ఓటరు నమోదు, తప్పొప్పులకు ఎన్నికల సంఘం మరోసారి అవకాశం కల్పించింది. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జనవరి ఒకటో తేదీ నాటికి 18ఏండ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించింది. జనవరి 5వ తేదీలోగా కొత్త దరఖాస్తులను పరిశీలించి మార్పులు, చేర్పులు చేపట్టనున్నారు. 6వ తేదీన ముసాయిదా జాబితా విడుదల చేస్తారు. 22వ తేదీన అభ్యంతరాలను స్వీకరించి ఫిబ్రవరి 8వ తేదీన తుది జాబితాను జిల్లా ఎన్నికల సంఘం అధికారులు విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.
నాగర్కర్నూల్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : ఓటరు జాబితా సవరణకు ఎన్నికల సంఘం మరోసారి శ్రీకారం చుట్టింది. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు ముగియగా, సాధారణ సవరణలో భాగంగా లోక్సభ ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదు చేపట్టనున్నది. జనవరి 1వ తేదీ నాటికి 18ఏండ్లు నిండిన యువతకు ఓటరుగా నమోదు చేయనుండడంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలూ ఉండటంతో కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించింది.
అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో జనవరిలో పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, పురపాలికలతోపాటు లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణ చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా 2024 జనవరి ఒకటో తేదీ నాటికి 18ఏండ్లు నిండిన యువతకు ఓటరుగా పేరు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీనికి సంబంధించి ఇటీవలే షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం ఓటర్ల నమోదుతోపాటుగా బోగస్ ఓట్ల తొలగింపు, చిరునామాల మార్పులు చేసుకోవచ్చు. ఇలా రూపొందించిన ఓటర్ల జాబితా తుది ప్రక్రియను ఫిబ్రవరి 8వ తేదీ నాటికి పూర్తి చేయనున్నది. ఓటు నమోదు కోసం బీఎల్వోలతోపాటు ఆన్లైన్లోనూ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఈ క్రమంలో 18ఏండ్లు నిండిన యువత పేర్లు సేకరించేందుకు బీఎల్వోలు ఇంటింటినీ సందర్శిస్తారు. కొత్తగా ఫారం-6లో దరఖాస్తు ఇస్తే బీఎల్వోలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అలాగే ఓటరు గుర్తింపు కార్డు చిరునామా, తప్పుల సవరణకూ ఇందులో అవకాశం ఉంది. ఓటరు జాబితాలతోపాటు పోలింగ్ కేంద్రాల్లోనూ క్రమబద్ధీకరించనున్నారు. కాగా, ఓటరు జాబితా సవరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో అధికారులు ఓటరు సవరణను పర్యవేక్షించనున్నారు. ముఖ్యంగా విద్యా సంస్థల్లో ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో 18సంవత్సరాలు నిండిన యువత నుంచి అక్కడికక్కడే దరఖాస్తులు స్వీకరించి ఓటరు నమోదుపై అవగాహన కల్పిస్తారు. ఇంతకుముందులా బూత్ స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేలా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ప్రారంభించనున్నారు. జనవరి 5వ తేదీలోగా కొత్త దరఖాస్తులను పరిశీలించడం, మార్పులు, చేర్పులు చేపడతారు. 6వ తేదీన ముసాయిదా జాబితా విడుదల చేస్తారు. 22వ తేదీన ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుంది. వాటిని పరిశీలించిన అనంతరం మరోసారి బీఎల్వోలు ఇంటింటి సర్వే చేపట్టి ఫిబ్రవరి 8వ తేదీన తుది జాబితాను జిల్లా ఎన్నికల సంఘం అధికారులతో విడుదల చేయడం జరుగుతంది. తాజాగా నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను ఈ సవరణలో పునరావృతం కాకుండా ఎన్నికల అధికారులు బీఎల్వోలకు ఆదేశాలు జారీ చేయనున్నారు. వచ్చే సంవత్సరం పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్లకు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు చివరగా ఎంపీ ఎన్నికలూ జరగనున్నాయి. దీంతో ఓటరు నమోదు పూర్తిస్థాయిలో జరిగేలా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
ఈనెల 20వ తేదీ నుంచి ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం నిర్వహిస్తాం. వచ్చే సంవత్స రం లోక్సభకు, ఇతర స్థానిక సం స్థలకు ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన ఓటర్లు అడ్రస్లు, పో లింగ్ కేంద్రాల మార్పుతోపాటు ముఖ్యంగా జనవరి 1నాటికి 18ఏండ్లు నిండిన యువతను ఓటర్లుగా నమోదు చేయడం ఈ సవరణ ఉద్దేశం.