రాజోళి, డిసెంబర్ 20 : రాజోళి మండల పరిధిలోని తూర్పు గార్లపాడు గ్రామ శివారులో ప్రభుత్వ అనుమతులతో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ దగ్గర ఏపీకి చెందిన గ్రామస్తులు పోలీస్ అధికారులతో సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం అనుమతులతో ఇక్కడి నుంచి ఇసుకను తరలిస్తుండగా ఏపీకి చెందిన ఆర్ కొంతలపాడు గ్రామస్తులు అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చి అడ్డుకున్నారు. రాజోళి మండల అధికారులు ఏపీ సంబంధిత అధికారులతో మాట్లాడారు.
ఈ విషయంపై జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వడంతో శుక్రవారం అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, మైనింగ్ ఏడీ రమణ, డీఎస్పీ సత్యనారాయణ సరిహద్దు ప్రదేశంలో సమస్యపై తుంగభద్ర నదిలో తెలంగాణ సరిహద్దు ప్రాంతం దగ్గరకు ట్రాక్టర్లో వెళ్లి పర్యవేక్షించారు. ఈ సమస్యపై స్థానికులు సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఏపీకి చెందిన గ్రామస్తులు అనుమతులతో ఇసుకను తరలిస్తుంటే కట్టేలతో దాడి చేస్తూ అడ్డుకుంటూన్నారని తెలిపారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఏపీకి చెందిన జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఇరువురి అధికారుల సమక్షంలో గూగుల్ మ్యాప్ ఆధారంగా సర్వే నిర్వహించి సరిహుద్దులు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. తుంగభద్ర నది మధ్యలో సరిహద్దు సర్వే నిర్వహించి సమస్య పరిష్కరించే వరకు ట్రాక్టర్లు నదిలోకి వెళ్లవద్దని యజమానులకు తెలిపారు. అదనపు కలెక్టర్ వెంట తాసీల్దార్ రామ్మోహన్, సీఐ టాటా బాబు, రాజోళి ఎస్సై జగదీశ్, కర్నూల్ ఎస్సై రామాంజనేయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.