వనపర్తి, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : ఏడేళ్లు విజయవంతంగా నడిచిన రైతు బీమా పథకాన్ని కాంగ్రెస్ సర్కారు ప్రశ్నార్థకంలో పడవేస్తుంది. గతేడాది ఆగస్టులో చెల్లించాల్సిన రైతు బీమా ప్రీమియం డబ్బులు చెల్లించకపోవడంతో బీమాకు తూట్లు పడుతున్నాయి. ఇంటి పెద్ద ప్రమాదంలో కానీ, సహజంగా కానీ చనిపోయినా.. గుంట భూమి ఉండి ఉంటే రైతులు ఎవరైనా సరే ఆ కుటుంబానికి బాసటగా ఉండాలని గత కేసీఆర్ ప్రభుత్వం రైతు బీ మా పథకాన్ని ప్రవేశపెట్టి విజయవంతంగా నడిపించిన సంగతి తెలిసిందే.
రైతు కుటుంబాలకు బాసటగా నిలవాలని గత బీఆర్ఎస్ ప్ర భుత్వం ప్రవేశపెట్టిన రై తు బీమా పథ కం ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. అకస్మాత్తుగా ప్రమాదాల్లో మృతిచెందిన బాధిత కుటుంబాలకు ఒక్కపైసా ఖర్చు లేకుండా వారి అకౌంట్లలో రూ.5లక్షల బీమా సొమ్ము వారంరోజుల్లోపు జమచేసేలా గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇ లా ఏడేళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు అండగా గత సర్కారు నిలిచింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా రైతు బీమాకు 1,17,023మంది రైతులు బీమా పరిధిలో ఉన్నారు. ప్రతి ఏటా అర్హత గల రైతుల సంఖ్య మారుతూ వస్తుంది. 18ఏండ్ల వయసు నుంచి 59 ఏండ్లలో ఉన్న రైతులకు ఈ పథకం వర్తించేలా నిబంధనలున్నాయి.
జిల్లాలో 185మంది రైతు బాధిత కుటుంబాలు బీమా సొమ్ము కోసం ఎదురు చూస్తున్నాయి. గత ఆరునెలలుగా చనిపోయిన రైతు కుటుంబాలకు డబ్బులు రాకపోవడంతో లబోదిబోమంటున్నారు. గతంలో రైతు మృతిచెందిన పక్షం రోజులు తిరగకముందే వారి ఖాతాలో రూ.5లక్షలు జమఅయ్యేవి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రైతు మృతిచెందినా బీమా సొమ్ము అందకపోవడంతో బాధిత రైతు కుటుంబాల పరిస్థితి సంకటంలో పడింది. యజమాని చనిపోయినా బాధిత కుటుంబానికి ఆర్థిక భరోసాను కల్పించాలనే లక్ష్యంతో పెట్టిన ఈ పథకం గతంలో రైతుల నుంచి ప్రశంసలు పొందింది. కానీ ఇటీవల రైతుల ప్రమాదాలు, సహజంగా మృతిచెందుతుంటే బీమా సొమ్ము నిలిచిపోవడంతో ఆయా కుటుంబాలన్ని ఇరకాటంలో పడ్డా యి. అయితే, ప్రస్తుతం జిల్లాలో పెండింగ్లో ఉన్న బాధిత కుటుంబాలకు దాదాపు రూ.9కోట్ల 25 లక్షల వరకు పరిహారం అందాల్సి ఉంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు రైతు బీమా పథకం య థేచ్ఛగా నడిచింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా రైతుల పథకాలను మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం నిలుపు చేయలేదు. కరో నా లాంటి కఠోర పరిస్థితులు ఎదురైనా రైతుల పథకాలను నిరాడంబరంగా నాటి సీఎం కేసీఆర్ కొనసాగించారు. 2018 లో ప్రారంభమైన ఈ పథకం 2024-2025 బీఆర్ఎస్ ప్రభు త్వం ఆధీనంలో ఉన్నంత వరకు జిల్లా వ్యాప్తంగా 4,728 మంది రైతులు ఏడేళ్ల కాలంలో వివిధ ఘటనల్లో మరణించగా, ఇందుకు రూ.236కోట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లి ంచింది. రైతులకు ఇంతలా భరోసానిచ్చిన పథకంలో లుకలుకలు మొదలవడంతో రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు.
