తెలంగాణ ప్రభుత్వం పంటల సాగులో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. దీంతో నాడు వ్యవసాయం దండగ అన్న నోళ్లే.. నేడు వ్యవసాయం పండుగ అంటున్న పరిస్థితులు వచ్చాయి. సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో పెండింగ్ ప్రాజెక్టులన్నీ రన్నింగ్‌లోకి రాగా.. ఎత్తిపోతల పథకాలతో సాగునీటి వనరులు పెరిగాయి. పది, పదిహేను రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి జిల్లాలో సాధారణానికిమించి వర్షపాతం నమోదైంది. జూరాల ప్రాజెక్టు, రిజర్వాయర్లు నిండుకుండను తలపిస్తుంటే వాగులు, వంకలు పారుతున్నాయి. చెరువులు మత్తడి దుంకుతూ జలసంబురాన్ని తలపిస్తున్నాయి. రైతుబంధు సాయం అందుతుండడంతో రెట్టింపు ఉత్సాహంతో వ్యవసాయ పనుల్లో కర్షకులు నిమగ్నమయ్యారు. సాగు విస్తీర్ణం పెరగడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు సైతం వచ్చి వ్యవసాయ పనులు చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 1,61,014 ఎకరాలు, వనపర్తి జిల్లాలో 93,071 ఎకరాలు, జోగుళాంబ గద్వాల జిల్లాలో 1,50,991 ఎకరాలు, నారాయణపేట జిల్లాలో 55,013 ఎకరాలు, నాగర్‌కర్నూల్ జిల్లాలో 2,83,750 ఎకరాల్లో (మొత్తం 7,43,839 ఎకరాల్లో) వివిధ పంటలు సాగైనట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. నేడు కోయిల్‌సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయనుండగా.. మరిన్ని పంట చేలతో పచ్చదనం పరిఢవిల్లుతున్నది.
మహబూబ్‌నగర్, జూలై 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి పాలమూరు జిల్లాలో పదహైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలసిరులు సంతరించుకున్నాయి. నదులు, వాగులు ఉప్పొంగడంతో ఎక్కడ చూసినా నీరే దర్శనమిస్తున్నది. వాగులు, వంకలు పారుతుండగా.. చెరువులు మత్తడి దుంకుతుండగా.. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిండుకుండలను తలపిస్తున్నాయి. నీటి వనరులు పెరగడంతో రైతన్నలు ఆనందంగా సాగు పనుల్లో మునిగితేలుతున్నారు.
సాధారణానికి మించి..
ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో సాధారణ వర్షపాతానికిమించి వర్షాలు కురిశాయి. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కుడ పడితే.. జోగుళాంబ గద్వాల జిల్లాలో మాత్రం సాధారణ వర్షం కురిసింది. కర్ణాటకలో సైతం భారీ వర్షాలు పడడంతో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్టు గేట్లను తెరిచి ఐదు రోజులుగా నీటిని విడుదల చేశారు. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పెరుగుతున్నది. జిల్లాలో అంకిళ్ల, ఊకచెట్టు, దుందుభీ నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. చెక్‌డ్యామ్‌లు నిండి అలుగు దుంకుతున్నాయి. మరికొన్ని రోజులు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆగస్టులోనూ సమృద్ధిగా వానలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
గతేడాది జూన్ నుంచి జూలై 31 వరకు మహబూబ్‌నగర్ జిల్లాలో సాధారణ వర్షపాతం 22.08 మిల్లీమీటర్లు కాగా ఈసారి ఇప్పటి వరకు 333.04 మిల్లీమీటర్లు నమోదు కాగా.. సాధారణంకన్నా సుమారు 48 మిల్లీమీటర్లు ఎక్కువగా కురిసింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో గతేడాది 190.0 మిల్లీమీటర్లు పడితే ఈసారి 260.01 మిల్లీమీటర్లు కురవగా.. సాధారణంకన్నా 37.0 మిల్లీమీటర్లు ఎక్కువగా పడింది. వనపర్తి జిల్లాలో గతేడాది 219.07 మిల్లీమీటర్లు కురిస్తే ఈసారి 332.07 మిల్లీమీటర్లు నమోదైంది. సుమారుగా 51.0 మిల్లీమీటర్ల వర్షపాతం ఎక్కువ పడింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో గతేడాది 204.09 మిల్లీమీటర్లు కురిస్తే ఈసారి 234.8 మిల్లీమీటర్లు పడగా సాధరణంకన్నా 15 మిల్లీమీటర్లు ఎక్కువగా కురిసింది. నారాయణపేట జిల్లాలో 224.0 మిల్లీమీటర్లు గతేడాది పడగా.. ఈసారి 348.01 మిల్లీమీటర్ల వర్షం కురవగా.. సాధారణంకన్నా 55 మిల్లీమీటర్లు ఎక్కువగా నమోదైంది.
ఆయకట్టు కళకళ
జూరాల ప్రాజెక్టు వరద నమోదవుతున్నది. ఇప్పటికే కోయిల్‌సాగర్ డ్యాం నిండుకుండలా మారగా.. సరళాసాగర్‌లో నీటిమట్టం పెరుగుతున్నది. ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేశారు. దీంతో రైతులు కరిగెట్లు సిద్ధం చేస్తున్నారు. బిజీబిజీగా పంటల సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. వర్షాధార పంటలతోపాటు పత్తి, వరి, ఇతర పంటలు వేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 1,61,014 ఎకరాలు, వనపర్తి జిల్లాలో 93,071 ఎకరాలు, జోగుళాంబ గద్వాల జిల్లాలో 1, 50,991 ఎకరాలు, నారాయణపేట జిల్లాలో 55,01 3 ఎకరాలు, నాగర్‌కర్నూల్ జిల్లాలో 2,83,750 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేస్తున్నారు. మొత్తం 7,43,839 ఎకరాల్లో పంటలు సాగైనట్లు వ్యవసాయ అధికారులు వెల్లడించారు. ఆయా జిల్లా ల్లో మరో వారం, పది రోజుల్లో ఆశించిన మేరకు సాగు అంచనా పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.
ఎక్కడ చూసినా పచ్చదనమే..
వర్షాలు ఆలస్యంగా కురిసినా ఉమ్మడి జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. పంట చేలతో ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తున్నది. చెరువులు, కుంట లు, చెక్‌డ్యాంలు జలకళను సంతరించుకున్నాయి. కో యిల్‌సాగర్, సంగంబండ, సరళాసాగర్, రామన్‌పాడు, భూత్పూరు, శంకరసముద్రం రిజర్వాయర్లన్నీ నిం డాయి. దుందుభీ నది పరవళ్లు తొక్కుతున్నది. దీంతో ఉమ్మడి జిల్లాతోపాటు నల్లగొండ జిల్లాకు సాగునీటికి ఢోకా తీరింది. చెరువులు మత్తడి దుంకుతుండడంతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పత్తి, వరి, ఆముదం, పొద్దుతిరుగుడు, జొన్న, రాగులు, పెసర, మొక్కజొన్న, వేరుశనగా, చెరుకు, హార్టికల్చర్ క్రాప్‌తోపాటు కూరగాయల సాగు పెరిగింది. వర్షాకాలంలో అన్నదాతలు ఎక్కువగా వర్షధార పంటలే వేస్తారు. ఈసారి కూడా జోరుగా సాగు చేస్తున్నారు. ఆర్డీఎస్, జూరాల, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, భీమా ఫేజ్-1, భీమా ఫేజ్-2 కింద వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఎంజీకేఎల్ఐ నీరు పలు ప్రాంతాల్లో పరుగులు పెడుతున్నది.
