మానవపాడు, జూలై 13 : వానకాలం ప్రారంభమైనప్పటి నుంచి పదునైన వానలు కురియలేదు. దీంతో వ్యవసాయానికి సిద్ధమైన రైతులు వరుణుడి కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయినా వరుణుడు కరుణించకపోవడంతో వరుణుడి కోసం ప్రత్యేక పూజలు ప్రారంభించారు.
ఈ మేరకు సోమవారం మానవపాడు మండలం పల్లెపాడు గ్రామస్తులు 101 ఎడ్ల బండ్లతో కృష్ణానదికి ఊరేగింపుగా వెళ్లి 1001 బిందెళ్లతో నీటిని తీసుకువచ్చి గ్రామంలోని శివలింగానికి, బొడ్రాయికి, గ్రామ దేవతలకు అభిషేకం నిర్వహించారు. ఊరేగింపు సందర్భంగా గ్రామం మొత్తం శివనామస్మరణతో మార్మోగింది. కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కొల్లాపూర్, జూలై 13 : కొల్లాపూర్ మండలం రామాపూరంలో వర్షం వరదగా మారాలని పాయసాన్ని గుట్టపై నుంచి కిందికి పోశారు. వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన దేవునిగుట్టకు ఎంతో ఆధ్యాత్మిక చరిత్ర ఉన్నది. కరువు కాలంలో ఇక్కడ పూజలు చేస్తే కాలం అవుతోందని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా ఈ వానకాలం మృగశిర కార్తెలో విత్తనాలు విత్తిన ఒక్క విత్తనం కూడా బయటకు రాక రైతులకు భారీ నష్టాన్ని కల్పించింది.
రోజూ వర్షం కోసం ఎదరుచూస్తున్న గ్రామస్తులు అలసిపోయారు. దీంతో గ్రామస్తుల సహకారంతో ఆ గ్రామ సర్పంచ్ కొమ్మ గోపాల్ సోమవారం దేవునిగుట్టపై వర్షం కోసం వరుణయాగం ఏర్పాటు చేశారు. వరుణయాగం అనంతరం పాయసాన్ని తయారు చేసి స్వామి వారికి నైవేధ్యం అందించిన తర్వాత గంగా ముఖంగా పాయసాన్ని గుట్టపై నుంచి వరదగా పారించారు. పాయసం మాదిరి వర్షం కూడా వరదగా మారి పాడి పంటలు పండాలని వేడుకున్నట్లు సర్పంచ్ తెలిపారు.