పెంట్లవెల్లి, ఆగస్టు 4 : పెంట్లవెల్లికి సమీపంలో ఉన్న కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ కావడంతో 18మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. కేజీబీవీలో గత కొద్దిరోజుల నుంచి భోజనం సరిగా లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నా.. అడపాదడపా అస్వస్థతకు గురవుతున్నా ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా పాఠశాల సిబ్బంది గోప్యంగా ఉంచారు. కొంతమంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కేజీబీవీ సిబ్బంది వారికి ఏవో టాబ్లెట్లు ఇచ్చారు.
విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో పరిస్థి తి కాస్త విషమించిందని గుర్తించి వెం టనే వైద్య సిబ్బందికి సమాచారం అం దించారు. వైద్య సిబ్బంది అక్కడికి వచ్చి 18 మంది విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం కొల్లాపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఆ సమయం లో కొంత మంది విద్యార్థినులు రోధిస్తూ అంబులెన్స్ ఎక్కడం స్థానికంగా ఉన్నవారిని కంటతడి పెట్టించింది. ఈ తతంగం అంతా స్టే ట్ కోర్డినేటర్ శీరిష ఎదుట జరగడం విశేషం. అయితే ఆదివారం మధ్యాహ్నం జిల్లా విద్యాధికారి గోవిందరాజులు ఎవరికీ తెలియకుండా పాఠశాలకొచ్చి పరిశీలించి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు.
విద్యార్థినుల అస్వస్థత విషయం తెలుసుకున్న ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దవాఖానకు వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.