గద్వాల, ఆగస్టు 17 : గ్రంథాలయాలు విజ్ఞాన బండాగారాలు అంటారు.. అక్కడికి వెళితే పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి అవసరమైన పుస్తకాలు, మెటీరియల్ ల భిస్తుందని అందరూ భావిస్తారు. కానీ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం వారి అవసరమైన పుస్తకాలు అక్కడ కనిపించవు. పేరుకు మాత్రమే జిల్లాలో 13 గ్రంథాలయా లు ఉన్నా అన్నింటా సమస్యలు తాండవిస్తున్నాయి. అ యినా వీటి గురించి పట్టించుకునే వారు లేకుండా పో యారు.
దీనికి కారణం గ్రంథాలయాలపై రాజకీయ జో క్యం ఉండడం, అవగాహన లేని వారికి చైర్మన్లు నియమిస్తుండడంతో వారు గ్రంథాలయాల్లో నెలకొన్న సమస్యలపై పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రంథాలయాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా గ్రంథాలయంలో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులతోపాటు అయిజ, వడ్డేపల్లి గ్రం థాలయాల్లోని నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు.
అయినా పాలకుల్లో గ్రంథాలయాల సమస్యలు పరిష్కరించాలనే ఆలోచన కనిపించడం లేదు. దీంతో గ్రంథాలయానికి వచ్చి వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు మహబూబ్‌నగర్‌కు చెందిన గ్రంథాలయ కార్యదర్శికి జోగుళాంబ గద్వాల జిల్లా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడతో ఆయన చుట్టపు చూపుగా ఇక్కడకు వచ్చిపోతున్నారు. నెలకు ఒకటి, రెండు సార్లు మాత్రమే వచ్చి వెళ్తున్నట్లు పాఠకు లు ఆరోపిస్తున్నా రు.
గత ప్రభుత్వం గ్రంథాలయాలను అభివృద్ధి చేసి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి అవసరమైన పుస్తకాలతోపాటు మెటీరియల్ సిద్ధంగా ఉంచి వారు మంచి వాతావరణంలో చదువుకోవడానికి అవకా శం కల్పించింది. ఈ ప్రభుత్వం గ్రంథాలయాను గాలికి వదిలేయడంతో నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. కోచింగ్ సెంటర్లకు వెళ్లి రూ.వేలకు వేలు ఫీజులు కట్టలేని పేదవారికి గతంలో ఈ గ్రంథాలయాలు బాగా ఉపయోగపడ్డాయి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించక పోవడంతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు నిరాశ చెందుతున్నారు.
జిల్లాలో13 గ్రంథాలయాలు..
జోగుళాంబ గద్వాల జిల్లాలో 9శాఖా గ్రంథాలయాలు, నాలుగు గ్రామీణ గ్రంథాలయాలు ఉన్నాయి. ఇం దులో గట్టు, అ లంపూర్, మానవపాడు, ధరూర్ గ్రంథాలయాల కు మాత్రమే సొంత భవనా లు ఉన్నాయి. మిగతావి గ్రామ పంచాయతీల దాతల సహకారంతో ఉచిత భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈ గ్రంథాలయాల్లో అని అరకొర వసతులే ఉన్నాయి. దీంతో పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ పని చేసే సిబ్బంది చదువుకునే వారికి ఉదయం పుస్తకాలు ఇచ్చి పుస్తకాల గదికి తాళం వేసుకొని వెళ్లి తిరిగి సాయంత్రం వస్తున్నట్లు పాఠకులు ఆరోపిస్తున్నారు. దీంతో మధ్యలో ఏదైనా పుస్తకం అవసరమైతే వారు వచ్చేంత వరకు వేచిచూడాల్సిందేనని చెబుతున్నారు.
పునాదులు, పిల్లర్లకే పరిమితమైన నూతన భవన నిర్మాణం
గ్రంథాలయం రేకుల షెడ్లో కొనసాగుతున్న విషయం గ్రహించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం నూతన భవనం మంజూరీ చేసింది. నూతన భవనం పంచాయతీ రాజ్ సబ్ డివిజన్ కార్యాలయం పక్కన నిర్మిస్తున్నారు. నూతన భవనం నిర్మాణం కోసం రూ.1.60కోట్లతో 2021లో అప్పటి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చే శారు. అయితే అధికారులు మళ్లీ ప్రతిపాదనలు మార్చి రూ.1.25 కోట్లతో నిర్మాణం చేపట్టేందు కు పనులు ప్రారంభించారు. పనులు పొం దిన కాంట్రాక్టర్‌కు బిల్లులు రాకపోవడంతో పునాదులు పూర్తి చేసి పిల్లర్లు వేసి పను లు ఆపేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రంథాలయంలో మౌలిక వసతులు కల్పించడంతోపాటు నూతన భవనం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పాఠకులు కోరుతున్నారు.
జిల్లా గ్రంథాలయంలో వసతులు కరువు..
జిల్లా కేంద్రంలోని కేఎల్ఐ క్యాంప్‌లోని గ్రంథాలయం పేరుకు మాత్రమే జిల్లా గ్రంథాలయం కానీ వసతులు మాత్రం శూన్యం. ఈ గ్రంథాలయానికి వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడానికి జిల్లా కేంద్రంలోని అభ్యర్థులతోపాటు వివిధ ప్రాంతాల నుంచి చదువు కోవడానికి వస్తుంటారు కానీ వారికి సరైన వసతులు లేవు. ప్రస్తుతం గ్రంథాలయం రేకుల షెడ్లో కొనసాగిస్తున్నారు. రేకుల షెడ్లో హాల్‌తోపాటు ఐదు గదులు ఉన్నాయి. అయితే ఇందులో ఒకటి చైర్మన్ కార్యాలయానికి, మరొక గదిలో కంప్యూటర్లను భద్రపరిచారు. దీంతో చదువుకునే గదులు సరిపోక అభ్యర్థులు నేలపై కూర్చొని చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది.
సుమారు రోజు గ్రంథాలయానికి 150 నుంచి 200 మంది దాకా పుస్తకపఠనం, పేపర్ చదివే వారితోపాటు పోటీ పరీక్షలకు చదువుకోవడానికి అభ్యర్థులు వస్తుంటారు. వీరికి అవసరమైన మరుగుదొడ్లు లేకపోవడంతో పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు. వీరందరికీ కలిపి రెండు టాయిలెట్స్ మాత్రమే ఉన్నాయి. వీటిని కూడా సరిగా శుభ్రం చేయకపోవడంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్నది. ఈ కారణంగా ప్రస్తుతం ఉన్న రెండు టాయిలెట్స్‌ను బంద్ చేసినట్లు తెలిసింది.
దీంతో గ్రంథాలయానికి వచ్చే వారికి సరైనా మూత్రశాలలు లేక పోవడంతో మహిళా అభ్యర్థులు మరింత ఇబ్బందులు పడుతున్నారు. ఇక కరెంట్ పోతే ఫ్యాన్లు పనిచేయవు గదులన్నీ చీకటి మయం అవుతుండడంతో చదువుపై దృష్టి పెట్టలేక పోతున్నామని పాఠకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధాహ్నం వేళ భోజనం చేయాలంటే గ్రంథాలయంలో వసతులు లేక పోవడంతో గ్రంథాలయానికి చదువుకోవడానికి వచ్చే వారు ఇరుకు గదుల్లోనే భోజనం చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు.