Ind – PAK : టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కోసం కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు. కొలంబోలో ఫిబ్రవరి 15న జరిగే ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ ఆదివారం అభిమానులకు అసలైన క్రికెట్ మజా ఇవ్వనుంది. అసాధ్యమనుకున్న దాయాదుల మ్యాచ్ సాధ్యపడడంలో శ్రీలంక క్రికెట్ పాత్ర ఉంది. చిరకాల ప్రత్యర్థులుగా పేరొందిన ఇరుజట్లు ఒకప్పుడు ఒక్కటిగా ఆడిన విషయం చాలామందికి తెలియదు. అది కూడా వరల్డ్‌కప్ ముందరే కావడం విశేషం. సరిగ్గా 30 ఏళ్ల క్రితం భారత్, పాకిస్థాన్ బోర్డులు శ్రీలంకను ఆదుకున్నాయి. 1996 వరల్డ్‌కప్ పోటీలకు సంయుక్తంగా ఆతిథ్యమివ్వడంతో పాక్, భారత ప్రభుత్వాలు చూపిన చొరవను లంకేయులు ఎప్పటికీ మర్చిపోలేరు.
ఫిబ్రవరి 15న భారత్, పాకిస్థాన్ జరుగకుంటే ఐసీసీకి, శ్రీలంక బోర్డుకు వేల కోట్ల రూపయాల్లో నష్టం వాటిల్లేది. కానీ, షరతుల భయం, శ్రీలంక బోర్డు విజ్ఞప్తి, ఐసీసీ ప్రతినిధితో బంగ్లాదేశ్ బోర్డు చీఫ్తోచర్చల ద్వారా చివరకు పాక్ తలొగ్గి.. ఆడేందుకు అంగీకరించింది. దాంతో, ఆర్ధిక నష్టం తప్పించినందుకు శ్రీలంక ప్రభుత్వం పాక్‌ను ధన్యవాదాలు చెప్పింది. భారత్, పాక్‌లు ఆ దేశ క్రికెట్‌ను ఆదుకోవడం ఇదే మొదటిసారి కాదు. 1996 వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు కూడా భారత్, పాకిస్థాన్ ప్రభుత్వాలు లంకకు ఆపన్నహస్తం అందించాయి.
అజారుద్దీన్, సయూద్ అన్వర్, వసీం అక్రమ్
భారత్, పాక్‌తో పాటు ప్రపంచకప్ ఆతిథ్య హక్కులు దక్కించుకున్న శ్రీలంకలో జనవరి 31వ తేదీన జరిగిన బాంబు పేలుడు అందర్నీ భయభ్రాంతులకు గురి చేసింది. తమిళులకు ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద బాంబు దాడికి పాల్పడింది లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్టీటీఈ). ఈ పేలుడులో 91 మంది చనిపోగా.. 1,400 మంది గాయపడ్డారు. ఈ ఘటనతో క్రికెట్ ప్రపంచం ఉలిక్కి పడింది. వరల్డ్‌కప్ కోసం తమ జట్టను పంపించేందుకు ఆస్ట్రేలియా, వెస్టిండీస్ బోర్డులు ససేమిరా అన్నాయి. భద్రతా కారణాల రీత్యా లంకు తమ జట్లను పంపిచమని ఇరుబోర్డులు స్పష్టం చేశాయి. ఈ పరిస్థితుల్లో భారత్, పాక్ బోర్డులు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
శ్రీలంకలో భద్రతకు ఢోకా లేదని నిరూపించేందుకు ఇరుదేశాల ఆటగాళ్లను పంపించాలని తీర్మానించాయి. అప్పటివరకూ ప్రత్యర్థులుగా తలపడిన భారత్, పాక్ ఆటగాళ్లు.. శ్రీలంకలో క్రికెట్ వరల్డ్ కప్ జరగాలనే ఉద్దేశంతో జట్టుగా ఏర్పడ్డారు. మహహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్‌గా.. సచిన్ టెండూల్కర్, వకార్ యూనిస్, వసీం అక్రమ్, అనిల్ కుంబ్లే, సయూద్ అన్వర్, ఇజాజ్ అహ్మద్ బృందం లంకకు చేరుకుంది. ఈ సందర్బంగా అజారుద్దీన్ బృందానికి లంకేయులు అపూర్వ స్వాగతం పలికారు.
‘ధైర్యవంతులైన భారత్, పాక్ ఆటగాళ్లకు నమస్కరిస్తున్నాం. భారత్, పాక్, శ్రీలంక స్నేహం వర్ధిల్లాలి’ అని ప్లకార్డులు ప్రదర్శించారు. 40 ఓవర్ల మ్యాచ్‌లో తొలుత ఆడిన శ్రీలంక.. 9 వికెట్ల నష్టానికి 168 రన్స్ చేయగా.. సచిన్(36) మెరుపులతో భారత్, పాక్ టీమ్ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌తో శ్రీలంకలో వరల్డ్‌కప్ ఆడేందుకు ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లు బోర్డులు అంగీకరించాయి. 1996 ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడించి ఫైనల్ చేరిన లంక.. టైటిల్ పోరులో ఆసీస్‌పై 7 వికెట్ల విజయంతో తొలిసారి విశ్వవిజేతగా అవతరించింది. తాము కష్టకాలంలో ఉన్నప్పుడు భారత్, పాక్ అండగా నిలవడం ఎప్పుడూ మర్చిపోమని ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికైన సనత్ జయసూర్య తెలిపాడు.