2025-26కు సంబంధించి రైతు బీమాకు రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఐసీ సంస్థకు చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించకపోవడంతో పథకం తాత్కాలికంగా నిలిచిపోయింది. గత ప్రభుత్వంలో ఏకకాలంలోనే ఈ ప్రీమియాన్ని చెల్లించి ఆటంకాలు లేకుండా నడిపించారు. ప్రస్తుత ప్రభుత్వంలో రెండు దఫాలుగా ప్రీమియం చెల్లించడం..అదీ కూడా సమయానికి చెల్లించనందునే ఇలా బాధితులకు పరిహారం ఇవ్వకుండా ఎల్ఐసీ సంస్థ పెండింగ్లో పెట్టిందని సమాచారం. ప్రీమియం డబ్బులు చెల్లిస్తే తప్పా ైక్లెయిమ్లు చెల్లించలేమని చెప్పడంతో రైతు కుటుంబాలు సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.
మూడునెలల కిందట మా అమ్మ లక్ష్మి అనారో గ్యంతో చనిపోయింది. అమ్మ పేరుతో ముక్కాల ఎకరా పొలం ఉన్నది. రైతు బీమా కోసం అన్ని సర్టిఫికెట్లు అప్పట్లోనే అందించాం. ఇప్పటికీ రాలేదు. అప్పులున్నాయి..వస్తే కట్టుకుందామని ఎదురు చూస్తున్నాం. ఎంతకు రావడం లేదు. కార్యాల యంలో అడిగినప్పుడల్లా ప్రాసెసింగ్లో ఉంది వస్తుంది అని చెబు తున్నారు. ఐదు సార్లు ఆఫీసు చుట్ట్టూ తిరిగినా పని మాత్రం కాలేదు.
– డీ. రాకేశ్, రైతుబీమా బాధితుడు, దంతనూరు, మదనాపురం మండలం
నా భర్త వెంకటయ్య గత మే 10వ తేదీన అనారోగ్యంతో మృతిచెందాడు. గుంట భూమి ఉన్న రైతులైనా బీమా వస్తదన్నారు. నా భర్త పేరుతో ఎకరన్నర పొలం ఉండింది. అన్ని పేపర్లు వ్యవసాయ కార్యాలయంలో ఇచ్చినం. వారం, పది రోజుల్లోనే బీమా సొమ్ము వ స్తుందన్నారు. కానీ, ఇంతవరకు రాలేదు. ఇంటి పెద్ద చనిపో యినప్పుడు కల్లోలంలో పడకుండా ఉండేందుకు ఈ సొమ్ము సహాయ పడుతుంది. అర్థిక ఇబ్బందులున్నాయి.. సర్కారు బాధితులకు ఆస రాగా నిలబడాలి. స్కీం వస్తుందని చెబితే ఆశతో దరఖాస్తు చేసుకున్నం.
– మిద్దె పార్వతమ్మ, రైతు బీమా బాధితురాలు, గోవర్ధనగిరి, వీపనగండ్ల మండలం, వనపర్తి జిల్లా
ప్రస్తుతం రైతు బీమా పథకానికి సంబంధించి ఎలాంటి సమా చారం రాలేదు. తమ పరిధిలో ఉన్న పనులను పెండింగ్ లేకుండా చూస్తున్నాం. వచ్చిన ైక్లెయిమ్లను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు పంపిస్తున్నాం. జిల్లాలో పెండింగ్లో ఉన్న బీమా బాధితులకు ప్రభుత్వం నుంచి పరిహారం రాగానే క్లియర్ అవుతుంది.
– ఆంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి, వనపర్తి