న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యశాల.. కొత్త దిశగా అడుగులు వేస్తున్నది. ఆధునిక ముఖ మార్పిడి(Face Transplantion) చికిత్సను తమ ఆస్పత్రిలో ప్రవేశపెట్టనున్నది. దీని కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రి అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. కాలిన గాయాలతో ఇబ్బందిపడేవారికి.. తీవ్రమైన రీతిలో ముఖం దెబ్బతిన్నవారికి.. చికిత్సను అందించే ఉద్దేశంతో ఢిల్లీ ఎయిమ్స్ వైద్యశాల కొత్తగా ఫేస్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేస్తున్నట్లు తెలిసింది. ఫేస్ ట్రాన్స్‌ప్లాంట్ అనే వైద్య విధానం చాలా అత్యాధునికమైంది. సంక్లిష్టమైన నిర్మాణాత్మక సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి ముఖంలోని భాగం ఏదైనా దెబ్బతిన్నా లేక మార్పు చేయాలనుకున్నా.. ఈ విధానంలో చికిత్సను అందించనున్నారు. డోనార్ నుంచి తీసుకునే కణజాలం ద్వారా ఫేస్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్సను చేస్తారు.
ముఖ మార్పిడి చికిత్స గురించి ఎయిమ్స్‌లోని డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లాస్టిక్, రీకన్స్ట్రక్టివ్ అండ్ బర్న్ సర్జరీ డాక్టర్ మనీశ్ సింఘాల్ మాట్లాడారు. యాసిడ్ వల్ల ముఖం కాలిన వారు, తుపాకీ తూటాలకు ముఖం చెదిరిన వారు, ఇంకా పలు రకాల ఫేస్ డిఫార్మిటీస్ ఉన్నవారు, 10 సార్లు సర్జరీ అయినా కోలుకోని వారి కోసం కొత్త తరహా ఫేస్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు మొదలుపెట్టనున్నట్లు ఆ డాక్టర్ వెల్లడించారు. ఎయిమ్స్ వైద్యశాలలో ఇలాంటి సదుపాయాలను కల్పించడం ఇది ప్రజలకు ఉపయోగకరమవుతుందన్నారు. ముఖ మార్పిడి అనేది అత్యంత అరుదైన శస్త్రచికిత్సా విధానం అని, ఈ ప్రక్రియ ద్వారా రోగులను ఆకర్షణీయంగా మార్చవచ్చు అని సింఘాల్ అన్నారు. అత్యంత సంక్లిష్టమైన ఈ సర్జరీలను చేపట్టాలంటే.. చాలా ట్రైనింగ్ అవసరమన్నారు. పలు శాఖలు కూడా దీనికి సహకరించాల్సి వస్తుందన్నారు.
ఫేషియల్ ట్రీట్మెంట్కు ప్లాన్ చేస్తున్న ఢిల్లీ ఎయిమ్స్ వైద్యశాల . . దీని కోసం తాజాగా వర్క్‌షాప్, అకాడమి ట్రైనింగ్‌ను ఏర్పాటు చేసింది. ఫేస్ ట్రాన్స్‌ప్లాంట్ సమయంలో నెఫ్రాలజీ వైద్యుడి అవసరం కూడా చాలా ఉంటుందని నెఫ్రాలజీ శాఖ ప్రొఫెసర్ డాక్టర్ దీపాంకర్ భౌమిక్ తెలిపారు. ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం డోనార్ అవసరం ఉంటుందని, ట్రాన్స్‌ప్లాంటేషన్ సమయంలో చికిత్స పొందుతున్న వ్యక్తి ఇమ్యూన్ వ్యవస్థ కణజాలాన్ని తిరస్కరిస్తుందని, అయితే రిజక్షన్ను నివారించేందుకు డ్రగ్స్ ఇస్తామని, డ్రగ్స్ విషయంలో అనుభవం ఉండడం వల్ల ఈ చికిత్స సాధ్యం అవుతుందన్నారు.ఇమ్యూనోసప్రషన్ కీలక పాత్ర పోషిస్తుందని, దీనికి కావాల్సిన సదుపాయాలు ఎయిమ్స్‌లో ఉన్నట్లు ఆయన చెప్పారు.