భూత్పూర్, జూన్ 02 : ఉద్యమ నాయకుడు కేసీఆర్ కృషి, ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసేందుకు విశేషంగా కృషిచేసి, తన ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ఉద్యమం చేసి అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించారని అన్నారు.
ఉద్యమ సమయంలో కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో స్పందించకపోవడంతో ఎందరో ఉద్యమకారులు ఆత్మహత్యలకు, ఆత్మ బలిదానాలను చేసుకున్నారని తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కేసీఆర్ ఎంతో కృషి చేశారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ ఎన్నో కొత్త సంక్షేమ పథకాలను అమలుపరిచి ప్రతి ఇంటికి ఒక పథకం అందేలా నూతన పథకాలను ప్రవేశపెట్టారని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సత్తూరు బస్వరాజ్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ కదిరె అశోక్ రెడ్డి, మాజీ సర్పంచులు సత్యనారాయణ గౌడ్, నరసింహ గౌడ్, మనెమోని సత్యనారాయణ, వెంకటయ్య, ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్లు శ్రీనివాస్ రెడ్డి, బాలకోటి, రామకృష్ణ, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సురేష్ గౌడ్, సీనియర్ నాయకులు మురళీధర్ గౌడ్, సత్యనారాయణ, అశోక్ గౌడ్, సాదిక్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.