నాగర్‌కర్నూల్, జూలై 23 (నమస్తే తెలంగాణ): పేదల సంక్షేమంలో సమైక్య పాలనను మరపిస్తోంది సీఎం కేసీఆర్ ప్రభుత్వం. మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు పలు పథకాలను అమలుపరుస్తున్నది. ఈ పథకాలు ఆయావర్గాల్లోని పేదల్లో ఆర్థిక భరోసా నింపింది. దీంతో బీఆర్ఎస్ పేదల ప్రభుత్వంగా ప్రజల్లో ముద్రపడింది. ఈ సంక్షేమ పథకాల్లో ప్రధానమైంది ఆసరా పథకం. ఈ పథకం ద్వారా అన్నివర్గాల పేదలు, బాధితులకు ప్రతినెలా ఆర్థికంగా చేయూతను అందించేలా పింఛన్ అందిస్తోంది. ఈ పింఛన్‌తో ఆయా వర్గాల పేదప్రజలు కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా తమ వ్యక్తిగత అవసరాలను తీర్చుకొంటున్నారు. ఈ పథకం బీఆర్ఎస్ ప్రభుత్వానికి పెట్టని కోటగా నిలుస్తోంది.
ఈ పథకంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, బోధకాల వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ రోగులకు ప్రతినెలా పింఛన్ వస్తున్నది. ఈ పింఛన్ డబ్బులు మధ్యవర్తుల ద్వారా కాకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా ప్రతినెలా జమ అవుతున్నాయి. రాష్ట్రం ఏర్పడకముందు వృద్ధులు, వితంతులకు రూ.200ఉన్న పింఛన్‌ను రాష్ట్రం వచ్చాక రూ.1000కి, దివ్యాంగులకు రూ.500నుంచి రూ.1500వరకు పెంచింది. ఇక పెరిగిన ధరల ప్రకారం పేదలకోసం ఆర్థిక భారమైనా 2018 ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ పింఛన్లను పెంచేందుకు నిర్ణయించగా.. రెండోసారి అధికారంలోకి వచ్చాక 2019, ఏప్రిల్ 1నుంచి మరోసారి పింఛన్ల పెరుగుదల జరగడం గమనార్హం. దీని ప్రకారం వృద్ధులు, వితంతులకు రూ.1,500నుంచి రూ.2016కు, దివ్యాంగులకు రూ.2016నుంచి రూ.3,016కు పెంచగా ప్రస్తుతం ఈ మేరకు ఆయా వర్గాల పేదలకు పింఛన్లు అందుతున్నాయి.
ఇదిలా ఉంటే వృద్ధాప్య పింఛన్ వయస్సును 2020మార్చిలో 65ఏండ్ల నుంచి 57ఏండ్లకు తగ్గిస్తూ నిర్ణయించింది. అలాగే భర్త చనిపోతే భార్యకు పింఛన్ అందేలా 2023, జనవరి 10న ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దీనివల్ల పింఛన్‌దారుడైన భర్త పింఛన్ భార్యకు వర్తించనుంది. ఇలా ఆసరా పింఛన్‌దారులకు ఈ పథకం ఆర్థిక భరోసాను కల్పిస్తోంది. గ్రామాలు, పట్టణాల్లో ఉండే వృద్ధులు పింఛన్ డబ్బులను సొంతూళ్లలో పోస్టాఫీసుల్లోనే తీసుకుంటూ మందు గోళీలు, వ్యక్తిగత అవసరాలకు వాడుకొంటున్నారు. ఇలాంటి బృహత్తర పథకంలో భాగమైన దివ్యాంగులకు మరోసారి రూ.1000 పింఛన్ పెంచేందుకు సీఎం కేసీఆర్ జూన్ 9న మంచిర్యాలలో జరిగిన సభలో పెంచుతున్నట్లు ప్రకటించగా.. తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో దివ్యాంగులకు ఇకపై నెలకు రూ.4,016చొప్పున పింఛన్ అందనుంది.
ఈనెల నుంచే పెరిగిన పింఛన్లు దివ్యాంగులకు అమలు కానున్నాయి. మొత్తం మీద సమైక్య పాలనలో రూ.500ఉన్న దివ్యాంగుల పింఛన్ ఏకంగా రూ.4,016కు చేరడం విశేషం. దీంతో ఆయావర్గాల కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో మ్తొతం పింఛన్‌దారులు 1,12,835మంది ఉండగా ఇందులో 13,348మంది దివ్యాంగులు పెరిగిన పింఛన్‌తో లబ్ధిపొందనున్నారు. ఇప్పటి వరకు అన్ని పింఛన్లను కలిపితే ప్రతినెలా రూ.27కోట్లు జిల్లాకు ప్రభుత్వం మంజూరు చేస్తుండగా.. ఇందులో దివ్యాంగులకు రూ.4కోట్లు అందుతుండగా దీనివల్ల దివ్యాంగుల పింఛన్ రూ.కోటికిపైగా పెరిగి ఇప్పుడు రూ.5.35కోట్లకు చేరనుంది. మొత్తం మీద పెరిగిన పింఛన్‌తో ప్రభుత్వానికి భారమైనా సంక్షేమం దిశగా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ఆయా కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
జూలై నుంచి అమలు
సీఎం కేసీఆర్ ఆదేశాలతో దివ్యాంగుల పింఛన్ రూ.4,016కు పెంచడం జరిగింది. జూలై నుంచి పెరిగిన పింఛన్ అమలవుతుంది. ఇప్పటి వరకు జిల్లాలో 1.12లక్షల మందికి రూ.27కోట్ల మేర పింఛన్ అందుతుండగా.. 13,348మంది దివ్యాంగులు పెరిగిన పింఛన్‌తో లబ్ధిపొందనున్నారు.
– నర్సింగరావు, డీఆర్డీవో, నాగర్‌కర్నూల్