యాసంగి పంటలకు నీటి తడులు అందించలేక రైతులు పడుతున్న బాధలు వర్ణణాతీతం. చేతికొచ్చిన పంట కండ్ల ముందే ఎండిపోతుండడంతో దిగాలు చెందుతున్నారు. వర్షాలు సమృద్ధిగా పడినా.. ఎగువ నుంచి ప్రాజెక్టులకు వరద వచ్చినా.. ఎక్కువ మొత్తంలో నీటిని ఒడిసిపట్టకపోవడంతో డ్యాంలు, రిజర్వా యర్లలో నీటిమట్టం తగ్గిపోయింది. చెరువులు ఒట్టిపోగా.. బోర్లు అడుగంటాయి.. కాల్వల్లో జలకళ తప్పింది.. భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయాయి. రైతు భరోసా అందకున్నా.. వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చి మరీ సాగు మొదలు పెడితే వారి ఆశలన్నీ అడుగంటాయి. వీటిని కాపాడుకునేందుకు రైతులు తాపత్రయపడుతున్నారు. దీంతో యాసంగి పంటల సాగు ప్రశ్నార్థకంగా మారగా.. ఎండిన పంటలు చూసి రైతులు గుండెలు బాదుకుంటున్నారు.
వనపర్తి, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : పెద్దమందడి మండలం జంగమాయిపల్లికి చెందిన చాకలి మహేశ్ యాసంగిలో 15 ఎకరాల్లో వరిసాగు చేశాడు. వీటిలో మహేశ్‌కు సొంతంగా 2 ఎకరాలుంటే, మిగి తా పాలిభాగస్తుల పొలంను కౌలుకు తీసుకున్నాడు. సొంతంగా ట్రాక్ట ర్ ఉండటం వల్ల ఎక్కువ పొలం కౌలుకు తీసుకుని ఐదేండ్లుగా చేస్తున్నాడు. ప్రస్తుతం మహేశ్‌కి చెందిన వరి పొలం 4 ఎకరాలు ఎండిపోయింది. నెలరోజుల కిందట లోఓల్టేజీతో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిం ది. ఇది సరి చేయడానికి నాలుగు రోజులు పట్టింది. తీరా తెచ్చిన త ర్వాత కూడా పని చేయకుండా సతాయించింది. మళ్లీ రెండు దఫాలు కొత్తకోటలోని ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కేంద్రానికి తీసుకెళ్లాల్సి వ చ్చింది. దీంతో బోరులో పుష్కలంగా నీరున్నా కరెంటు లేక సకాలంలో నీటిని అందించలేకపోవడంతో పొలం ఎండిపోయింది.
వనపర్తి జిల్లాలో 1.85 ఎకరాల్లో..
జిల్లాలో వేసిన యాసంగి పంటలు రైతుల మెడకు ఉరి అన్నట్లుగా మారుతున్నాయి. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి చివరకు పంటలు ఎండిపోయే పరిస్థితిలో అన్నదాతలు ఆగమవుతున్నారు. గడచిన పదేండ్లలో కరవును మరిచిన ఈ ప్రాంతంలో మళ్లీ పాత పరిస్థితులు పునరావృతం అవుతుండడంతో అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యమా అంటూ కరెంటు లోఓల్టేజీ రైతుల పాలిట శాపంగా మారుతుంది. ఇప్పుడిప్పుడే ఎండలు ముదురుతున్న వేళ మున్ముందు ఎలాంటి గడ్డు పరిస్థితులుంటాయోనన్న బెంగ రైతుల్లో వ్యక్తవుతుంది. జిల్లాలో లక్షా 85వేల ఎకరాల్లో యాసంగి పంటలు సాగయ్యాయి. ఇందులో వరి శిస్తు మాత్రమే అధికంగా ఉంది. ఐదారేండ్లుగా ఇలా రెండు పంటలు సమృద్ధిగా పండించిన రైతులు యథావిధిగా ఈ యాసంగిలోనూ ఎప్పటిలాగే పంటలు వేసుకున్నారు. కొత్తగా వేసిన భూములు కావు.. పంటలు కావు. పదేండ్లుగా అవే సాగుబడులు.. లక్షణంగా పంటలు పండించిన పరిస్థితులు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మళ్లీ అన్నదాతలకు కరెంటు కష్టాలు షురూ అయ్యాయి. వేసిన పంటలు చేతికి వస్తాయన్న గ్యారెంటీ లేదు. కాల్వల నుంచి నీరొస్తుందన్న నమ్మకం అంతకూ లేదు. యాసంగి పంటలు ఎండనివ్వం అంటున్న ప్రభుత్వానికి గ్రామాలకు వచ్చి చూస్తే వాస్తవ పరిస్థితులు అర్థమవుతాయని అన్నదాతలు బావురుమంటున్నారు.
ఎండిన పొలం ఏడెకరాలపైనే..
పెద్దమందడి మండలం జంగమాయిపల్లి గ్రామంలో గజ్జిలంగండి ప్రాంతంలో రైతులు వేసుకున్న యాసంగి చేలు ఎండిపోతున్నాయి. ఇప్పటికే ఏడు ఎకరాలకు పైగా ఏడుగురు రైతుల వరి పొలాలు ఎండిపోయాయి. మునుముందు ఇంకా మరిన్ని పొలాలు ఎండిపోయే అవకాశం ఉన్నది. ఇప్పటి వరకు ఎండిన పొలాల లెక్కన చూస్తే.. చాకలి మహేశ్ 4 ఎకరాలు, చిన్నమన్యం ఎకరన్నర, పానుగంటి రాజు ముప్పావు ఎకరం, పి వెంకటయ్య అరఎకరం, సత్తయ్య అర ఎకరం, మద్దిగట్ల విజయ్ అరఎకరం వరి పొలం ఎండింది. ఇదంతా ఈ ఒక్క ఏరియాలోని రైతులదే. ఇవన్ని కూడా కేవలం కరెంటు లోఓల్టేజీ సమస్యతోనే ఎండుతున్నాయి.
