మక్తల్ : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం, కొరవడిన పర్యవేక్షణ లోపంవల్ల ఒక నిండు ప్రాణం బలైంది. ఒక వ్యక్తి విద్యుత్ తీగలకు వేలాడుతూ మంటల్లో కాలిపోయిన ఘటన మక్తల్ మండలం కర్ని సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. మక్తల్ మున్సిపాలిటీలోని ఆరో వార్డు చందాపూర్ గ్రామానికి చెందిన ప్రైవేట్ విద్యుత్ కాంట్రాక్టర్ చిన్న వెంకటేష్ మక్తల్ మండలం కర్ని సబ్‌స్టేషన్ పరిధిలోని పర్మన్ దొడ్డి గ్రామంలో రైతు. వ్యవసాయ పొలానికి నూతన ట్రాన్స్ఫార్మర్ కలెక్షన్ కోసం శుక్రవారం ఉదయం అదే గ్రామానికి చెందిన కూలీలతో విద్యుత్ పనులు చేయిస్తున్నారు.
అంతకుముందు విద్యుత్ పనుల కోసం లైన్ ఆఫ్ చేయాలని కర్ని సబ్‌స్టేషన్ లైన్మెన్ నితిన్‌ను ఎల్సీ కోరారు. లైన్మెన్ ఎల్సీ ఇచ్చి తన సొంత పనులపై బయటకు వెళ్లిపోయారు. సబ్ స్టేషన్లో ఉన్న ఆపరేటర్ లక్ష్మప్పకు ఎల్సీకి సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో లైన్‌ను ప్రారంభించాడు. దాంతో కర్ని సబ్ స్టేషన్ పరిధిలో స్తంభంపైకి ఎక్కి విద్యుత్ పనులు చేస్తున్న చందాపూర్ గ్రామానికి చెందిన మహేష్ (21) కి విద్యుత్ షాక్ తగిలింది. దాంతో అతడు మంటల్లో కాలుతూ అక్కడికక్కడే మృతిచెందాడు.
విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఒక నిండు ప్రాణం పోయిందని మహేశ్ కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. కరెంటు షాక్‌తో ఛాతిభాగం సగానికి పైగా కాలిపోయి మృతి చెందాడని చెప్పారు. విద్యుత్ పనులు నడుస్తున్న సమయంలో విద్యుత్ సరఫరాను నిలిపివేసి సబ్ స్టేషన్ దగ్గరే ఉండాల్సిన లైన్మెన్, తన విధుల పట్ల నిర్లక్ష్యం వహించి, సబ్‌స్టేషన్ వద్ద ఉండకుండా వెళ్లిపోవడం, అక్కడున్న సిబ్బంది లక్ష్మప్ప విద్యుత్ సరఫరాను ప్రారంభించడంతోనే మహేష్ మృత్యువాత పడ్డాడని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిరంతరం సబ్‌స్టేషన్‌లో విద్యుత్ సరఫరాను చూసుకునే సిబ్బంది, పని వదిలేసి ఇష్టానుసారంగా మద్యానికి బానిసలై, సబ్‌స్టేషన్ ఆవరణ మొత్తాన్ని మద్యం సీసాలతో నింపి, ఒక బార్గా మార్చారని పలువురు ఆరోపిస్తున్నారు. విద్యుత్ సిబ్బంది మద్యం సేవిస్తూ విధులు నిర్వహించడం వల్లనే ఇలా నిండు ప్రాణాలు కరెంటుకు ఆహుతి అయిపోతున్నాయని విమర్శించారు. సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పనితీరును పర్యవేక్షించాల్సిన అధికారులు సైతం నిర్లక్ష్యంగా ఉండటంవల్లే ఇలా జరుగుతోందని మండిపడుతున్నారు.
సిబ్బంది సబ్‌స్టేషన్ ఆవరణ మొత్తం మద్యం సీసాలతో నింపివేస్తున్నారని, వీరి నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది రైతులు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తోందని విమర్శిస్తున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఇలా ఎంతమందిని పొట్టన పెట్టుకుంటారని మహేశ్ మృతదేహంతో మక్తల్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించి భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. విద్యుత్ ఉన్నతాధికారులు వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేసేంతవరకు ధర్నాని విరమించబోమని కుటుంబసభ్యులు పట్టుబట్టారు. తమకు న్యాయం జరిగేంత వరకు సబ్‌స్టేషన్ బందు నిర్వహిస్తామని చెప్పి మక్తల్ సబ్‌స్టేషన్ నుంచి పట్టణానికి సరఫరా అయ్యే విద్యుత్‌ను నిలిపివేశారు.