ఊట్కూర్ : ఉపాధి కూలీలకు ఏడాదిలో 200 పని దినాలు( Work Days ) కల్పించి, రోజుకు రూ. 600 కూలి చెల్లించాలని సీఐటీయూ ( CITU) జిల్లా అధ్యక్షుడు వెంకట్రామారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పగిడిమర్రి గ్రామాన్ని సందర్శించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ( National Rural Employment Guarantee ) కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
జాతీయ కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల20న నిర్వహించే జాతీయ సమ్మె, గ్రామీణ హర్తాల్ కార్యక్రమంలో ఉపాధి కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక , రైతు వ్యతిరేక విధానాలను, కూలి వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నందని దుయ్యబట్టారు.
మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల నిత్యవసర సరుకుల ధరలు వంద శాతం నుంచి 200 శాతానికి పెరిగాయని ఆరోపించారు.కేంద్రం ఉపాధిని తగ్గించే విధానాలు అనుసరిస్తూ పని గంటలు పెంచి కార్మికులకు భారంగా, కార్పొరేట్లకు లాభంగా విధానాలను కొనసాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపాధి కూలీలు నారాయణ, అశోక్, కార్మిక సంఘం నాయకుడు పవన్ పాల్గొన్నారు.