శనివారం 16 జనవరి 2021
Mahabubnagar - Oct 25, 2020 , 00:54:38

దసరా వచ్చిందయ్యా...

దసరా వచ్చిందయ్యా...

  •  నేడు విజయ దశమి పర్వదినం 
  • చరిత్ర, సంప్రదాయం, విజ్ఞానం కలగలిసిన పండుగ
  • చెడుపై మంచి గెలిచిన రోజు ఏ పని చేపట్టేందుకైనా శుభకరమైన దినం
  • పాలపిట్ట దర్శనం సకల పాప నాశనం 
  • శమీ పత్రం  విజయమంత్రం
  • పండుగ నిర్వహణకు సిద్ధమైన ఉమ్మడి జిల్లా ప్రజానీకం

చరిత్ర, సంప్రదాయం, విజ్ఞానం కలగలిపిన దసరా పండుగ రానే వచ్చింది.చెడుపై మంచి సాధించే విజయానికి  ప్రతీకగా ఏటా నిర్వహించే విజయ దశమి వేడుకలను ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో  జరుపుకోవడానికి సమాయత్తం  అయ్యారు. ఏడాదిపాటు వచ్చే పండుగల్లో  అతిపెద్ద దసరాను వైభవోపేతంగా  జరుపుకొంటారు. పేద, ధనిక తేడా  లేకుండా హిందు వులందరూ  సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు.  సమైక్యతను చాటుకోవడం ఈ  పండుగ ప్రత్యేకత.

- వనపర్తి/మహబూబ్‌నగర్‌


వనపర్తి/మహబూబ్‌నగర్‌ : విజయాల పండుగ దసరా వచ్చేసింది. విజయదశమిని సొంతూళ్లలో జరుపుకొనేందుకు అందరూ పల్లెతల్లి ఒడికి చేరారు. పాలపిట్ట దర్శనం, శమీ పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దేవీ మండపాల వద్ద ఆదివారం నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి. 

పండుగ వెనుక ఆంతర్యాలు..

ప్రతి పండుగ వెనుక అనేక పురాణగాథలు, కథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు తనకు ఉన్న వరంతో దేవతలపై యుద్ధం చేసి విజయం సాధిస్తాడు. స్వర్గంలో ఇంద్రుడిని సింహాసనం నుంచి తొలగించి ఆక్రమిస్తాడు. అహంకారంతో దేవతలను చిత్రహింసలకు గురిచేస్తూ ముల్లోకాలను గడగడలాడిస్తాడు. ఈ క్రమంలో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు మహిషాసురిడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. వరం కారణంగా ముగ్గురిలో ఏ ఒక్కరు కూడా మహిషాసురుడిని వధించే విల్లు ఉండకపోవడంతో త్రిమూర్తులు ఓ శక్తిని సృష్టిస్తారు. ఆ శక్తిని శివుడి ముఖము, శ్రీమహావిష్ణువు భుజాలు, చేతులను, బ్రహ్మశక్తితో శక్తిరూపం ఏర్పడుతుంది. ఆ శక్తి రూపమే దుర్గామాత. శివుడి శూలం, శ్రీమహావిష్ణు చక్రం, ఇంద్రుడి వజ్రాయుధం వరుణదేవుడి పాశం వంటి ఆయుధాలను కలిగి తొమ్మిది రోజులపాటు మహిషాసురుడితో పోరాడి సంహరిస్త్తుంది. ఆ విజయానికి సూచికగానే తొమ్మిది రోజుల పాటు నవరాత్రి వేడుకలు, దశమి రోజున విజయదశమి వేడుకలు జరుపుకొంటారని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడు రావణున్ని వధించిన రోజు కూడా దశమేనని ఆ విజాయనికి సూచికగానే విజయదశమి రోజున రావణ సంహారం చేస్తారని రామాయణం చెబుతుంది. పాండువులు 

అరణ్యవాసానికి వెళ్లే సమయంలో తమ ఆయుధాలను మూటగా కట్టి జమ్మి చెట్టుపై ఉంచి తాము వచ్చే వరకు ఆయుధాలను జాగ్రత్తగా కపాడాలని జమ్మిచెట్టును వేడుకొని అరణ్యవాసానికి వెళ్తారు. ఆశ్వయుజ మాసంలో పాండవులు తిరిగి వచ్చి జమ్మి చెట్టుకు పూజలు చేసి తాము ఉంచిన ఆయుధాలను తీసుకెళ్తూ చెట్టుపై ఉన్న పాలపిట్టను చూస్తారు. వారు వెళ్లి కౌరవులతో విజయం సాధించిన రోజు కూడా దశమి రోజేనని మహాభారతం చెబుతుంది. ఈ మూడు సంఘటనల నేపథ్యం వేరే అయినప్పటికీ చెడుపై మంచి విజయం సాధించడం శుభసూచికం కావడంతో ఈ మూడు అంశాల మేళవింపుతో విజయదశమి వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీ. 

మంచి కోసమే పూజలు..

నవరాత్రి వేడుకల మొదటిరోజు నుంచి విజయదశమి వరకు దుర్గామాతను కొలవడం వల్ల అన్ని శుభాలే జరుగుతాయని ప్రజల విశ్వాసం. సిరి సంపదలు, ఆయురారోగ్యాలు, విద్య తదితర అంశాలు తమకు కలిసిరావాలనే భావనతో ప్రజలు అమ్మవారికి నియమనిష్టలతో పూజలు చేస్తారు. తాము చేపట్టే పనుల్లో విజయాలు కలగాలని భావిస్తూ వారివారి విధులకు సంబంధించిన ఆయుధాలు, సామగ్రిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఇలా పూజించడం వల్ల తాము చేపట్టబోయే పనులు విజయవంతం కావాలని అమ్మవారిని వేడుకుంటారు.

ఆత్మీయత పెంచే జమ్మిచెట్టు

పాండవులు యుద్ధంలో గెలవడానికి జమ్మిచెట్టే కారణమ ని జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. దీంతో ప్రజలంద రూ ఆ చెట్టుకు పూజలు చేస్తే తమకు అన్నివిధాలుగా విజయాలు చేకూరుతాయని భావిస్తున్నారు. ఏటా విజయదశమి రోజున ప్రజలు భక్తిశ్రద్ధలతో జమ్మిచెట్టుకు పూజలు చేసి ఆకులను తెచ్చి ఒకరికొకరు పంచుకుని ఆలింగనం చేసుకుంటారు. బంగారంగా పిలువబడే ఈ జమ్మి ఆకులను పెద్దలకు అందజేసి వారి ఆశీర్వదాలను తీసుకుంటారు. ఇదే రోజున పాలపిట్టను చూడటం ద్వారా కూడా శుభాలు కలుగుతాయ ని భావించి ఆ పక్షిని చూసేందుకు ఆసక్తి చూపుతారు. దసరా సందర్భంగా మార్కెట్లు కళకళలాడుతున్నాయి. అమ్మవారి ఆలయాల్లో, ఇండ్లల్లో ఆయుధ పూజ చేస్తారు. వాహనాలను శుభ్రం చేసుకుని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.