వెల్దండ, ఫిబ్రవరి 7 : పేద విద్యార్థులకు చదువు చెప్పి వారి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో వారికి జీవితమే లేకుండా చేస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. శుక్రవారం మండలంలోని చొక్కన్నపల్లిలో బాలానగర్ గురుకుల పాఠశాలలో మృతిచెందిన విద్యార్థిని ఆరాధ్య కుటుంబాన్ని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఫుడ్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ గోళి శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, మాజీ జెడ్పీటీసీ విజితారెడ్డితో కలిసి ప్రవీణ్‌కుమార్ పరామర్శించారు. విద్యార్థిని మృతదేహంపై పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో గురుకులాలను మృత్యుకుహారాలుగా మార్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 56 మంది గురుకుల విద్యార్థులు మృతి చెందారని, విద్యాశాఖ మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న సీఎం విద్యార్థుల మృతికి నైతిక బాధ్యత వహి స్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో రాక్షసపాలన సాగుతుందని, ఆరాధ్య మృతి అనుమానంగా ఉందన్నారు. విచారణ చేపట్టి నిజనిజాలను తేల్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గురుకుల విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆరోపించారు. ఆరాధ్య కుటుంబానికి రూ.5కోట్లు పరిహారం, డబుల్ బెడ్రూం ఇల్లు, ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గోళి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆరాధ్య మృతి చెందడంలో కుట్ర దాగి ఉన్నదన్నారు. ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థిని తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డి మాండ్ చేశారు. అనంతరం విద్యార్థిని తల్లిందండ్రులను ఓదార్చి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ రూ. 51వేలు, జైపాల్‌యాదవ్ రూ.10వేల ఆర్థిక సా యం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎం పీపీ పుట్టారాంరెడ్డి, మాజీ జెడ్పీటీసీ రాములమ్మ, బీఆర్ఎస్ నాయకులు మధుసూదన్‌రెడ్డి, యాదగిరి, ఆనంద్, ప్రసాద్, శేఖర్, రమేశ్, రవి, జంగయ్య తదితరులు ఉన్నారు.
వెల్దండ, ఫిబ్రవరి 7 : ఈనెల 13వ తేదీన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆమనగల్లులో 15వేల మందితో రైతు దీక్ష చేపడుతున్నట్లు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ తెలిపారు. శుక్రవారం వెల్దండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఫుడ్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ గోళి శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్‌తో కలిసి మాట్లాడారు. నియోజకవర్గంలో 6మండలాల నుంచి రైతులు, అభిమానులు, కార్యకర్తలు రానున్నట్లు తెలిపారు. సమావేశంలో మాజీ ఎంపీపీ పుట్టారాంరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు చల్లా మధుసూదన్‌రెడ్డి, యాదగిరి, ఆనంద్, ప్రసాద్, శేఖర్, రమేశ్, రవి, శ్రీను, నర్సింహ, రాజు ఉన్నారు.