వనపర్తి, మే 2 (నమస్తే తెలంగాణ) : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు నీలినీడలు కమ్ముకుంటున్నాయి. వనపర్తి జిల్లాలోని 15మండలాల వారీగా ఒక్కో గ్రా మాన్ని ప్రత్యేకంగా ఎంచుకొని అప్పట్లోనే స్రొసీడింగ్లు ఇచ్చారు. జనవరి 26వ తేదీన ఇండ్ల పథకంతోపాటు మరికొన్ని పథకాలను కూడా ప్రభుత్వం అట్ట్టహాసంగా ప్రారంభించింది. ఒక నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేస్తామని, ఇందుకు ఎమ్మెల్యేనే పైనల్ అథారిటీగా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా 1,127 మందికి ఎంపిక చేసిన 15 గ్రామాల్లో ఇందిరమ్మ లబ్ద్ధిదారుల ప్రొసీడింగ్స్‌ను ఇచ్చారు.
జిల్లాలో ఎంపిక చేసిన 15 గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకం అనుకున్న స్థాయిలో ముందుకు సాగడం లేదు. ఇక ప్రత్యేక గ్రామాల్లోనే ఇలా ఉంటే, ఇక త్వరలోనే అన్ని గ్రామాల్లోనూ అలజడి మొదలు కాబోతున్నది. ఇప్పటి వరకు 1,127 ఇండ్లకు ప్రొసీడింగ్స్ ఇవ్వగా, 415 ఇండ్లకు మాత్రమే 15 గ్రామాల్లో పునాదులు తవ్వడం కోసం ముగ్గు పోశా రు. వీటిలో కేవలం 110 మంది మాత్రమే పునాదుల వరకు నిర్మాణాలు చేసుకున్నారు. మిగితా లబ్ధిదారులంతా వెనకా, ముందు అవుతున్నారు.
మండల పరిషత్ అధికారులు ఎన్ని దఫాలు చెప్పినా నిర్మాణాలను చేపట్టడం లేదు. ఇదిలా ఉంటే, బేస్మెంట్ లెవెల్ వరకు నిర్మాణం చేసుకున్న వారిలో కేవలం 45మందికి మాత్రమే రూ.లక్ష బిల్ ఇచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇంకా మిగిలిన లబ్ధిదారులు నెల రోజుల నుంచి ఆశతో ఎదురు చూస్తున్నారు. ఒక ఇంటికి రూ.5లక్షలు ఇస్తామని ప్రభుత్వం చెప్పగా, మూడు విడుతలుగా బిల్లులు చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం చెప్పిన కొలతల ప్రకారం ఇండ్ల నిర్మాణానికి లబ్ధిదారులు గ్రామాల్లో సుముఖంగా కనిపించడం లేదు.
జిల్లాలోని 15 మండల కేంద్రాల్లో మోడల్ హౌజ్ నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం తలచింది. ముందుగా వీటి నిర్మాణం చేయించి ఆయా ప్రాంతాల్లో లబ్ధిదారులకు మోడల్‌గా ఈ ఇండ్లను చూపించాలని నిర్ణయించారు. ఇలా మొదలెట్టిన మోడల్ నిర్మాణాలు కూడా నత్తనడకన సాగుతుండటం విమర్షలకు దారితీస్తున్నది. ఒక్క జిల్లా కేంద్రం మినహా ఇతర ప్రాంతాల్లో కొలిక్కి రావడం లేదు. గోపాల్పేట, రేవల్లి, ఏదుల, అమరచింత మండలాల్లో మోడల్ ఇండ్ల పనులే ప్రారంభించలేదు.
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తున్నది. ఇందుకు ఎమ్మెల్యేలనే సుప్రీమ్‌గా నిర్ణయిస్తూ ఫైనల్ చేసింది. ఈ మేరకు ఎమ్మెల్యేలు కూడా అన్ని గ్రామాలకు సంబంధించిన లిస్టులను కలెక్టర్లకు అందజేశారు. అయితే, ఈ లిస్టులకు సంబంధించి ప్రత్యేక అధికారులతో సర్వే చేస్తున్నారు. ఏప్రిల్ 30న ఫైనల్ లిస్టును ప్రకటించాల్సి ఉన్నా సర్వే పూర్తి కాలేదు. ప్రస్తుతమున్న నిబంధనలు ఆటంకాలు కలిగిస్తున్నాయని ఇందిరమ్మ కమిటీల బాధ్యులు తలలు పట్టుకుంటున్నారు.
మరికొన్ని చోట్ల సభ్యులు తమ పేర్లను లిస్టులో ఉంచాలన్న తగవులు కూడా ఉన్నాయి. అధికారులు సర్వే చేసి తొలగించినా సరే.. లిస్టులో పేర్లు ఉండాలని మరికొన్ని చోట్ల కమిటీ సభ్యులు పట్టుబడుతుండటం ఆలస్యానికి కారణమవుతున్నట్లు తెలుస్తున్నది. వీపనగండ్ల మండలంలోని తూంకుంట, సంగినేనిపల్లి, కల్వరాల గ్రామాల్లో ఇప్పటి వరకు సర్వేలో అడుగులు పడలేదంటే జిల్లాలో సర్వే ఎలా కొనసాగుతుందో అర్థమవుతున్నది.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచుతాం. ఉగాది తర్వాత పనులు చే యాలన్న లక్ష్యంతో చాలా మంది ఆలస్యం చేశారు. కొన్ని చోట్ల ముందుకు రా వడం లేదు. కొన్ని ప్రొసీడింగ్‌లు క్యాన్సిల్ అయ్యా యి. ప్రభుత్వ సూచనల మేరకు నిర్మాణం చేసుకోవాలి. మూడు విడుతల్లో బిల్లులు అందజేస్తాం. 17-22 ఫీట్ల సైజు లో నిర్మాణం జరగాలి. ప్రత్యేక గ్రామాల నిర్మాణాలను త్వరితగతిన చేపడుతాం. పూర్తి చేసుకు న్న వారికి బిల్లులు చెల్లిస్తాం.
– జీ పర్వతాలు,ప్రాజెక్టు డైరెక్టర్, హౌసింగ్, వనపర్తి జిల్లా