కూలీలకు మస్త్ డిమాండ్.. ఇతర రాష్ర్టాల నుంచి రాక
వర్షాలు సమృద్ధిగా పడుతుండడంతో వ్యవసాయ కూలీలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం కూలి ధరలు రోజుకూ రూ.800లకు చేరాయి. మహిళలకు రూ.700 ఇస్తేనే పనులకు వస్తామని తెగేసి చెబుతున్నారు. తుకం వేయడం.. నారుతీయడం.. నాట్లు వే యడానికి కూలీలు అవసరం ఉంటుంది. సాగు విస్తీ ర్ణం గణనీయంగా పెరగడంతో కూలీల కొతర ఏర్పడిం ది. కొరతను అధిగమించేందుకు వ్యవసాయ పరికరాలతో సాగు పనులు చేస్తున్నారు. మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. కొన్ని చోట్ల యాంత్రికంగా నాట్లు వేసే యంత్రాలను రప్పించి వే స్తున్నారు. కొన్ని ప్రాంతాల్లోకి ఇతర రాష్ర్టాల నుంచి వలస కూలీలు వచ్చి పనులు చేస్తున్నారు. పనులను గుత్తగా మాట్లాడుకొని తక్కువ కూలీకి పను లు చేస్తున్నారు. వీరికి భోజనం, వసతి అంతా ఇక్కడి రైతులే ఏర్పాటు చేస్తున్నారు. గంట.. గంటన్నరలో ఎకరం పొలంలో నాటు వేస్తున్నారు. దీంతో చాలా మంది రైతులు ఇతర రాష్ర్టాల కూలీలవైపే మొగ్గు చూపుతున్నారు. మొత్తం పనులన్నీ పూర్తయ్యాక వారిని ఇతర గ్రామాల రైతులు పిలిచి పనులు చేయిస్తున్నారు.
పెరిగిన భూగర్భ జలాలు
ఉమ్మడి పాలనలో తెలంగాణలోని బోర్లు ఎండిపోయేవి. మూడు నుంచి నాలుగు వందల ఫీట్లు బోర్లు వేసినా చుక్క నీరు వచ్చేది కాదు.. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పటయ్యాక సీన్ రివర్స్ అయ్యింది. వ్యవసాయ రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేయడంతోపాటు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసింది. ఎత్తిపోతలతో నదీ జలాలను పారించడంతో బీడు భూములు సైతం నేడు పచ్చని మాగాణిలా మారాయి. భూగర్భ జలాలు పెరిగాయి. బోర్లు రీచార్జి అయ్యాయి. సాగునీటి వనరులు పెరిగాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో గతేడాది జూన్‌లో 9.32 మీటర్లు ఉండగా ఈఏడాది 9.32 మీటర్లు నీటి వనరులు పెరిగాయి. 0.41 శాతం పెరిగింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో గతేడాది 7.54 మీటర్లు ఉండగా ఈసారి 5.62 మీటర్లు కాగా 1.92 శాతం భూగర్భ జలాలు, నాగర్‌కర్నూల్ జిల్లాలో గతేడాదిలో 7.97 మీటర్లు 7.30 ఉండగా 0.67 మీటర్లు పెరిగాయి. వనపర్తి జిల్లాలో 5.32 మీటర్లు ఉండగా ఈఏడాది 5.40 మీటర్లకు పడిపోయింది. మైనస్ 0.80గా నమోదైంది. నారాయణపేట జిల్లాలో గతేడాది 7.09 మీటర్లు ఉండగా ఈసారి 7.81 మీటర్లు నమోదు కాగా మైనస్ 0.72కు పడిపోయింది. కాగా ఇంకా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మరింతగా భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉన్నదని అధికారుల అంచనా.
నేడు కోయిల్‌సాగర్ ఆయకట్టుకూ..
పాలమూరు జిల్లాలో మధ్యతరహా సాగునీటి ప్రాజె క్టు కోయిల్‌సాగర్ నుంచి ఆయకట్టుకు మంగళవారం నీటిని విడుదల చేయనున్నారు. డ్యాం నీటితో నిండి గా మారడంతో దేవరకద్ర, నారాయణపేట ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి సాగునీరు వదలనున్నారు. కుడి, ఎడమ కాల్వల కింద సుమా రు 40 వేల ఆయకట్టుకు సాగునీరు అందనున్నది. ఇప్పటికే ఈప్రాజెక్టు పరిధిలోని చెక్‌డ్యాంలన్నీ వర్షాలకు అలుగు పారుతున్నాయి. గొలుసుకట్టు చెరువులు నిండాయి. ఇప్పటికే అంకిళ్ల వాగుతో సెల్ఫ్ క్యాచ్‌మెంట్‌తో కోయిల్‌సాగర్ నీటి మట్టం పెరిగింది. అంతేకాక జూరాల డ్యాంకు వరద పోటెత్తుతున్నది. రెండు పంటలకు నీరు ఇవ్వడానికి అధికారులు సమాయత్తమయ్యారు.