దేవరకద్ర రూరల్(కౌకుంట్ల), ఏప్రిల్ 30 : రైతులు కల్లా లో ఆరబోసుకున్న ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అధికారులను కోరారు. బుధవారం కౌకుంట్ల మండలం ముచ్చింతల గ్రామానికి వచ్చిన ఆయనకు ఆ గ్రామ రైతులు కొనుగోలు విషయంలో జరుగుతున్న జాప్యాన్ని ఆలకు వివరించారు. రైతులకు సరిగా గన్నీబ్యాగులు ఇవ్వకుండా, ఒకవేళ ఇచ్చినా చిరిగిన బ్యాగులు ఇస్తున్నారని, కొనుగోలు సరిగా జరగటంలేదని తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ విషయంపై స్పందించిన ఆయన సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు.
ధాన్యం కొనుగోలు జరగక కల్లాలు, రోడ్లపై ఆరబోసుకున్న రైతులు అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన అధికారులకు తెలిపారు. నియోజకవర్గంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన గన్నీబ్యాగులు అందుబాటులో ఉంచాలని, వేగంగా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా కొనుగోళ్లు పూర్తయిన రైతుల ఖాతాల్లో వెంటనే డబ్బులు జమచేస్తూ, బోనస్ కూడా చెల్లించాలని సూచించారు.