి చుక్కనీరు వచ్చే అవకాశం లేదన్నారు. ముందుచూపు లేకుండా చేపట్టిన నిర్మాణం వల్ల నియోజకవర్గానికి మేలు జరగపోగా రాయలసీమకు మాత్రం ఉపయోగపడేలా ఉందని ఆరోపించారు.
గత ప్రభుత్వంలో ఆర్ఈ రివేజ్ కింద రూ.2,600 కోట్ల నుంచి 2,800 కోట్లు ఖర్చు చేయాలని భావించినా ఎలాంటి పురోగతి లేదన్నారు. కావున ఈ రివేజ్ ఫండ్‌ను రద్దు చేసి ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మల్దకల్ మండలంలోని తాటికుంట రిజర్వాయర్ నిర్మించిన దాని లో నీరు ఉన్న కిందకు కాల్వలోకి నీటిని వదలాలన్నా రిజర్వాయర్‌లో నీటి సామర్థ్యం లేదన్నారు. అలాగే మల్లెందొడ్డి, విఠలాపురం తదితర గ్రామాల్లో నిర్మించిన కాల్వల్లో కంపచెట్లు పెరిగిపోయాయని వీటిని తొలగించకపోతే కాల్వలకు సాగునీరు వచ్చే పరిస్థితే లేదన్నారు.
మల్లెందొడ్డి గ్రామం మీదుగా వెళ్తున్న కాల్వ పనులు పూర్తి చేయక పోవడంతో కాల్వ నిండి పక్కనున్న రైతుల పొలాలను ముంచెత్తుతున్నాయని పేర్కొన్నారు. అయితే 99, 100, 106 ప్యాకేజీ పనులు పూర్తి చేస్తే వేముల, శాగాపు రం, షాబాద, శనగపల్లె, ఉద్దండాపురం, వావిలాల, సాతర్ల, బుడ్డారెడ్డిపల్లితోపాటు ఇటిక్యాల, వడ్డేపల్లి, రాజోళి, మానవపాడు మండలాల్లోని 30 వేల ఎకరాల వ్యవసాయ భూములు సాగుకు నోచుకుంటాయని వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పనులు పూర్తి చేయించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఆయన వెంట ఇరిగేషన్ డీఈ వాసంతి, ఈఈ సంజీవ్ ప్రసాద్, ఏఈలు శివ, రాంబాబు, బీఆర్ఎస్ నేతలు బాలక్రిష్ణారెడ్డి, హన్మంతురెడ్డి, వావిలాల రంగారెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, వెంకట్రాములు, గోవర్ధన్‌రెడ్డి, తిప్పన్న, జయన్నగౌడ్, గొల్ల కేసన్న ఉన్నారు.