అయిజ, జూలై 9 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా, తుంగభద్ర నదులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. నదులకు వరద ప్రవా హం కొనసాగుతుండటంతో జిల్లాలోని జూరాల ప్రాజెక్టుతోపాటు సుంకేసుల బరాజ్, కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు, ఆర్డీఎస్ ఆనకట్టలు జలకళను సంతరించుకున్నాయి. బుధవారం జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,22,000 క్యూసెక్కులు ఉండగా, 14 గేట్లు ఎత్తి దిగువకు 94,878 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తికి 28,658 క్యూసెక్కులు, భీమా లిప్టు – 1కు 1300, కోయిల్‌సాగర్‌కు 315, జూరాల ఎడమ కాల్వకు 770, కుడికాల్వకు 400, ఆర్డీఎస్ లింక్ కాల్వ కు 150 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు ద్వారా మొత్తం అవుట్ ఫ్లో 1,26, 365 నమోదైంది.
జూరాల పూర్తిస్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.933 టీఎంసీల నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతుండడంతో 13 క్రస్ట్ గేట్లు 2.5 అడుగుల మేరకు ఎత్తి దిగువకు 36,699 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. టీబీ డ్యాం ఇన్‌ఫ్లో 46,270 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 44,672 క్యూసెక్కులు నమోదైంది. 105.788 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 75.770 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, 1633 అడుగుల నీటి మట్టానికి గానూ 1624.78 అడుగులు ఉన్నట్లు టీబీ డ్యాం సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు.
టీబీ డ్యాం గేట్లు ఎత్తి వరదను దిగువకు విడుదల చేయడంతో ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో 53,270 క్యూసెక్కులు నమోదుకాగా ప్రధాన కాల్వకు 595 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న సుంకేసుల బరాజ్‌కు 52,675 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో ప్ర స్తుతం 11.2 అడుగుల మేర నీటి నిల్వ ఉన్నది. ఆర్డీఎస్ ఆనకట్ట నుం చి సుంకేసుల బరాజ్ మీదుగా శ్రీశైలం ప్రాజెక్టు వైపు తుంగభద్ర పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్నది.
మక్తల్, జూలై 23 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో భారీ వర్షా లు కురుస్తుండడంతో భీమా నదికి భారీ స్థా యిలో వరద వచ్చి చే రుతున్నది. బుధవా రం కృష్ణ మండలం తంగిడి వద్ద ఒక వైపు భీమా మరో వైపు కృష్ణ మ్మ పరవళ్లు తొక్కు తూ కనిపించింది. కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి జిల్లా సైదాపూర్ తాలూకా పరిధిలో భీమా నదిపై నిర్మించిన జోల దగిడి -గూడూరు బ్యారేజీకి భారీ స్థాయిలో ఇన్ ఫ్లో 1,21980 క్యూసెక్కులు రావడంతో అంతే మొత్తం అవుట్ ఫ్లో నమోదైంది. కృష్ణా, భీమా నదులకు వరద ప్రవాహం పెరుగుతుండడంతో నది తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.