వంగూరు, మే 15 : మొక్కజొన్న ధాన్యాన్ని మోదీ కొనవద్దని అంటుండని మక్కల కొను గోళ్లపై అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ కొత్త భాస్యం చెప్పారు. మక్కలను కేంద్రం కొనుగోలు చేస్తుందని.. ఇందులో తమకేమి సంబంధమని దబాయించారు. మక్కలను మేమే కొంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తుంది కదా? అని ఓ రైతు ప్రశ్నిస్తే.. మోదీని అడగంటూ ఎదురు ప్రశ్నించాడు. ఎమ్మెల్యే సమాధానాలు విన్న రైతులు అవా క్కయ్యారు. వెంటనే ఢిల్లీకి పోయి ప్రధాని మోదీని కలిసి కొనుగోలు చేయాలని అడగా లేమోనని పలువురు అన్నదాతలు సెటైర్లు విసిరారు.
వివరాల్లోకి వెళితే.. నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండల కేంద్రంలో శుక్రవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రా రంభించేందుకు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ హాజరయ్యారు. విషయం తెలుసుకొన్న బీజేపీ నాయకులతో కలిసి మక్క రైతులు కేంద్రం వద్దకు చేరుకున్నారు. ‘కొనుగోలు చేయకపోవడంతో కల్లాల్లోనే మక్కలు ఉన్నాయని.. వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.. గన్నీ బ్యాగులు లేవు.. తరలించేందుకు లారీలు లేవు.. నిల్వ చేసేందుకు గోదాంలు లేవు.. ఏం చేయాలి..? ఎక్కడ చావాలి? అంటూ రైతులతో కలిసి కమ లం పార్టీ నాయకులు ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చి మక్కను కొనవద్దని పీఎం చెప్పారు.. మేమేమి చేయాలని ఎదురు ప్రశ్నించాడు.
ఆగ్రహంతో బీజేపీ నేతను ఎమ్మెల్యే నెట్టేయగా.. కింద పడడంతో ఉద్రిక్తత నెల కొన్నది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, రైతులు తోసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకున్నది. సమస్య అడగడానికొస్తే చేయి చేసుకుంటారా? అని నేతలు మం డిపడుతూ ఎమ్మెల్యేను అడ్డుకునే యత్నం చేయగా పోలీసుల పహారాలో ఆయ న కారెక్కి వెళ్లిపోయారు. కొనుగోలు విషయమై ఎమ్మెల్యే స్పందించిన తీరుపై రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే బాధ్యతారహితంగా మాట్లాడారని పలువురు మండిపడుతున్నారు. అయితే పీఎం మక్కను కొనద్దంటూ చెబుతున్నా ఎమ్మెల్యే వంశీకృష్ణ అచ్చంపేట నియోజకవర్గంలో కేంద్రాలను ఎందుకు ప్రారంభించారని రైతులు ప్రశ్నిస్తున్నారు.