మహబూబ్‌నగర్ అర్బన్, ఫిబ్రవరి 6 : కల్లు పైసలు ముట్టలేదని.. బీజేపీకి పోను అని ఎల్లమ్మ దేవాలయం వద్ద కు వచ్చి చెప్పమను.. గౌడ్ల కష్టంతో నీ బండ్లు నడుస్తున్నా యి.. నీ క్యాంప్ ఆఫీస్ నడుస్తుంది.. లెక్కలతో సహా బయట పెడతా అని స్థానిక ఎమ్మెల్యేపై మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీజేపీలోకి పోయి ఎమ్మెల్యే అయిన నాడు.. మహబూబ్‌నగర్‌కు ఏం చేసినవో చెప్పు.. దాని తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లి కాంగ్రెస్‌లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి నీవు ఇప్పుడు మళ్లీ బీజేపీలోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్న నీవు..
కాంగ్రెస్‌లోనే ఉంటానని, బీజేపీలోకి వెళ్లనని ప్రమాణం చేస్తావా.. సవాల్ విసిరారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీడీ గుట్ట, చిన్నదర్పల్లి, కిద్వాయ్ పెట్, మోనప్పగుట్ట డివిజన్లలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ట్యాంక్‌బండ్‌ను హైదరాబాద్ కంటే మంచిగా అభివృద్ధి చేయాలని అనుకున్నాం.. దానిని ఆపేయడంతో అక్కడ పరిస్థితి చూసి భావోద్వేగానికి గురయ్యాను. దీనిపై కాంగ్రెస్ నాయకులు అవాక్కులు చవాక్కులు మాట్లాడడం తగదని మండిపడ్డారు.
బస్టాండ్‌కు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో దవాఖాన ఓపెన్ చేయమంటే ఉరికి దూరంగా కట్టాలని అంటావు.. ప్రజలు సావాలని అనుకుంటున్నావా..? ఎందుకు అంత అహంకారం అని ప్రశ్నించారు. హజ్ హౌస్, మార్కెట్, ట్యాంక్ బండ్, కల్యాణమండపం, మైనారిటీ గురుకులాలను పూర్తి చేయమంటే అహంకారంతో మాట్లాడుతున్నావు. ప్రతిపక్ష నాయకులూ అడిగితే పొరపాట్లు ఉంటే సరి చేస్తామని చెప్పడం పోయి వ్యక్తిగతంగా మాట్లాడటం ఎందుకన్నారు.
కాంట్రాక్టర్లు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మాట్లాడుతున్నావు.. మీ ప్రభుత్వంలో మరి 20 శాతం కమీషన్‌ను బిల్లులు ఇవ్వడానికి అడుగుతున్నారు.. ఇవ్వకుంటే బిల్లులే ఇవ్వడం లేదు.. చేతనైతే బిల్లులు ఇప్పించు అని సవాల్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌లు లోపాయికారి ఒప్పందంతో అభ్యర్థులను నిలబెట్టారని ఆయన విమర్శించారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు టికెట్స్ ఇవ్వలేదని టికెట్లు అమ్ముకున్నారనీ మీ పార్టీ కార్యకర్తలే ఆరోపిస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఒంటరిగానే మేము వెళ్తున్నాం.. ఎక్కువ సీట్లు గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేశారు.
కల్లు, ఇసుక, వైన్ షాప్ దందాల మీద మీరు పడి నాయకులకు కూల్ పాయింట్స్ ఇచ్చి నోరుమూపించారు. మా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయ్ బయట పెడితే బాగుండదు బిడ్డా అని హెచ్చరించారు. మీరు పర్సనల్‌గా మాట్లాడితే మేము మాట్లాడాల్సి వస్తది.. తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. ఇప్పటి దాకా పార్టీ మీదనే మాట్లాడాను తప్పుడు మాటలు మానుకోకపోతే మీ బండారం మొత్తం బయటపెట్టాల్సి వస్తోందన్నారు. పార్టీ కోసం పని చేసిన వారిని కలుపుకొని వెళ్తున్నాం.. టికెట్ రాని వారికి భవిష్యత్‌లో మంచి అవకాశాలు కల్పిస్తాం అని అన్నారు.
మహబూబ్‌నగర్‌లో అభివృద్ధి కొనసాగాలి అంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మా ప్రభుత్వం వస్తే రూ.కోట్లాది నిధులు తెచ్చి నిలిచిన పనులతోపాటు కొత్త అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడతామని మాజీ మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ వెంకటయ్య, పార్టీ నాయకులు బాలరాజు, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.