కల్వకుర్తి, జనవరి 8 : ఎంజీకేఎల్ఐ కాల్వల ద్వారా సాగునీరు ఆగిపోవడంతో కాల్వలకు మరమ్మతులు చేపట్టాలనే డిమాండ్ రైతుల నుంచి ఊపందుకున్నది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి కేఎల్ఐ ఎత్తిపోతల పథకం నుంచి కాల్వలకు సాగునీరు ఆగిపోయాయి. నీటి విడుదల ఆగిపోయిన నేపథ్యంలో కేఎల్ఐ కాల్వలకు సంబంధించిన మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. అండర్ టన్నెల్లు, డిస్ట్రిబ్యూటరీ కాల్వల మరమ్మతులు, రెగ్యూలేటర్ పనులు చాలా వరకు పెండింగ్లో ఉన్నారు. కాల్వలకు సిమెంట్ లైనింగ్ లేకపోవడంతో కాల్వల్లోకి నీరు ఇంకిపోయి సమీప పొలాలు జాలువారి పంటలు పాడవుతున్నాయి. పంటలు పాడవ్వడమే కాకుండా సాగునీటి వృథా ఎక్కువగా అవుతుంది. సాగునీరు విడుదల ఆగిపోయిన నేపథ్యంలో కాల్వ మరమ్మతు పనులు చేపట్టేందుకు దాదాపు ఆరునెలల గడువు దొరికింది. గడువు లోపల పెండింగ్ పనులు పూర్తి చేయాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు.
కల్వకుర్తి మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకంలో ప్యాకేజీ 29 కాల్వ ప్రధానమైంది. ఈ కాల్వ గుడిపల్లిగట్టు నుంచి కల్వకుర్తి మండలం జంగారెడ్డిపల్లి వరకు 160కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ కాల్వ టెయిల్ఎండ్ అయిన జంగారెడ్డిపల్లి నుంచి డీ-82( డిస్ట్రిబ్యూటరీ కాల్వ) ప్రారంభమై మాడ్గుల మండలం నాగిళ్ల వరకు మరో 58కిలో మీటర్ల వరకు ఉంది. ఈ కాల్వ ద్వారా కల్వకుర్తి నియోజకవర్గంలో దాదాపు 70వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ప్యాకేజీ 29ద్వారా నాగర్కర్నూల్ జిల్లాలో నాగర్కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గాలతోపాటు జడ్చర్ల, వనపర్తి నియోజకవర్గాలకు సాగునీరు అందుతుంది.
కేసీఆర్ ప్రభుత్వం హయాంలో 2017 సంవత్సరం ఆఖరున కల్వకుర్తి నియోజకవర్గానికి సాగునీరు వచ్చింది. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 29వ ప్యాకేజీకి సంబంధించి ప్రధాన కాల్వ పనులు అక్కడక్కడ మొదలు పెట్టి వదిలేశారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పనులపై దృష్టి సారించింది. కల్వకుర్తి నియోజకవర్గానికి సాగునీరు రావాలంటే దుందుభీ వాగుపై అక్విడెక్ట్ నిర్మించాల్సి ఉంది. యుద్ధప్రాతిపధికన అక్విడెక్ట్ నిర్మించారు. చివరకు 2017ఆఖరున కల్వకుర్తి ప్రాంతానికి సాగునీరు వచ్చింది. ముందుగా వట్టిపోయిన చెరువులను నింపారు. చెరువుల నింపుతుండడంతో భూగర్భ జలాలు పైకి వచ్చాయి. ఆ రోజు నుంచి 2023 ఆఖరు వరకు సాగునీరు వస్తూనే ఉంది. కేవలం ఏప్రిల్, మే నెలలు మినహా దాదాపు 9,10 నెలల పాటు సాగునీరు అందించింది.
