భూత్పూర్, ఏప్రిల్ 10 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన సొంత గ్రామం అన్నాసాగర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన వరంగల్ జిల్లాలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు గ్రామాల నుండి కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడకుండా ఉంటే దేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదే కాదన్నారు.
కేసీఆర్ ఉద్యమం వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం వల్లనే దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు అయ్యాయని గుర్తు చేశారు. కేసీఆర్ హయంలో ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణకు వలస కూలీలుగా రప్పించే స్థాయికి రాష్ట్రాన్ని ఎదిగేలా చేశారని చెప్పారు. దేశంలోనే అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాయ మాటలు చెప్పి అధికారం కొచ్చి రాష్ట్రాన్ని అధోగతికి దిగజార్చారని విమర్శించారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ నాయకులు కలిసికట్టుగా ఉండి బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు. రజతోత్సవ సభకు సంబంధించి ఆయన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఓ పోస్టర్ను ఆవిష్కరించారు. విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు సత్తూర్ బస్వరాజ్ గౌడ్, జట్టి నరసింహారెడ్డి, తోకల శ్రీనివాస్ రెడ్డి, ఇంద్రయ్య సాగర్, తోటరాముడు, వామన్ గౌడ్, బాలవర్ధన్ గౌడ్, యాదగిరి పాల్గొన్నారు.