ఊట్కూర్, (కృష్ణ) నవంబర్ 23 : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతోపాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అదనపు కలెక్టర్ బెన్ షాలోం అన్నారు. శనివారం మాగనూర్, కృష్ణ మండలాల్లో కేజీబీవీ, ఎస్సీ హాస్టల్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం, మధ్యాహ్న భోజనం గురించి ఆరా తీశారు. విద్యాలయాల్లో కిచెన్ గదులు, కూరగాయలు, వంట సరుకుల స్టోర్ రూమ్‌ను తనిఖీ చేశారు. విద్యార్థులకు తాజా కూరగాయలు, ఆకుకూరలతో భోజనం వడ్డించాలన్నారు.
బియ్యం స్టాక్‌ను పరిశీలించారు. మాగనూర్ కేజీబీవీలో వాష్ రూం నుంచి దుర్వాసన వస్తోందని, శుభ్రం చేయించడం లేదని విద్యార్థులు అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మినరల్ వాటర్ సరఫరా చేయించాలని కోరారు. ఎస్వో రాధిక సమయ పాలన పాటించకపోవడంతో తమ సమస్యలను ఎవరితో చెప్పుకోలేక పోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన అదనపు కలెక్టర్ విచారణ చేపట్టాలని తాసీల్దార్ సురేశ్‌ను ఆదేశించారు.
ఎంఐఎస్ స్వప్న నిర్లక్ష్యంతో నెలల తరబడి కోడిగుడ్లు, సరుకుల బిల్లు లు అందలేదని వంట ఏజెన్సీలు ఫిర్యాదు చేయడంతో ఎంఐఎస్ షోకాజ్ నోటీస్ అందజేయాలని ఎంపీడీవో రహీముద్దీన్‌ను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతోపాటు శుచికరమైన భోజనం అందించేందుకు అధికారులు తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అలాగే కృష్ణ తాసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. అధికారులు సమయపాలన పాటించాలని ఆదేశించారు.
మండలకేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌ను పేట ఆర్డీవో రాంచందర్ తనిఖీ చేశారు. హాస్టల్ వంట గదులు, మరుగు దొడ్లు, మూత్రశాలలను పరిశీలించారు. విద్యార్థులకు తాగునీటి సరఫరాను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పులిమామిడి కేజీబీవీని సందర్శించారు. విద్యార్థులకు వండిన ఆహార పదార్థాలను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, మరుగు దొడ్లు, బాత్రూంలు పరిశుభ్రంగా ఉం చుకోవాలని సూచించారు. మండల ప్రత్యేకాధికారి ఉమాపతి, ఎంపీడీవో ధనుంజయగౌడ్, పెద్దజట్రం, అవుసలోనిపల్లి, బిజ్వారం, మొగ్దుంపూర్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను తనిఖీ చేసి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మొగ్దుంపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు మధ్యా హ్న భో జనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వంట ఏజన్సీలను రద్దు చేస్తామని హెచ్చరించారు.