విద్యా రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన సంస్కరణలు సర్కారు బడులకు కార్పొరేట్ వైభవాన్ని తీసుకొచ్చాయి. మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టిన మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నది. ఉచితంగా పాఠ్య, నోట్ పుస్తకాలు అందించడంతోపాటు నిష్ణాతులైన ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. డిజిటల్ తరగతులు, ల్యాబ్స్‌తోపాటు వసతులు కల్పించారు. ఆంగ్ల మాధ్యమానికి శ్రీకారం చుట్టగా ఆదరణ లభి స్తున్నది. దీంతో కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు మారాయి. అందుకే చేరేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో గద్వాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అడ్మిషన్లు ఫుల్ అయ్యాయి. 8 నుంచి 10వ తరగతి వరకు సీట్లు లేవని, ఇందుకు తల్లిదండ్రులు సహకరించాలని ఉపాధ్యాయులు బడిగేటుకు బ్యానర్ పెట్టారు. దీన్ని బట్టి ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతున్నది.
Mana ooru- Mana Badi | గద్వాల, జూలై 1 : తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసింది. మన ఊరు-మనబడి, మన బస్తీ- మనబడి కార్యక్రమాలతో బడులు బలోపేతమయ్యాయి. రూ.కోట్ల వ్యయం తో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి ప్రభుత్వం అభివృద్ధి చే సింది. నేడు నూతన సొబగులు సంతరించుకున్నాయి. నిష్ణాతులైన ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తుండడంతో మెరుగైన విద్యాబోధన అందుతున్నది. ఉత్తీర్ణత శాతం పెరిగింది. నేడు కార్పొరేట్‌కు దీటుగా సర్కారు పాఠశాలలు తీర్చిదిద్దబడ్డాయి. దీనికి తోడు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన ప్రారంభమైంది. తెలుగు మీడియంతోపాటు రోజురోజుకూ ఇంగ్లిష్ చదువులకూ ఆదరణ పెరుగుతున్నది. పాఠశాలల్లోని విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఉపాధ్యాయుల నియామకంతో గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులు సర్కారు బడులపై ఆసక్తి చూపుతున్నారు. అలాగే విశాలమైన మైదానం, ఆహ్లాదకర వాతావరణం, ఆటాపాటలు, పెద్దపెద్ద గదులు ఉండడంతో తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ బడులకే పంపిస్తున్నారు. క్రేజ్ బాగా పెరగడంతో పలువురు విద్యార్థులు చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో స్థాయికి మించి నమోదు ప్రక్రియ జరుగుతున్నది. నేడు అడ్మిషన్లు ఫుల్ అని బోర్డు పెట్టే స్థాయికి స్కూళ్లు ఎదిగాయంటే ఇదంతా సీఎం కేసీఆర్ చలువే.
సర్కారు బడులు అమ్మఒడిని తలపిస్తున్నాయి. అందుకే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలవైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలతోపాటు మధ్యాహ్న భోజనం, ఉచిత బస్‌పాస్‌లు అందిస్తున్నారు. అందుకే గ్రామీణ ప్రాంత విద్యార్థులు అధికంగా సర్కారు బడుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదివి వేలకు వేలు ఫీజు చెల్లించలేక, ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు బాగా ఉండడంతో వారి పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. పైవేట్ పాఠశాల వద్దు.. ప్రభుత్వ పాఠశాల ముద్దు అని భావిస్తున్నారు. దీంతో చేరేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమైన 18 రోజులకే ప్రవేశాలు నిండిపోతున్నాయి. గద్వాల బాలికల ఉన్నత పాఠశాలలో అడ్మిషన్లు ఫుల్ అయ్యాయని బోర్డు ఏర్పాటు చేశారు. దీన్ని బట్టి ఎంత ఆదరణ ఉందో అర్థమవుతున్నది. అభ్యసన, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలల్లో సైతం త్వరలో అడ్మిషన్లు నిండిపోనున్నాయి. గతేడాది కూడా ఈ రెండు బడుల్లో ప్రవేశాల స్థాయికి మించి నమోదవుతున్నాయి.
