కల్వకుర్తి, ఏప్రిల్ 10 : వేరుశనగ రైతుకు గడ్డుకాలం దాపుదించింది. నెల రోజుల వ్యవధిలో సగానికి సగం ధర తగ్గిపోయింది. గత నెల రోజుల కిందట రూ.13వేల ధర పలికిన వేరుశనగ ప్రస్తుతం నేల చూపులు చూస్తుంది. గరిష్ఠంగా రూ.7,500 దాటడం గగనమైంది. సరాసరిన కేవలం రూ.6వేలలోపే ధర పలుకుతుండటంతో వేరుశనగ రైతుల కన్నీరు పెట్టుకున్న పరిస్థితి నెలకొంది. పంట మొత్తం అమ్మినా.. పెట్టుబడి రాని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని చేసిన కష్టం వృథాగా మారిందని, బతకడానికి, తిరిగి వ్యవసాయం చేయడానికి అప్పులు చేయాల్సిన దుస్థితి వచ్చిందని అన్నదాతలు వాపోతున్నారు.
వేరుశనగ సాగు చేయడానికి చేసిన చేసిన అప్పు తామే పండించిన పంట అమ్మినా తీరదని, ఇప్పుడు కొత్తగా అప్పు చేయక తప్పని పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో దాదాపు లక్షకు పైగా ఎకరాల్లో వేరుశనగను సాగుచేశారు. వానకాలం వర్షాలు విస్తారంగా కురియడం, వరిసాగు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే చెప్పడంతో రైతులు వేరుశనగ సాగుపై దృష్టి సారించారు. వేరుశనగ విత్తనాల కొనుగోలు నుంచి వేరుశనగ పంట పూర్తి అయ్యే వరకు రైతులు పడరాని పాట్లు పడ్డారు. ఎకరా వేరుశనగ సాగుకు దాదాపు రూ.20నుంచి రూ.30వేల ఖర్చు వచ్చింది.
వాతావరణ పరిస్థితుల మధ్య దిగుబడి మాత్రం సరాసరిన 4 క్వింటాళ్ల నుంచి 7 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. దిగుబడి కాస్తంతా తక్కువగా వచ్చినా ధర మాత్రం రూ.12,13వేల మధ్య ఉండడంతో తమ కష్టాలు గట్టేక్కాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. పాపం రైతుల ఆనందం చాలా రోజులు నిలువలేదు. క్రమక్రమంగా ధర తగ్గుతుండడంతో రైతులు ఆశలన్నీ ఆవిరయ్యాయి. సరాసరి ధర రూ.6వేలకు పడిపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు.
కదిరి జీజేజీ 32 వేరుశనగ విత్తనాలు విత్తుకున్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కదిరి విత్తనాలు సాగుచేసిన రైతులు పంటను అమ్మబోతే అడివిగా మారింది. క్వింటాల్ రూ.4వేలు కూడా ధర రావడం లేదు. కదిరి విత్తనాల విషయానికి వస్తే.. నేషనల్ మిషన్ ఈడేబుల్ ఆయిల్(ఎన్ఎంఈవో) పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా 90 కిలోల వరకు వేరుశనగకు రాయితీపై ఇచ్చింది. ఈ విత్తనాలను ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్(ఎఫ్‌పీవో)ల ద్వారా రైతులకు సరఫరా చేశారు. ఎఫ్‌పీవోలను స్వయం సమృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వేరుశనగ విత్తనాలను రైతులకు పూర్తి రాయితీతో పంపిణీ చేయించింది.
కదిరి వేరుశనగ విత్తనాలు సాగు చేసిన రైతుల పంటలను ఎఫ్‌పీవోలు కొనుగోలు చేస్తాయని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇంత వరకు బాగానే ఉంది. అసలు కథ ఇప్పుడు మొదలైంది. కదిరి సాగుచేసిన రైతులు తమ పంటను బహిరంగ మార్కెట్లో విక్రయించబోతే చుక్కలు కనిపిస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో కదిరి వేరుశనగను అడిగే నాథుడే లేడు. ఎఫ్‌పీవోలు కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నాయి. ఇంతకు కదిరి పంటను ఎవరు కొనాలన్నదే ప్రశ్న. అసలే వేరుశనగకు ధరలేక ఇబ్బందులు పడుతున్న రైతులకు కదిరి వేరుశనగ మరింత భారంగా మారింది.