మక్తల్ మండలం మాధన్పల్లికి చెందిన హుస్సేనోళ్ల చిన్న రాములు రెండెకరాలలో వేరుశనగ, మరో ఎకరన్నరంలో వరి పంటలను సాగు చేశాడు. కొద్ది రోజులుగా బోరులో నీరు ఇంకిపోవడానికితోడు కరెంట్ కోతలతో పంటలకు సక్రమంగా నీరు పారని పరిస్థితి ఏర్పడింది. పంటలను కాపాడుకునేందుకు పాతాళగంగను పైకి తెచ్చేందుకు భగీరథ యత్నం చేశాడు. మంగళవారం పొలంలో రెండు బోర్లు 200 ఫీట్ల చొప్పున డ్రిల్లింగ్ చేయించినా వేసినా చుక్క నీరు పడలేదు. వీటి కోసం అదనంగా మరో రూ.50 వేలు, పంట పెట్టుబడికి రూ.80 వేలు చేసిన అప్పులు ఎలా తీర్చాలో మదనపడుతున్నాడు. గతంలో ఎన్నడూ ఇలాంటి కరువు రాలేదు. కేసీఆర్ సార్ హయాంలో రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక వ్యవసాయమంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అప్పులు ఎలా కట్టాలో తెలియడం లేదని గుండెలు బాదుకుంటున్నాడు.
మక్తల్ మండలం గొల్లపల్లికి చెందిన రైతు కావలి అమ్రేశ్ తనకున్న 20 ఎకరాల్లో వరిని సాగు చేశాడు. సంగంబండ కాల్వ పూర్తిగా వట్టిబోవడం.. పొలంలో బోర్లు వేసినా చుక్క నీరు పడలేదు. దీంతో పంటను ఎలాగైనా కాపాడుకోవాలన్న తాపత్రయంతో పొలానికి కిలోమీటర్ దూరంలో ఉన్న తన ఇంటి స్థలంలో మంగళవారం బోరు వేయించాడు. ఇక్కడి నుంచి పైపులైన్ ద్వారా నీటిని పొలానికి పారబెట్టి పంటను కాపాడుకోవాలని నిర్ణయించాడు. కానీ తాను ఒకటి తలిస్తే విధి ఒకటి చేసిందన్నట్లు.. మొదటి బోరులో నీరు పడకపోడంతో మరోచోట డ్రిల్లింగ్ చేయించగా.. కొద్దిపాటు నీరు పడింది. ఇప్పటికే పంట పెట్టుబడికి రూ.లక్షల పెట్టుబడి పెట్టగా.. ఇప్పుడు బోరు కోసం మరోసారి ఆర్థికంగా ఇబ్బందులు తప్పలేదని సదరు రైతు వాపోయాడు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సంగంబండ కాల్వకు సాగునీటిని విడుదల చేస్తే తప్పా పంట పూర్తి స్థాయిలో చేతికొచ్చే పరిస్థితి లేదు.
ప్రభుత్వం ఆదుకోవాలి
లోవోల్టేజీతో ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం వల్ల నా వరి చేను నాలుగు ఎకరాలు ఎండి పోయింది. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేసేందుకు పది రోజులు సమయం పట్టింది. ఈ పది రోజుల్లోనే చేను దెబ్బతిన్నది. పైకి పచ్చగా కనిపించినా నెర్రెలిచ్చింది. ఇక దానికి నీరు కట్టడం అయ్యేపని కాదని గొర్రెలకు మేతగా ఇచ్చినం. మా రెక్కల కష్టం.. పెట్టుబడి అంతా పోయింది. ఇలా లోఓల్టేజీతో ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతోనే నాలుగు ఎకరాల వరి చేను గొర్రెల పాలైంది. ఇంకా పదెకరాల వరి వేశాను. పంట చేతికొస్తుందన్న గ్యారెంటీ లేదు. ఏమైనా మాకు కష్టకాలమే కనిపిస్తుంది. మా పంట నష్టాన్ని ప్రభుత్వమే భర్త్తీ చేయాలి.
– చాకలి మహేశ్, రైతు, జంగమాయిపల్లి, పెద్దమందడి మండలం
ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడంతో..
నా వరి పొలం అర ఎకరం ఎండి పోయింది. వారం రోజుల కిందట మాకు ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడంతో ఎండిన వరి చేను మళ్లీ తిరగబడింది. లోఓల్టేజీతో రెండు నెలలుగా ఇబ్బందులు పడ్డాం. నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. కరెంటు లోఓల్టేజీతోనే మాకు సమస్య ఏర్పడింది. కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుతో కొంత ఉపశపనం కలిగింది. లేకుంటే ఉన్న పొలం ఎండిపో యేది. ఇతర రైతుల పొలాలు ఎండిపోతున్నాయి. ఈ రెండు నెలలు పంటలు చేతికి వచ్చేదాకా కష్టంగా ఉంది. ఒకచోట కరెంటు సమస్య ఉంటే, మరోచోట బోర్లు ఎండిపోతున్నాయి.
– మద్దిగట్ల విజయ్, రైతు, జంగమాయిపల్లి, పెద్దమందడి మండలం