Nagarkurnool | బిజినపల్లి, మే 6 : రైతులు నేలని బట్టి తగిన మోతాదులో ఎరువులను వాడినట్లయితే పంటలలో మంచి దిగుబడి సాధించవచ్చని శాస్త్రవేత్త అర్చన అన్నారు. మంగళవారం మండలంలోని మంగనూరు గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు అధిక మొత్తంలో ఎరువులు వాడడం వల్ల తమ ఉత్పత్తిలోనూ ,నాణ్యతలోను ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దీంతో దిగుబడి కూడా తక్కువగా వస్తుందని అన్నారు. రైతులు పంటలు వేసే ముందు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని అన్నారు. ఆ భూసార పరీక్షల ఫలితాలను బట్టి శాస్త్రవేత్తలు సూచన సలహాలు పాటించి పంటలను వేసుకోవాలన్నారు. నీటి వనరులను దృష్టిలో ఉంచుకొని వరితో పాటు ఇతర ప్రత్యామ్నాయ పంటలను సాగు ఎంతో మేలని అన్నారు. పచ్చి రొట్టె ఎరువుల వినియోగంతో రసాయనిక ఎరువుల వాడకం తగ్గించే అవకాశం ఉంటుందని వివరించారు. మెట్ట సేద్యం కింద అధికంగా సాగవుతున్న పత్తి, మొక్కజొన్న పంటలకు సంబంధించి ముఖ్యంగా నాణ్యమైన విత్తనాల సేకరణ పై రైతులు దృష్టి సరించాలని అన్నారు. రైతు బీమా,రైతు భరోసా,పిఎం కిసాన్ వంటి ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త విలాకర్,నీతి, విక్రాంత్ కుమార్,సత్యనారాయణ, నరసింహారెడ్డి,శివరాజ్ రైతులు ఉన్నారు.