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరకు మార్క్‌ఫెడ్ కొనుగోలు చేయాల్సి ఉంది. మార్క్‌ఫెడ్ కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు వేయాల్సి ఉంటుం ది. కేంద్రం, రాష్ట్రం సంయుక్త ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను తెరవాల్సి ఉంటుంది. వేరుశనగ సీజన్ పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల ఊసేలేదు. దీంతో గిట్టుబాటు ధర పొందాలనుకున్న రైతులు గత్యంతరం లేని పరిస్థితిలో వ్యాపారులకు ఏదో ఒక ధరకు తాము పండించిన పంటను అమ్ముకుంటున్నారు.
నాలుగు ఎకరాల్లో వేరుశనగ సాగుచేశారు. దిగుబడి దాదాపు 30 క్వింటాళ్ల వరకు వచ్చింది. తాను పండించిన వేరుశనగకు విక్రయించేందుకు కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్‌కు తీసుకువచ్చాను. ధర చూస్తే కళ్లు తిరిగాయి. నెల కింద ట దాదాపు రూ.13వేల వరకు గరిష్ఠ ధర పలికిన వేరుశనగ ఇప్పుడు రూ.7వేలకు వరకు గరి ష్ఠ ధర పలుకుతుంది. రూ.5,500 నుంచి రూ.6,500 మధ్య కొనుగోలు చేస్తేన్నారు. నాకు పెట్టుబడి ఖర్చు దాదాపు రూ.1.50లక్ష వరకు వచ్చింది. పంట అమ్మిన డబ్బులు పెట్టుబడికి బొటాటోటీగా సరిపోయాయి. చేసిన కష్టం వృథాగా మారింది.
– ప్రవీణ్‌గౌడ్, రైతు, చల్లంపల్లి, తలకొండపల్లి మండలం
మూడు ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాను. 24 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దిగుబడి పర్వాలేకున్నా.. ధర మాత్రం ఘోరంగా ఉన్న ది. వ్యాపారుల మాయాజాలంలో వేరుశనగ ధరలు నేల చూపులు చూస్తున్నాయి. నెల రో జుల కిందట వరకు రూ.13వేల వరకు ఉన్న వేరుశనగ ఇప్పుడు రూ.7వేల వరకు దిగిపోవడమేమిటీ? కనీసం రూ.9 వేలకు కొనుగోలు చేస్తే చేసిన కష్టం మిగులుతుంది. ఏదో విధంగా రాష్ట్ర ప్రభుత్వం వేరుశనగ రైతులను ఆదుకోవాలి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు నష్ట పోకుండా పంటను కొనుగోలు చేయాలి.
– జంగయ్య, రైతు, సిరుసనగండ్ల, చారకొండ మండలం
మూడెకరాల్లో వేరుశనగ సాగు చేశారు. దిగుబడి పర్వాలేదు. ధర మాత్రం ఘోరంగా ఉంది. పంటను విక్రయిస్తే వచ్చే డబ్బుల అప్పులకు సరిపోవు. ధర నడిపోయిన నేపథ్యంలో ఏ ప్రజాప్రతినిధి, ఏ నాయకుడు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఎందుకిలా జరిగింది అని అడిగే వారు లేరు. కేసీఆర్ సార్ ప్రభుత్వం పోయిన తర్వాత రైతుల గురించి పట్టించుకునే నాథుడే లేడు. వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులదే హవా.. వారు పెట్టిందే ధర. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నాం. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.
– చంద్రయ్య, రైతు, చెదురుపల్లి, వెల్దండ