Mahabubnagar | మూసాపేట, ఏప్రిల్ 15 : మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలుల వేగానికి ఏకంగా ఇనుప డబ్బానే గాలికి కొట్టుకొచ్చి ఓ మహిళపై పడడంతో అక్కడికక్కడే ఆమె దుర్మరణం చెందింది. మరోవైపు కురిసిన వర్షానికి పండించిన ధాన్యం ఆరబోయడంతో వర్షానికి కొట్టుకుపోయి రైతులకు తీరని నష్టం జరిగింది.
మూసాపేట మండలంలోని వేముల గ్రామానికి చెందిన అయ్యమ్మ (50) ఇటీవల వరి పంటను కోసి వేముల కోజేంట్ పరిశ్రమ ముందు ఉన్న గ్రామ రోడ్డుపై ధాన్యాన్ని ఆరబెట్టారు. వరి ధాన్యాన్ని ఆరబోసి కాపలా ఉన్న అయ్యమ్మ ఈదురుగాలులతో కూడిన వర్షం రావడంతో వడ్లను కుప్పగట్టి పక్కకు నిలిచి ఉండేందుకు వెళ్ళింది. అయితే ఆ పక్కనే ఉన్న ఓ ఇనుప రేకులతో ఉన్న డబ్బా గాలికి వచ్చి పల్టీలు కొడుతూ ఆమెపై పడింది. చూసిన తోటి రైతులు అందరూ కలిసి ఆ డబ్బను పైకి లేపి చూశారు. కానీ అప్పటికే ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలిసి గ్రామస్తులంతా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, తహసీల్దార్ రాజు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమె మృతి పట్ల ఆరా తీశారు. వారి కుటుంబ సభ్యుల వివరాలను కూడా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రాజు మాట్లాడుతూ మహిళా మృతిపై పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తానని చెప్పారు. కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
కొట్టుకపోయిన వారి ధాన్యం
మూసాపేట మండలంలోని ఆయా గ్రామాల్లో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఆరబోసిన వరి ధాన్యం వర్షానికి తడిసింది. రైతులు పండించిన ధాన్యాన్ని వర్షం నుంచి కాపాడుకునేందుకు ఉరుకులు పరుగులు పెడుతూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మూసాపేట మండల కేంద్రంలో పాటు వేముల, సంకలమర్ది, కొమిరెడ్డిపల్లి, జానంపేట, తుంకినిపూర్ గ్రామాల్లో వర్షానికి వరి ధాన్యం తడిసి వరదకు కొట్టుకుపోయింది. రైతులు మాట్లాడుతూ వరి ధాన్య సేకరణకు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని వారం రోజుల నుంచి రోడ్లపైనే ధాన్యం నిల్వ ఉంచామన్నారు. ఆరబెట్టిన ధాన్యాన్ని ఇంకా ఆరబెట్టాలి.. తూర్పారబెట్టాలి అంటూ వివిధ కారణాలతో ధాన్య సేకరణ ఆలస్యం చేస్తుండడం వల్లనే తమకు ఇబ్బందులు పెరుగుతున్నాయని నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.