మహబూబ్‌నగర్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నామినేషన్ల పర్వం కొనసాగుతున్నది. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఆయా నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.
మంగళవారం 5వరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా 19 నామినేషన్లు దాఖలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులంతా పోటాపోటీగా ఆయా నియోజకవర్గాల్లో నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. ఇంకా నామినేషన్లకు మూడు రోజులు గడువు మాత్రమే ఉంది. అధికార పార్టీకి చెందిన అభ్యర్థులంతా ఈనెల 9వ తేదీన నామినేషన్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.. మిగతా పార్టీ అభ్యర్థులు కూడా దాదాపుగా అదే రోజు నామినేషన్ వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అధికారులు ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు.
జడ్చర్ల నియోజకవర్గంలో బహుజన ముక్తి పార్టీ నుంచి ఇమ్మడి ఆనంద్, బీజేపీ నుంచి చిత్తరంజన్‌దాస్, ఆర్.సీపీఐ నుంచి వెల్జాల్ బసవయ్య, శంకర్ నాయక్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. కొల్లాపూర్‌లో రామస్వామి, నీలం కృష్ణయ్య, తలారి బాలవర్ధన్ స్వతంత్ర అభ్యర్థులుగా, ఆది సంధ్యారాణి ధర్మ సమాజ్ పార్టీ తరఫున నామినేషన్ వేశారు.
గద్వాల నియోజకవర్గంలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున సుబ్బారా వు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన గొంగళ్ల రంజిత్ కుమార్ నామినేషన్ వేశారు.
దేవరకద్రలో స్వతంత్ర అభ్యర్థిగా రాము, ధర్మ సమాజ్ పార్టీ నుంచి జంగయ్య, కల్వకుర్తిలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి జటావత్ రామ్ చంద్రు నాయక్, సోషలిస్టు యూనీటి సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ నుంచి పాలాది కిరణ్‌కుమార్, అలంపూర్ లో స్వతంత్ర అభ్యర్థిగా మేరమ్మ, బీజేపీ తరఫున మాదన్న, మక్తల్‌లో బీఎస్పీ నుంచి మ్యాదరి దశరథ్, మహబూబ్ నగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా మున్నూరు రవి, వనపర్తి లో ధర్మ సమాజ్ పార్టీ తరఫున బంకల ఏలయ్య నామినేషన్లు దాఖలు చేశారు.