Nagarkurnool | ఊరుకొండ, జూన్ 3 : అడవి పందుల వేటకు వెళ్లి కరెంట్ షాక్ తగిలి ఓ వ్యక్తి చనిపోయిన ఘటన మండల కేంద్రంలోని జకినాలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం జకినాలపల్లి గ్రామానికి చెందిన బోయ జంగయ్య(35) అమ్మపెల్లి తండాకు చెందిన కొందరు వ్యక్తులతో కలసి గత కొద్ది రోజులుగా అడవి పందుల వేటకు వెళ్తున్నాడు. ప్రమాదావశాత్తు కరెంట్ తీగలు కాలికి తగిలి బోయ జంగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.
షికారుకు తనతో వచ్చిన వ్యక్తులు గమనించి అతడిని కొద్ది దూరం తీసుకెళ్లి చెట్టు కింద పడుకోబెట్టారు. కానీ జంగయ్య అప్పటికే మృతి చెందడంతో భయభ్రాంతులకు గురై అక్కడి నుండి పరారయ్యారు. విషయం తెలుసుకున్న జంగయ్య భార్య ఘటనాస్థలానికి చేరుకుని బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జంగయ్యకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.