మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 24 : ప్రభు త్వ దవాఖానల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులు, పే షెంట్ కేర్, సెక్యూరిటీ వేతనాలు పెరిగా యి. ఇకపై వారంతా నెలకు రూ.15,600 చొప్పున అందుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆదేశిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆదేశాలను పెడచెవిన పెట్టే ఏజెన్సీలు/కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పీఎఫ్, ఈఎస్ఐ నిబంధనలను కూడా అమలుచేయాలని సూచించింది. గతంతో పోల్చితే ఇది సుమారు 50 శాతం ఎక్కువ. ఈ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నారు. ఈ మేరకు డీఎంఈ రమేశ్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.
దవాఖానల్లో పారిశుధ్యాన్ని మెరుగుపర్చేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్‌ను ఈ ఏడాది మార్చిలో ప్రకటించింది. తమ వేతనాలు పెంచిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పారిశుధ్య కార్మికులకు రూ.10,700 వేతనం చెల్లించేవారు. ఇందులో పీఎఫ్, ఈఎన్ఐ పోనూ రూ.8,400 చేతికి అందేది. ప్రభుత్వం నిర్వహణ చార్జీలు 50 శాతం వరకు పెంచిన నేపథ్యంలో వారి వేతనాలు రూ.15,600కు చేరింది. మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో పాత టెండర్ ప్రకారం 120 మంది ఉండగా.. కొత్త టెండర్ ప్రకారం 204 మంది ఉన్నారు. నారాయణపేట జిల్లా దవాఖానలో 45, వనపర్తి జిల్లాలో 45 మంది ఉండగా.., కొత్త టెండర్ ప్రకారం 160 మంది ఉన్నారు. నాగర్‌కర్నూల్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో 45 మంది ఉండగా.. కొత్త టెండర్ ప్రకారం 161, గద్వాల జిల్లా దవాఖానలో 43, అలంపూర్‌లో 13, రేవల్లిలో 13, జడ్చర్లలో 13, బాలానగర్‌లో 13, ఖిల్లాఘణపురంలో 13, ఆత్మకూరులో 13, కోస్గిలో 30, మద్దూర్‌లో 13, మక్తల్‌లో 13 మంది ఉన్నారు. ఇలా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 650 మంది కార్మికులు జీవో నెంబర్ 60 ప్రకారం లబ్ధి పొందనున్నారు.