ఉలన్బాతర్ (మంగోలియా): ఏషియన్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత పతకాల జోరు శుక్రవారం కూడా కొనసాగింది. గురువారం నలుగురు మహిళా బాక్సర్లు పసిడి పతకాలతో మోత మోగించగా పురుషుల 50 కిలోల విభాగంలో విశ్వనాథ్ సురేశ్ కూడా స్వర్ణంతో మెరిశాడు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఫైనల్లో ఈ యువ బాక్సర్.. 5-0తో దియాచి ఇవాయ్ (జపాన్)ను మట్టికరిపించి బంగారు పతకాన్ని ముద్దాడాడు.
జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న విశ్వనాథ్.. అంతర్జాతీయ స్థాయిలోనూ దానిని కొనసాగిస్తూ స్వర్ణంతో సత్తా చాటాడు. 60 కేజీల విభాగం ఫైనల్లో సచిన్ సివాచ్.. 2-3తో ఒరజ్బెక్ (కజకిస్థాన్) చేతిలో ఓడి రజతంతో సంతృప్తిపడ్డాడు. కాంస్య పోరుకు అర్హత సాధించినవారిలో హర్ష్ చౌదరి (90 కి.), ఆకాశ్ (75 కి.), లోకేశ్ (85 కి.), నరేందర్ (+90 కి.) కంచు మోత మోగించారు. దీంతో ఈ టోర్నీలో భారత్ మొత్తం 16 పతకాలు (5 స్వర్ణాలు, 3 రజతాలు, 8 కాంస్యాలు) సాధించి పాయింట్ల పట్టికలో కజకిస్థాన్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది.