వనపర్తి, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : సన్న వడ్లకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లే ఇచ్చి.. కొనుగోళ్లు చేయడంలో కొత్త కొర్రీలు తెరపైకి తీసుకొచ్చింది. సర్కార్ ఎంపిక చేసిన వాటితోపాటు ప్రైవేట్ కంపెనీల సన్న రకాలు కూడా అధికంగా సాగు చేయడమే ఇందుకు కారణంగా కనిపిస్తున్నది. బియ్యపు గింజ పొడవు.. మందం ప్రామాణికంగా సన్న వడ్ల క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు పక్షం రోజుల్లో కోతలు ప్రారంభమవుతున్న క్రమంలో నూతన విధానంపై ఏఈవోలకు ప్రత్యేకంగా శిక్షణను కూడా ఇస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
అయితే, వనపర్తి జిల్లాలో 150 రకాల వరి సాగుబడులున్న క్రమంలో ప్రభుత్వం కేవలం 33 రకాలనే గుర్తించిన అంశంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇదిలా ఉండగా, వనపర్తి జిల్లాలో 1.90 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. వర్షాలు అధికంగా కురవడంతో చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్నాయి. సన్న రకాలకు బోనస్ ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో రైతులు అధికంగానే వరి సాగు చేశారు. దసరా తరువాత పక్షం రోజుల్లో వరి కోతలు మొదలయ్యే అవకాశం ఉన్నది. అయితే, ప్రభుత్వం అందిస్తున్న బోనస్ అన్ని రకాల వడ్లకు వచ్చే అవకాశం లేకపోవడంతో విమర్శలు వెలువడుతున్నాయి.
వరికి సంబంధించి ప్రభుత్వం బోనస్ ఇచ్చేందుకు 33 సన్న రకాలను మాత్రమే గుర్తించింది. వీటికి ఎక్కు వ ప్రాధాన్యత ఉన్నందునా ముందస్తుగానే వంగడాలను ఎంపిక చేసింది. అయితే, ప్రభుత్వం గుర్తించిన వాటినే కాకుండా ప్రైవేట్ వ్యాపారులతో ఉన్న మేలైన రకాలను కూడా రైతులు సాగు చేశారు. ప్రభుత్వం గుర్తించిన రకాలు సగం ఉంటే, మరో సగం ఇతర రకాలు ఉన్నట్లుగా అంచనా. దీన్ని బట్టి కొనుగోళ్లు ఎలా జరుగుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒక్క వనపర్తి జిల్లాలోనే సుమారు 150 రకాలను సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అంచనా. అయితే, జిల్లాలో సాగైన అన్ని సన్నరకాలను కొనుగోలు చేస్తారా లేక.. ప్రభుత్వం గు ర్తించిన రకాలనే కొంటారా అనే విషయంపై స్పష్టత లేదు. కేవలం 33 రకాలకే బోనస్ అంటే మాత్రం.. అత్యధిక రైతులు నష్టపోయే అవకాశం ఉన్నది.
గతంలో మాదిరి కాకుండా సన్న రకాలకు కొలతల ద్వారా లెక్కలు వేసి కొనుగోలు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ క్రమంలో డయల్ మైక్రో మీటర్స్, డిజిటల్ మైక్రో మీటర్స్ ద్వారా కొనుగోలు చేసేందుకు శ్రీకా రం చుట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా ఏఈవోలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే కలెక్టరేట్లో గత నెల 30వ తేదీన ట్రైనింగ్ ఇచ్చారు. రెండో విడుతలోనూ ఆయా డివిజన్ల వారీగా శిక్షణ కొనసాగిస్తున్నారు. కొత్త నిబంధనల మేరకు సన్న రకాల వడ్ల గింజ 6 మిల్లీమీటర్ల కంటే తక్కువ పొడవుండాలి. 2 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ మందం ఉండొద్దు. ఈ రెండింటి ద్వారా వచ్చే నిష్పత్తి ప్రకారం 2.5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ ఉండాలి. ఇలా వచ్చే కొలతలను బట్టి సన్నాలను కొనుగోలు చేయడం నిర్ణయిస్తారు. ఈ లెక్కలకు సరిపోని ధాన్యం సన్నాల కిందకు వచ్చే అవకాశం లేదు. దీంతో రైతన్నలు నష్టపోయే ప్రమాదం ఉన్నది.
సన్న రకాలపై ప్రభుత్వ నిబంధనల మేరకు వ్యవహరిస్తాం. డిజిటల్ మైక్రో మీటర్ల ద్వారా ధాన్యపు గింజలను కొలుస్తారు. నిబంధనల మేరకు సైజు రావాలి. గింజ పొడవు 6 మిల్లీమీటర్లలోపు, మందం(లావు) 2 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ ఉండొద్దు. దీనికి లోబడి ఉన్న వాటినే సన్న రకాలుగా గుర్తిస్తారు. 33 సన్న రకాలను ప్రభుత్వం జీవో నెంబర్ 27 ప్రకారం గుర్తించింది. వీటిపై జిల్లాలో ఏఈవోలకు శిక్షణ కొనసాగుతున్నది. పూర్తిస్థాయిలో అన్ని విషయాలపై అవగాహన కల్పిస్తూ.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు జరిపేందుకు వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతున్నది.
– గోవింద్‌నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి, వనపర్తి