సాగునీరు విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగవద్దనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం పనిచేసింది. ప్యాకేజీ 29 టెయిల్ ఎండ్ జంగారెడ్డిపల్లి వరకు 2017ఆఖరు నుంచి 2023ఆఖరు వరకు సంవత్సరంలో దాదాపు 8నుంచి 9నెలల పాటు సాగునీరు సరఫరా అయింది. కాల్వల్లో ఓవైపు సాగునీరు ఇస్తూనే మరోవైపు తాత్కాలిక పద్ధతిన పనులు చేస్తూ డిస్ట్రిబ్యూటరీ కాల్వ పనులు చేపట్టింది. కాల్వల్లో ఎప్పుడు సాగునీరు ఉండటం వల్ల కాంక్రిట్ పనులు చేపట్టడం చాలా వరకు వీలుపడలేదు. దీంతో కాంక్రిట్ పనులు చాలాచోట్ల మిగిలిపోయాయి. వర్షం నీరు కాల్వలోకి వస్తే కాల్వలు తెగిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కాల్వల కింద వర్షం నీరు వెళ్లేలా నిర్మించాల్సిన యూటీ(అండర్ టన్నెల్లు) చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. ప్రధానంగా డిస్ట్రిబ్యూటరీ 61,62, 63, 64లు పెండిండ్లో ఉండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాల్వల్లో నీరు నిరంతరం ప్రవహిస్తుండడంతో రెగ్యూలేటర్ పనులు చేపట్టడానికి వీలుపడలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేఎల్ఐ 29వ ప్యాకేజీకి సాగునీరు నిలిచిపోయింది. శ్రీశైలంలో నీరు లేనందున నీటిని నిలిపివేశామని అధికారులు చెబుతున్నారు. వర్షాలు వస్తేనే తిరిగి కాల్వల్లోకి సాగునీరు విడుదల చేస్తామని అధికారులు చెబుతున్న నేపథ్యంలో.. తిరిగి వర్షాలు ప్రారంభమయ్యే లోపు కాల్వలకు సంబంధించిన పెండింగ్ పనులు పూర్తి చేయాలని కేఎల్ఐ రైతు జేఏసీ నాయకుడు బండెల రాంచంద్రారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాడు. జూన్, జూలై వరకు కాల్వలోకి సాగునీరు వచ్చే అవకాశం లేదు. కాల్వ మరమ్మతులకు దాదాపు ఆరునెలల గడువు ఉంది. కేఎల్ఐ అధికారులు కాల్వ మరమ్మతులపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం 29వ ప్యాకేజీ పెండింగ్ పనులకు, డీ-82 కాల్వ పూర్తికి పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వాలని, ప్రధానంగా కాల్వకు లైనింగ్ పనులు చేయాలని రైతులు కోరుతున్నారు.
కాల్వలో నీరు ఆగిపోయింది. మళ్లీ వర్షాలు పడిన తర్వాత నీళ్లు వస్తాయి. అప్పటి వరకు ఆరు నెలల గడువుంది. ఈ గడువులో 29వ ప్యాకేజీకి సంబంధించి జంగారెడ్డిపల్లి టెయిల్ఎండ్ వరకు పెండింగ్ పనులు చేపట్టాలి. కాల్వకు లైనింగ్ లేకపోవడం వల్ల కాల్వలో పూడిక పేరుకుపోతుంది. యూటీలు లేకపోవడం వల్ల వర్షం నీరు కాల్వలోకి వచ్చి కాల్వలు తెగిపోతున్నాయి. డిస్ట్రిబ్యూటరీ కాల్వలకు రెగ్యులేటరీలు నిర్మించకుండా తాత్కాలిక పద్ధతిన సిమెంట్ గూనలు ఏర్పాటు చేశారు. వీటి వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ పనులపై దృష్టి సారించాలి. నాగిళ్ల వరకు సాగునీరు అందించే డీ-82 కాల్వ పనులు ఈ వానకాలం ఆరంభం నాటికి పూర్తి చేయాలి. ఈ నాలుగైదు రోజుల్లో ఈ ప్రాంత రైతులతో కలిసి ముఖ్యమంత్రి వద్దకు వెళుతాం.