మహబూబ్‌నగర్, డిసెంబర్ 27 : నాయీబ్రాహ్మణుల జీవితాలకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సెలూన్లకు అందిస్తున్న ఉచిత విద్యుత్‌తో ఎంతో మేలు జరుగుతున్నది. పేదలను ఉన్నతస్థాయికి తీసుకొచ్చేందుకుగానూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే స్పందించి ప్రతి సమస్యకూ పరిష్కారం చూపిస్తూ పేదలను ఆర్థికంగా అభివృద్ధి చేసేలా ముందుకు సాగుతున్నది తెలంగాణ సర్కారు. సెలూన్ షాపుల నిర్వాహకులు అద్దెలతో పాటు కరెంట్ బిల్లులు సైతం కట్టలేక గతంలో నెట్టుకొస్తున్న పరిస్థితులు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సెలూన్లకు ఉచిత విద్యుత్‌ను అమలుచేయడంతో నాయిబ్రాహ్మణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా 1,361 సెలూన్లకు లబ్ధి
మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా 1361 సెలూన్లకు ఉచితవిద్యుత్ అమలవుతున్నది. ప్రభుత్వ నిబంధనల మేరకు షాపుల యజమానుల నుంచి అవసరమైన పత్రాలను సమర్పించి నాయీబ్రాహ్మణులు ఉచిత విద్యుత్‌ను పొందుతున్నారు. ప్రతి దుకాణానికి ఉచితంగా 250యూనిట్లను అందిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో నాయీబ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ సర్కారుకు అండగా ఉంటామని, సీఎం కేసీఆర్ రుణపడి ఉంటామని నాయీబ్రాహ్మణులు అంటున్నారు.
గత పాలకులు పట్టించుకోలేదు
నాయీబ్రహ్మణుల జీవితాల్లో వెలుగులు నింపేందుకుగానూ తెలంగాణ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకున్నది. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు నాయీబ్రాహ్మణులకు ఎలాంటి సహకారం అందించలేదని నాయీబ్రాహ్మణులు బాహాటంగా అంటున్నారు. బీఆర్ఎస్ సర్కారు సెలూన్లకు ఉచిత విద్యుత్ అదించడంతో ఎంతో మేలు జరుగుతున్నదని నాయీబ్రాహ్మణులు పేర్కొన్నారు.
ఉచిత విద్యుత్ హర్షణీయం
సాదాసీదాగా జీవనం సాగిస్తున్న మాలాంటి వారికి ప్రభుత్వం సెలూన్లకు ఉచిత విద్యుత్‌ను అందించడం సంతోషంగా ఉంది. 250యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడంతో ఆర్థికంగా తోడ్పాడు అందుతున్నది. ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో ఉచిత విద్యుత్‌ను పొందుతున్నాం. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– రామకృష్ణ, నాయీబ్రాహ్మణుడు, మహబూబ్‌నగర్