గద్వాల బాలికల ఉన్నత పాఠశాలలో గతేడాది తెలుగు, ఇంగ్లిష్ మీడియాల్లో కలిపి మొత్తం 982 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేశారు. ఈ ఏడాది 1,057కు పెరిగింది. వీరికి పాఠాలు బోధించేందుకు 20 మంది ఉపాధ్యాయులు ఉండగా.. 13 గదులు ఉన్నాయి. 8, 9, 10 తరగతుల్లో అడ్మిషన్లు ఫుల్ అయ్యాయి. ఒక్క విద్యార్థిని కూడా చేర్చుకునేందుకు వీలు లేకుండాపోయింది. ఇప్పటికే 8వ తరగతి తెలుగు మీడియంలో 92 మంది, ఆంగ్ల మాధ్యమంలో 105 మంది విద్యార్థినులు ఉన్నారు. 9వ తరగతి తెలుగు మీడియంలో 94, ఇంగ్లిష్ మీడియంలో 79 మంది, 10వ తరగతిలో తెలుగు మీడియం రెండు సెక్షన్లలో 158 మంది, ఇంగ్లిష్ మీడియంలో 68 మంది విద్యార్థినులు అడ్మిషన్లు పొందారు. ఈ మూడు తరగతుల్లో ప్రవేశాలు ఫుల్ అయ్యాయి. ఇందుకోసం విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలని కోరుతూ పాఠశాల ఆవరణలోని గేటుకు నో అడ్మిషన్లు అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. పాఠశాలలు ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల వద్ద అడ్మిషన్లు లేవని బోర్డు పెట్టారంటే ప్రభుత్వ బడులకు ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో.. ఒత్తిడి లేకుండా ఉపాధ్యాయులు కొత్త ఆలోచనలతో విద్యా బోధన చేస్తున్నారు. ఇక్కడ డిజిటల్ తరగతులతోపాటు ఇంగ్లిష్ మీడియంలో బోధన నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు సులభ రీతిలో.. అర్థమయ్యే రీతిలో బోధన చేస్తున్నారు. అవసరమైన దుస్తువులు, టై, బెల్టు, బ్యాడ్జీలు, పుస్తకాలు ఉచితంగా అందిస్తున్నారు. చిన్న జిల్లాల ఏర్పాటుతో అధికారుల పర్యవేక్షణ ఎక్కువైంది. నిత్యం క్రమపద్ధతి చదువులతో పాటు విద్యార్థులు పాఠశాలకు రాకుంటే తల్లిదండ్రులను పిలిచి మాట్లాడడం… ఆటలు నేర్పిస్తున్నారు.
తెలంగాణలో విద్యారంగం బలోపేతమైంది. ప్రభుత్వం తీసుకుంటున్న మంచి మంచి నిర్ణయాలతో ప్రస్తుతం సర్కార్ పాఠశాలలకు ఆదరణ పెరిగింది. మా పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభమైన 11 రోజుల్లోనే 8, 9, 10 తరగతుల్లో సీట్ల సంఖ్య ఫుల్ అయ్యింది. ఇప్పటికే స్థాయికి మించి విద్యార్థునులను చేర్చుకున్నాం. నిష్ణాతులైన ఉపాధ్యాయులచే బోధన.. సకల సౌకర్యాలు ఉండడంతో విద్యార్థులు ఇక్కడ చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు.
– రాజానందం, హెచ్ఎం, ప్రభుత్వ బాలికల పాఠశాల, గద్వాల
ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉండడంతో విద్యార్థులకు సులభ రీతిలో బోధన అందుతున్నది. దీనికితోడు విద్యార్థులకు అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నది. ఇంగ్లిష్ మీడియం ఏర్పాటుతో ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఎప్పుడూ చదువు.. చదువు అని విద్యార్థులను వేధిస్తుంటారు. కానీ ప్రభుత్వ బడుల్లో చదువుతోపాటు క్రీడలను ప్రోత్సహిస్తారు. ప్రొజెక్టర్‌తో సులభరీతిలో అర్థమయ్యే బోధన చేపడుతారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి బోధన చేస్తున్నారు. విద్యార్థులు అందరూ
ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరాలి.
– శృతి, 9వ తరగతి విద్యార్థి
ప్రైవేట్ పాఠశాల కంటే ప్రభుత్వ బడుల్లోనే ప్రస్తుతం మెరుగైన విద్యాబోధన అందుతున్నది. ఇక్కడ చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత పుస్తకాలతోపాటు యూనిఫాం అందిస్తున్నది. మధ్యాహ్న భోజనం పెడుతుండడంతో విద్యార్థుల కడుపు నిండుతున్నది. దీంతో ఎక్కువ మంది విద్యార్థులు సర్కార్ బడుల వైపు మొగ్గు చూపుతున్నారు. మన ఊరు-మన బడితో కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పించడంతో నేడు బడి రూపు మారింది. ఇక్కడ చదవడంతో మంచి విద్యతో పాటు తల్లిదండ్రులకు ఖర్చు ఉండదు.
– జ్యోత్స్న, 9వ తరగతి , బాలికల పాఠశాల, గద్వాల