“వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామానికి చెందిన వెంకటేశ్.. ప్రజాపాలనలో జీరో బిల్లు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, అతడికి రెండు నెలలుగా జీరో బిల్లు రావడం లేదు. దీనిపై మండల పరిషత్ కార్యాలయానికి నాలుగు దఫాలు తిరిగాడు. చివరకు విద్యుత్ ఏఈని ఫోన్లో సంప్రదిస్తే.. లైన్మెన్ను అడగమన్నాడు. లైన్మెన్ను అడిగితే మండల పరిషత్‌కు వెళ్లమన్నాడు. మండల పరిషత్‌కు వెళ్తే కరెంట్ వాళ్ల దగ్గరికే వెళ్లమంటున్నారంటూ వెంకటేశ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇలా జీరో బిల్లు అమలు కోసం అక్కడి నుంచి ఇక్కడికి.. ఇక్కడి నుంచి అక్కడికి తిప్పుతున్నారు తప్పా పనిమాత్రం చేయడం లేదని వాపోతున్నాడు.”
వనపర్తి, జూలై 21 (నమస్తే తెలంగాణ) : వనపర్తి జిల్లాలో గృహజ్యోతి పథకం అమలు దాగుడు మూతలు ఆడుతున్నట్లుగా కనిపిస్తుంది. అర్హులైన నిరుపేదలకు అల్లంత దూరంగా ఉంటూ ప్రభుత్వ ఉద్దేశాన్ని నీరుగార్చుతున్నది. ఇందుకు వేలాది మంది దరఖాస్తులు చేసుకున్నప్పటికీ రెండు నెలలుగా ఆ పథకాన్ని అందుకోలేకపోవడమే నిదర్శ నం. జిల్లాలో అనేక మందికి అర్హత ఉన్నా .. ఆన్లైన్లో నమోదు చేయడంపై అలసత్వంతో గృహజ్యోతి పథకం రాయితీ పొందలేకపోతున్నారు. జి ల్లాలో కేటగిరీ-1లో ఉన్న ఇంటి విద్యుత్ కనెక్షన్లు మొత్తం 1,26,693 ఉన్నాయి.
వీటిలో కేవలం 69,606 గృహ కనెక్షన్లకు మాత్రమే గృహజ్యోతి అమలవుతున్నది. మిగిలిన 57,087 కనెక్షన్లకు పైగా జీరో బిల్లులకు నోచుకోవడం లేదు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామసభల్లో అర్హత ఉన్న ప్రజలంతా జీరో బిల్లుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల్లో వివరాలు సరిగా రాయకపోవడం, వాటిని ఆన్లైన్లో నమో దు చేసే సందర్భంలో కొన్ని తప్పులుండడంతో అర్హత ఉన్న వారు సైతం ఈ పథకానికి దూరమయ్యారు. తప్పులు సవరించుకునేందుకు మున్సిపాలిటీతోపాటు మండల కార్యాలయాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి కొన్నింటిని సవరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం పకడ్బందీ గా కొనసాగకపోవడంతో వేలాది మంది నిరుపేదలు పథకాన్ని అందుకోలేకపోతున్నారు.
దరఖాస్తు చేసినప్పుడు నమోదైన వివరాల్లో చి న్నచిన్న తప్పులతోనే సమస్య వస్తున్నది. మీటరు సంఖ్య తప్పుగా నమోదు చేయడం, ఒకరి పేరున మీటరు, మరొకరి పేరున రేషన్‌కార్డు, మృతి చెంది న వారి పేరున మీటర్లు ఉండడం, వారికి సంబంధించిన ఆధార్‌కార్డు లేకపోవడం, ఉన్నా అనుసంధానం చేసుకోకపోవడం వంటి అనేక సమస్యలు ఉండడంతో జీరో బిల్లులు రావడం లేదని తెలుస్తున్నది. ఈ తప్పులను గుర్తించే మున్సిపాలిటీలు, మండల పరిషత్‌లో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి సరిచేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు గృహజ్యోతి పథకాన్ని అందుకోలేని నిరుపేదలంతా నిరక్షరాస్యులు, వృద్ధులు, మహిళలే అధికంగా ఉన్నారు.
గృహజ్యోతికి చేసుకున్న దరఖాస్తుల్లో అనేక త ప్పులుండడం వల్ల అర్హులు వేలాదిగా పథకానికి దూరమయ్యారు. వీటిపై ప్రత్యేక చొరవ తీసుకుం టే తప్పా వీరందరికీ పరిష్కారం దొరకడం కష్టం. దరఖాస్తులో మీటరు నెంబరు తప్పుగా నమోదై ఉంటే ఆధారాలతో దరఖాస్తు చేస్తే వెంటనే సవరిస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తుల్లో గృహజ్యోతి పథకం అవసరమని టిక్ కొట్టకపోతే ఆన్లైన్లో వారి దరఖాస్తు కనిపించడం లేదు. ఇలాంటి మరో రెండు మూడు సమస్యలు గృహజ్యోతికి దరఖాస్తు లు చేసుకున్న వాటిలో అనేకం ఉన్నాయి. ఇదిలా ఉంటే, మరికొన్ని దరఖాస్తులు అన్ని కరెక్ట్‌గా నమో దు చేసినా ఆన్లైన్లో కొత్త సమస్యలు వస్తున్నా యి. ఏమైనా జిల్లాలో ఇంతలా పెండింగ్‌లో ఉన్న గృహజ్యోతి కనెక్షన్లకు పరిష్కారం రావాలంటే ప్ర త్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం ఉన్నది. లేకుంటే వేలాది మంది అర్హత ఉన్నా.. రాయితీని అందుకోలేకపోవడం ఖాయమన్నట్లు కనిపిస్తున్నది.
ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నాం. చాలా మందికి జీరో బిల్లులు వస్తున్నాయి. రెండు నెలలుగా ఈ పథకం అమలు కోసం మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి అడుగుతున్నాను.. రసీదు చూయించినా మా ద రఖాస్తు ఆన్లైన్లో కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. చివరకు మొన్న మంత్రి జూపల్లి వచ్చినప్పుడు కూడా దరఖాస్తు ఇచ్చాను. ఇంకా ఎవరికి చెప్పాలో.. ఎవరిని అడగాలో అర్థం కావడం లేదు.
– వెంకటేశ్వర్‌రెడ్డి, వినియోగదారుడు, వీపనగండ్ల
గృహజ్యోతి పథకానికి అర్హత ఉన్న వా రందరికీ న్యాయం చేస్తాం. దరఖాస్తుల్లో త ప్పుగా నమోదు చేసుకున్న వారి సమస్యను పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటాం. ఆయా మున్సిపాలిటీలు, మండల పరిషత్ ల ద్వారా ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. పూర్తి సమాచారం తీసుకొని జిల్లాలో అర్హత ఉండి పథకాన్ని లబ్ధి పొందని దరఖాస్తుదారులపై ప్రత్యేక చొరవ తీసుకుంటాం. అవసరమైతే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి 200 యూనిట్లలోపు ఉన్న వారందరికీ న్యాయం జరిగేలా చూస్తాం.
– శ్రీనివాస్, డీఈ, విద్యుత్ శాఖ, వనపర్తి జిల్లా